కలసి ఉంటే కలదు సుఖం;-- యామిజాల జగదీశ్
 అదొక ఆడవి. ఆ అడవిలో బోలెడన్ని చెట్లు ఉన్నాయి. అక్కడొక చెట్టుమీద రెండుకాకులు ఉండేవి. రెండూ వేర్వేరు కొమ్మలపైన పుల్లలతో గూళ్ళు కట్టుకున్నాయి. 
రెండు కాకులూ పొద్దున్నే గూళ్ళ నుంచి పొరుగున ఉన్న ఊరుకి బయలుదేరేవి.
అక్కడ వాటికి కావలసిన ఆహారం దొరికేది. 
పెళ్ళి రోజుల్లో అయితే హల్వా, జిలేబీ, వడ, బోండా, ఇలా రకరకాల తినుబండారాలు దొరికేవి.
ఆ ఊళ్ళోని వారు తాము తినడానికి ముందర కావ్ కావ్ అని అరిచి ఓచోట అన్నం పెట్టేవారు.
ఈ రెండు కాకులూ తమవరకే సరిపెట్టుకోకుండా మరెన్నో కాకులను వెంటపెట్టుకుని వెళ్ళి అక్కడ అన్నం తినేవి.
ఎప్పట్లాగే ఓ రోజు ఈ రెండు కాకులు ఓ కొలను దగ్గర్లో ఉన్న ఓ చెట్టు కొమ్మన వాలాయి. అవి తాము తెచ్చుకున్న తినుబండారాలను కాళ్ళ కింద ఉంచుకుని కొంచెం కొంచెంగా రుచి చూస్తూ ఆస్వాదిస్తున్నాయి.
అప్పుడు ఒక కాకి మరొక కాకితో "మనం రోజు మనమున్న అడవి నుంచి ఈ ఊరుకి వస్తున్నాం. ఈ ఊళ్ళో మనకు కావలసినవన్నీ లభిస్తున్నాయి. ఆకలి తీరుతోంది. అటువంటప్పుడు రోజూ అంత దూరం నుంచి ఇక్కడికి ఎగురుకుంటూ రావాలా? ఇదిగో ఇప్పుడు మనముంటున్న ఈ చెట్టుపైనే ఇద్దరం చెరొక గూడు కట్టుకుని నివసిస్తే సరిపోతుందిగా? దూరప్రయిణం తగ్గుతుందిగా?" అంది.
అప్పుడు రెండవ కాకి "ఇదొక ఏకాకి చెట్టు. సన్నగా పొడవుగా ఉంది. పైగా ఈ చెట్టు ముసలిదైపోయినట్టుంది. కనుక ఈ చెట్టున గూడు కట్టడం అంత మంచిది కాదు. మనం గుడ్లు పెట్టి వాటిని పొదిగే రోజుల్లో ఎంతో జాగర్తగా ఉండాలి. ఈ ఊళ్ళో కొందరు అల్లరి కుర్రాశ్ళున్నారు. మనం ఆహారంకోసం పోతున్న సమయంలో ఈ చెట్టెక్కి మన గుడ్లను తీసుకుని పారిపోతారు. వారిని నమ్మలేం. అడవిలో అయితే మనకా ప్రమాదం లేదు" అని విపులంగా చెప్పింది.
కానీ మొదటి కాకి దాని మాటలు వినలేదు.
"మనమిద్దరం ఈ చెట్లోనే ఉందాం. ఇక్కడే ఉంటే రోజూ ఎగురుకుంటూ ఇంత దూరం రావక్కర్లేదు. తిరిగి అడవికి పోనక్కర్లేదు.
ఈ అధవసర శ్రమ తప్పుతుంది కదా?" అంటూ పదే పదే చెప్పింది.
అయితే రెండో కాకి ఇక్కడీ చెట్టుపైన నివసించడానికి ఒప్పుకోలేదు. 
దాంతో మొదటి కాకి "సరే, నువ్వు అడవిలోనే ఉండు. నేనిక్కడే గూడు కట్టుకుని ఉంటాను" అంది.
"నీ మనసు మార్చలేను. నువ్విక్కడే ఉండు" అంటూ రెండో కాకి అడవి గూటికి వెళ్ళిపోయింది. అది పొద్దున్నే అడవి నుంచి ఎగురుకుంటూ ఈ ఊరుకి వస్తూ పోతుండేది. ఈ చెట్టుపై నుంచి రెండు కాకులూ ఊళ్ళో విహరించి ఆహారాన్ని సేకరించేవి. అనంతరం వాటి వాటి గూళ్ళకు అవి వెళ్ళిపోయేవి. ఇలా ఓ మూడు నెలలు గడిచాయి.
అడవిలో ఉంటున్న రెండో కాకి గుడ్డు పెట్టి పొదిగింది. కొలను దగ్గరున్న చెట్టుపై గూడు కట్టుకుని ఉంటున్న మొదటి కాకీ గుడ్డు పెట్టింది. పొదిగింది.
ఈ రెండు కాకిపిల్లలూ ఎదిగాయి. మరో నాలుగైదు రోజుల్లో ఎగరబోతున్నాయి.
ఈ దశలో ఓ రోజు తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో హోరున వర్షం. పిడుగుపడింది. కొలను దగ్గరున్న సన్నని పొడవాటి చెట్టు కూలిపోయింది. పాపం, ఆ చెట్టుమీదున్న గూడు ధ్వంసమైంది. గూటిలోని కాకిపిల్ల కిందపడి నలిగిపోయింది. తల్లికాకి ఎట్లాగో తప్పించుకుంది. ప్రాణాలతో బయటపడిన ఈ కాకి ఓ రాతిమీద వాలింది. రోదిస్తోంది. అప్పుడు అడవిలో ఉంటున్న కాకి అక్కడికి వచ్చింది. దానికి కొలను గట్టున ఉన్న చేట్టు కనిపించలేదు. ఆ చెట్టు నేలమీద విరిగిపడటం, దగ్గర్లో ఓ రాతిమీద ఏడుస్తూ కూర్చున్న మిత్ర కాకీ కనిపించి విషయం గ్రహించింది. దానిని ఓదార్చింది. 
"నేనున్న అడవిలోనూ వర్షం భారీగా కురిసింది. కానీ పక్కపక్కనే బోలెడు చెట్లు దట్టంగా ఉండటంతో ఒకదానికొకటి ఆదుకుని కూలిపోక నిల్చున్నాయి. ఒక్క చెట్టూ కూలిపోలేదు. కానీ ఇక్కడ నువ్వుం
డిన ఏకైక చెట్టు మరొక చెట్టు అండ లేకపోవడంతో కూలిపోయింది" అంది అడవికాకి.
"అవును. నువ్వు చెప్పింది నిజమే. కలసి ఉంటే కలదు సుఖం అంటుంటారు కదా. చెట్లన్నీ కలసిమెలసి ఉండటంతో హోరు వాన, గాలీ ఏమీ చేయలేకపోయాయి. ఆరోజు నువ్వు చెప్పిన మాటను పెడచెవిన పెట్టాను. అందుకు తగిన శాస్తి జరిగింది" అని బాధపడింది మొదటికాకి. ఈ క్షణమే నేను నీతో మన అడవికే వచ్చేస్తానని చెప్పడంతో అడవికాకి సంతోషపడింది. ఆ రోజు నుంచీ ఆ రెండుకాకులూ పూర్వంలా కలసిమెలసి అన్యోన్యంగా ఉన్నాయి అడవి గూళ్ళల్లో.

కామెంట్‌లు