ఎములాడల
నేను పన్నెండో తరగతి
సదువుకుంటున్నప్పుడు
ఫిజిక్స్ ను సురేందర్ రెడ్డి సారు సెప్పెటోడు.
ఆ సారు ఆంద్ర నుండి ఎములాడకు అచ్చిండు.
నేను డాక్టర్ ను కావాల్నని
బి.పి.సి తీసుకున్న.
ఫిజిక్స్ గొట్టు ఉందని
ఓ నలుగురం పోరగాల్లం
ఆ సారు దగ్గరికి
టివీశన్ పోయేటోల్లం.
మాతోటి ఒక పొల్ల గుడ అచ్చేది.
అందరికన్నా ముందుగాల
పొద్దుగాల ఏడు కొట్టక ముందే నేను,రవి కుమార్ కలిసి సారింటికి పోయేటోల్లం.
తతిమ్మొల్లు
ఏడు కొట్టినంకనే అచ్చేటోల్లు.
ఇగ సారు మాత్రం
రేడియల ఏడు గంటల ఐదు నిముశాలకచ్చే డిల్లీ ఆర్తలను
ఇన్నంకనే ఇంట్లకేయి
అచ్చేటోడు.
నా కాపిలనే, నా పెన్ను తోనే
రాసుకుంట పాటం జెప్పేటోడు
ఒగ మల్క ఏమైందంటే..
జెండ వందనమప్పుడు
కాలేజీల ఆటల పోటీలు జరిగేటివి.
కబడ్డి ఆటను సురేందర్ రెడ్డి సారు ఆడిచ్చిండు.
కూతకు పోయేటోన్ని
"ఇగ్గుర్రి.. ఇగ్గుర్రీ " ,
" గుంజుర్రి గుంజుర్రి" అని అంటే సారుకు అర్తం కాకపోయేది.
గట్లనే " ఎక్వ ఒర్రకుర్రి,
సప్పుడేక ఊకోర్రి,తొండి ఆట ఆడకుర్రి" ,అని అంటె గుడ తెల్వక పోయేది.
గీ మాటలకు అర్తం ఏందని
టివీశన్ల సారు నన్ను అడిగిండుల్లా!
ఆ మాటలకు అర్తాలు ఏందో జెప్పిన.
" ఇదేం తెలుగు భాష? ఒక్క మాట కూడా అర్థం కాలేదు" అని తీసేసినట్టు ఏదేదో అన్నడు. ఆ మాటలిన్నంక నాకు సుర్రుమన్నది.
ఎక్కన్నో కాలింది.
" సారూ! గిది ఊరు బాస.మా తెలంగాణ యాస. గిట్లనే ఉంటది.మనందరం వయిలల్ల సదువువుకునే బాస
ఆంద్ర బాసనాయే.
మా ఇండ్లల్ల
మాట్లాడే బాస ఒకటైతే
బడిల సదువు జెప్పే బాస ఇంకోటాయే.
మేము గా బాసను నేర్సు కోవడానికి కిందా మీదా పడ్డం.ఎంతో తిప్పల వడ్డం
మా తాతలు దిగచ్చిండ్రు.
గా మాటలు, పాటాలు, పాటలుఅర్తం గాక ఎంత బాద పడ్డమో మీకేం తెలుసు సార్!" అని నేను అనేసరికి సార్ పరేశాన్ అయిండు. నేను గట్లంటనని అస్సలు అనుకోలేదు గావచ్చు.
ఇగ గా ముచ్చట అచ్చింది గావట్టికెనే నా మనసుల ఉన్నది ఉన్నట్టు
ఆయింత ముచ్చట సెప్పిన.
"ఎవరి యాస ఆళ్లకు మంచి గుంటది. ఉండాలే గుడ.
గిండ్ల ఏ బాసా గొప్పది కాదు,
ఏ బాసా తక్వది కాదు సారూ!
తెలంగాణ యాసను సిన్న సూపు సూడకుర్రి. మేము ఎంత సదువు సదువుకున్నా మా యాసల మాట్లాడు కుంటేనే మాకు సంబురం. ఔ మల్ల! " అని నేను అనేసరికి సారు బీరిపోయి కట్టెసరుసక పోయిండు.సారు మనుసుల ఏమనుకున్నడో ఏమో గని
" సరే! ఆ విషయం పక్కకు పెట్టి పాఠం లోకి పోదాం" అని అంటూ సారు పాటం సెప్పుడు సురువు జేసిండు.
గీ ముచ్చట నలబై యేండ్ల కిందట జరిగిందుల్లా!
కాకి పిల్ల కాకికి ముద్దు.
ఔ మల్ల!
ఔ మల్ల!;-- బాలవర్ధిరాజు మల్లారం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి