పరుగో ...పరుగు ..!!-- బి.రామకృష్ణారిడ్డి--వాషింగ్టన్ .

 పరుగు... పరుగు... పరుగు...
  ఆధునిక జీవనంలో ప్రతి మనిషి జీవన పయనం   పరుగుల మయమే! ప్రతి మనిషి  వయో ,లింగ,వృత్తి భేదం లేకుండా తన ఎదుటి వారి కన్నా పైకి ఎదగాలని ,లేక ఉన్నతంగా కనపడాలనే తాపత్రయం కావచ్చు ఈ పరుగు  లక్ష్యం .పుట్టిన పసిపాప తప్పటడుగులు వేసే వయస్సు నుండి త్వరగా ఎదగాలని, తన తోటి వారి కన్నా ఉన్నతంగా కనిపించాలనే  తాపత్రయంతో పరుగు పందెం మొదలవుతుంది. వయసు పెరిగే కొద్దీ పోటీతత్వం అధికమవ్వడంతో ఈ పరుగు వేగానికి కళ్లెం వేయలేక పోతున్నాము.
          ఇకపోతే పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించే క్రమంలో...  విదేశీ విద్యకు, విదేశ ఉద్యోగాలకు ఉన్న ప్రాధాన్యతకు  అనుగుణంగా అటువంటి వాటికి మొగ్గు చూపడం  చాలా రోజుల నుండి కనిపిస్తున్న అంశం. అభివృద్ధి చెందిన విదేశాలలోనున్న ఉన్నత వసతులకు అలవాటుపడి ,స్వదేశంలో మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ చాలామంది పిల్లలు స్వదేశాలకు రావటానికి ఇష్టపడక అక్కడే స్థిరపడి పోతున్నారు. అటువంటి పరిస్థితులలో ఉద్యోగ విరమణ చేసిన ,  వయోవృద్ధులైన తల్లిదండ్రులు కేవలం పిల్లలను చూడాలనే తాపత్రయంతో వ్యయప్రయాసలకోర్చి విదేశీ ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు .
    ప్రస్తుతం నేను ఇక్కడ పొందుపరచాలి అనుకున్న విషయం ..నా అమెరికా ప్రయాణ సన్నాహక విశేషాలు. సహజంగా చాలామంది తల్లిదండ్రులు ఈ అనుభవాలను చవి చూసినప్పటికీ  స్వీయ అనుభవంలో కలిగినటువంటి అనుభూతిని తోటి మిత్రులతో పంచుకోవాలనే  తాపత్రయమే ఈ అక్షర రూపం.
    మాకున్న ఇద్దరు పిల్లలు కూడా అమెరికాలో   దాదాపు పదిహేను సంవత్సరాల నుండి ఉంటూ, అప్పుడప్పుడు ఇండియాకి వస్తూ పోతూ ఉన్నారు. నేను కూడా 2018 సంవత్సరంలో నాలుగు నెలలపాటు అమెరికాలో పిల్లలతో గడిపాను. గత రెండు సంవత్సరాలుగా నెలకొన్న కోవిడ్ ఆంక్షల కారణంగా  ఒకరినొకరం ప్రత్యక్షంగా కలవలేకపోయాము. ఈ మధ్య కాలంలోనే ఇద్దరు పిల్లలు సొంత ఇంటిని ఏర్పరచుకున్నారు. అలాగే మాకు వంశోద్ధారకుడు కూడ18 నెలల క్రితం ఉద్భవించాడు అమెరికాలోనే .ఇవి శుభ సంఘటనలే...అయినప్పటికిని వాటిని ప్రత్యక్షంగా చూడలేదు , - అనుభూతి చెందలేదు.   నాలుగు రోజుల క్రితమే అమెరికాకు చేరుకోవడంతో ఆ వెలితిని పూడ్చుకో  గలిగాము. 
   మూడు నెలల క్రితము టికెట్ బుక్ చేయడంతోనే అమెరికా ప్రయాణానికి కావలసిన సన్నాహకాలు, పరుగులు మెదలయ్యాయి మాకు ఇండియాలో. చాలా రోజుల తర్వాత పిల్లలను కలవబోతున్నామనే ఆనందంతో వారికి అవసరమైన - అవసరం లేని వస్తువులను,  తినుబండారాలను సమకూర్చి ఆరు బ్యాగ్స్ లో నింపాము. ఒక్కో బ్యాగులో పరిమితికి లోబడి బరువును ఇవ్వవలసిన క్రమంలో వస్తువులను/ బ్యాగులను మార్చి మార్చి సరిచూసుకొనే తతంగం ఒక సర్కస్ విన్యాసం లాగా అనిపించింది.
  వేచి చూసిన ప్రయాణపు తేదీ రానే వచ్చింది అంతకు మునుపే తోటి బంధుమిత్రులతో  నా ప్రయాణం గురించి తెలియజేయడం వలన ఆ రోజు ఉదయం నుండి సుఖప్రయాణం   సందేశాలు మొబైల్లో దర్శనమిస్తున్నాయి. అందులో కొందరు మిత్రులు "Bon voyage" రెడ్డిగారు ...అనే సందేశం పంపారు .నిజంగా ఆ పదానికి అర్థం నాకు అంత వరకు తెలియదు. తిరిగి వారిని ప్రశ్నించాను ఆ పదానికి అర్థం ఏమిటి ...అని  మెసేజ్ రూపంలోనే. వారిచ్చిన సమాధానం హ్యాపీ జర్నీ అని.. నాకెందుకో ఆ సమాధానం సరైనదే అయినప్పటికిని మరో విశేష అర్థం ఉంటుందేమో అనే సందేహం కలిగింది . ప్రయాణంలో ఈ విషయం గురించి మా శ్రీమతితో చర్చించినప్పుడు  ఆమె నవ్వుతూ సమాధానం చెప్పింది ..శుభ విదేశీయానం.. అని.
  ఇక ఉపోద్ఘాతంలో సుత్తి కొట్టిన పరుగు విషయానికి వస్తే ...మా పరుగు ఇంటి దగ్గర నుండి ముందుగా సమకూర్చుకున్న టాక్సీ తోనే మొదలైంది. మేము ప్రయాణించ వలసిన విమానము  హైదరాబాదులో రాత్రి 8:30 కి కావున , మల్కాజిగిరి నుండి సాయంత్రం 4 గంటలకే బయలుదేరాలని ముందుగానే నిర్ణయించుకున్నాము. కానీ  అనేక కారణాల వలన 30 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాము .విమానాశ్రయానికి ఒక గంటలో చేరుకోవలసిన టాక్సీ విపరీతమైన ట్రాఫిక్ మూలంగా 1:45 నిమిషాల టైమ్ తీసుకుంది . డ్రైవర్ తెలియజేస్తున్నప్పటికీ, నా అతి తెలివితో  డొమెస్టిక్ డిపార్చర్ లో దిగవలసిన టాక్సీని  ఇంటర్నేషనల్ డిపార్చర్ కి తీసుకెళ్ళాను. కారణం మేము విదేశాలకు వెళ్తున్నాము కనుక ,విమానం కూడా విదేశీ టెర్మినల్ నుండి బయలు దేరుతుంది ..అనే ఉద్దేశంతో.  డ్రైవరు రెండు లగేజ్ ట్రాలీలో  మా బ్యాగులను సర్ది పేమెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. లగేజ్  పోర్టర్ గురించి  15 నిమిషాలు వెయిట్ చేయాలనే సమాాచారముుతో మేమిద్దరమే లగేజి ట్రాలీలతో గేటు వైపు బయలుదేరాము. గేటు దగ్గర సెక్యూరిటీ వారు టికెట్ చెక్ చేసి " మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? డొమెస్టిక్ సర్వీసు అప్పర్ డెక్ పైన ఉన్నది. అక్కడికి త్వరగా వెళ్ళండి."  అని పురమాయించారు .అప్పర్ డెక్ పైకి వెళ్ళటానికి ఎస్కలేటర్ తప్ప లగేజ్ తీసుకుని వెళ్లే మార్గం కనిపించలేదు. తిరిగి వారిని ప్రశ్నిస్తే మీరు వచ్చిన దారిన క్రింద వరకు వెళ్లి, అక్కడినుండి ర్యాంపు ద్వారా పైకి వెళ్ళండి అని సలహా ఇచ్చారు. తిరిగి ఆ మార్గం ద్వారా కౌంటర్ దగ్గరికి రావటానికి మాకు దాదాపు పదిహేను నిమిషాలు టైం పట్టింది .తిరిగి డొమెస్టిక్ టర్మినల్ దగ్గరి  సెక్యూరిటీ వారు టికెట్ చెక్ చేసి  మూడవ కౌంటర్లో లగేజ్ చెకిన్  చేయమన్నారు. అక్కడికి వెళ్లి లైన్లో నిల్చున్న తర్వాత మేము గమనించిన విషయం ఆ కౌంటర్లు ఇండిగో ఫ్లైట్ కి సంబంధించినవి. అక్కడ ఉన్న పాసింజర్స్ ద్వారా ఇది సరైన కౌంటర్ కాదు, ఎయిర్ ఇండియా ఫ్లైట్ కౌంటర్ ఒకటో నెంబరు గేటు అని తెలిసిన తర్వాత తిరిగి అక్కడికి త్వరగా చేరుకున్నాము. అప్పుడు సమయం గమనిస్తే ఫ్లైట్  బయల్దేరడానికి కేవలము ఒక గంట సమయం మాత్రమే  మిగిలింది. అప్పటికే దాదాపు 80 శాతం మంది ప్రయాణికులు చెకిన్ అయిపోయి, సెక్యూరిటీ చెక్ దగ్గర ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు .అప్పుడు మాకు టెన్షన్ తో చెమటలు పట్టాయి .ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తిచేసి ,అనుకున్న ఫ్లైట్  అందుకోగలమా ? అనే భయాందోళన మొదలైంది .అప్పటికే కౌంటర్లు ఫ్రీ అవ్వడం వలన మా లగేజ్ చెకిన్, బోర్డింగ్ పాస్ లు, - సెక్యూరిటీ చెక్ పూర్తిచేసుకుని ఒక అరగంట ముందుగానే బోర్డింగ్ పాస్  చెక్ చేసే చివరి గేటు దగ్గరికి వచ్చాము . మా ఇద్దరికీ సంబంధించిన బోర్డింగ్ పాస్ లలో రెండు హైదరాబాద్ నుండి ఢిల్లీకి ,మరో రెండు ఢిల్లీ నుండి అమెరికాకు సంబంధించినవి చేతిలో ఉన్నాయి. కానీ  హైదరాబాదులో ఎక్కవలసిన ఫ్లైట్ కి సంబంధించిన బోర్డింగ్ పాస్ లలో  నా పేరుకు సంబంధించిన పాసు సెక్యూరిటీ చెక్ దగ్గర నుండి చివరి గేటు వరకు హడావుడిగా వచ్చే క్రమంలో  దారిలో ఎక్కడో పడిపోయింది.
   ఆ విషయం  చివరిక్షణంలో తెలియడం ద్వారా మాకు గుండె ఆగినంత పని అయింది. తిరిగి దీనికి పరిష్కారం ఏమిటి ?అని వారిని అడిగితే, డూప్లికేట్ పాస్ తీసుకురండి .. అని సలహా ఇచ్చారు .అది ఎక్కడ తీసుకోవాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటే మమ్ములను వారు అక్కడ కూర్చోబెట్టి  ఫ్లైట్ బయలుదేరటానికి ఆఖరి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత పాస్ తెప్పించి లోపలికి పంపారు. పరుగు పరుగున ఆఖరి పాసింజర్ గా మేము ఫ్లైట్  లోకి చేరుకున్నాము. చేతిలో ఉన్న లగేజిని పైన డెక్ లో పెట్టి ,ఒక గ్లాసు నీరు తాగిన తర్వాత కానీ మేము స్థిమిత పడలేదు. 
    హైదరాబాదులోనే లగేజ్ చెకిన్ పూర్తి అవటం వలన  ఢిల్లీలో ఫ్లైట్ మారటానికి ఎక్కువ శ్రమ పడలేదు. ఢిల్లీ నుండి అమెరికా కి 15 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు అమెరికాలోని వాషింగ్టన్ చేరుకున్నాము. ఇక్కడ ఉన్న సరైన సమాచార వ్యవస్థతో  ఒక గంట లోపే అన్నీ బ్యాగేజ్ లు అందుకుని ఎయిర్ పోర్టు బయట  ముందుగానే నిరీక్షిస్తున్న  కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో  Bonvoyage అన్న పదానికి పరిపూర్ణత లభించినట్లు అయినది.  
     40 ఏళ్లకు పైగా హైదరాబాదులో నివాసం ఉంటున్న నాకు, పరిసరప్రాంతాలు ,పరిస్థితుల పట్ల పూర్తిగా అవగాహన ఉన్నా ఇబ్బందులు ఎదుర్కోవటం, ఏమీ తెలియని దూరప్రాంతాలలో ప్రశాంతంగా పనులు ముగించుకోవటం ,ఆ పరిణామాలను గమనిస్తే    "అన్నీ తెలిసిన వాడు అమావాస్యనాడు ,ఏమీ తెలియని వాడు ఏకాదశినాడు చచ్చాడు "అనే నానుడి గుర్తుకు వస్తోంది .
   ఇంత టెన్షన్ అనుభవించి ఇంటికి చేరిన తర్వాత , తప్పటడుగులతో, చిరునవ్వులతో ఏడాదిన్నర మనుమడు మొదటిసారి కంటబడటంతో, అంతటి ఒత్తిడి కూడా మటుమాయం అవ్వటం ఈ సంఘటనకు కొసమెరుపు ....
    మా విదేశీ ప్రయాణం సుఖ ప్రదం అవ్వాలని సందేశాలు తెలియజేసిన బంధు మిత్రులందరికీ ధన్యవాదములు 🙏
                              ***

కామెంట్‌లు