ఔ మల్ల!; -- బాలవర్ధిరాజు మల్లారం

 నేను ఎనిమిదో తరగతిల
ఉన్నప్పుడు మా ఊరికి 
దేశ గురువు  గుఱ్ఱం మీద అచ్చిండు .
గా దేశ గురువు అత్తుండంటే
సర్పంచి,సుంకరోల్లు, ఊరోల్లు గుడ ఎందుకనో బయపడేటోల్లు. 
ఆ దేశ గురువు గుర్రమెక్కి
ఊరు ఊరంతా కలియ తిరిగిండట.
ఎక్కడోల్లు అక్కన్నే నిలబడి 
దండాలు పెట్టిండ్రట.
అయితే ఒక పిలగాడు మాత్రం
ఆల్ల ఆకిట్ల కుర్సి ఏసుకొని కూకొని వయిని సదువుకుంటుంటే
ఆల్ల నాన అచ్చి " అరేయ్! దేశ గురువు అత్తుండు. కుర్సిల నుంచి లేసి నిలుసో. దండం గుడ పెట్టాలే" అని అన్నడట కొడుకుతో
" దేశ గురువు అచ్చినా,
ఎవ్వరచ్చినా మనింట్ల మనం కూసుంటం. లేసుడెందుకు? దండం పెట్టుడెందుకు??
నేను లెవ్వ,దండం పెట్ట " అని ఆ పిలగాడు ఆల్ల నానతో అంటే
"నువ్వు గిట్ల కుర్సిల కూసుంటే
దేశ గురువు కంట్లే గాని పడితే
మంత్రాలు జేత్తడు" అని ఆ పిలగాని నాన బయపెట్టిండట.
కానీ ఆ పిలగాడు మాత్రం
అనుక లేదు,జెనుక లేదట.
" అన్మాండ్ల గుడి దగ్గరి దాకా అచ్చిండట. లేసి నిలుసో" 
అని సెప్పి బైటికి
ఎల్లిపోయిండట ఆ తండ్రి.
 ఆ పిలగాడు మాత్రం గట్లనే కుర్సిల కూకొని సదువుకుంటున్నడట. 
గా దేశ గురువు 
ఆల్ల ఇంటి ముందు నుండి పోయిన గని
అటెన్క కొంచెం సుత సూడనన్న సూడలేదట!
కానీ... మత్తడి కాడ 
దేశ గురువు ఎక్కిన గుఱ్ఱమును కడిగి తానం  జేపిత్తున్నరని తెల్వంగనే
ఉరికి ఉరికి పోయి గుఱ్ఱం ను సూసిండట.
గుఱ్ఱం ను వయిల  తప్ప నిజంగ ఎప్పుడు సూడలేదట.
గందుకనే గుఱ్ఱంను సూడ వోయిండట   
గంత సిన్నప్పటి నుండే 
దేశ గురువు బోడ పెత్తనాన్ని  సైస లేదుల్లా గా పిలగాడు! 
గట్లనే మా ఊరిల దొరల పెత్తనాన్ని గుడ పట్టిచ్చుకొలేదట.
దొరలను "దొర"లని అననోడు
మా ఊళ్ళే
గా ఒక్క పిలగాడేనుల్లా!
ఔ మల్ల!

కామెంట్‌లు