ఆగిపోయింది;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 కలత చెందిన కల కన్నీటి వేడిలో 
పడి మలమల మసలిపోయింది...
కాస్తయిన కనికరం 
చూపని కాలం 
నిందలు వేస్తూ 
ఐసు గడ్డలా 
కరిగిపోయింది...
గడిచిన నిన్న అన్న గతం,
నేడు 
ఓ నీడలాంటి జ్ఞాపకంలా నిలిచిపోయింది...
కసిగా పరుగులు తీసి అలలై 
పడిలేచిన పాదాల క్రింద సన్నని 
ముళ్ళ కొన నలిగిపోయింది...
గమ్యం తెలియని దారిలోన ప్రయత్నంగా
వేసిన ప్రతి అడుగు రక్తపు మరకల 
రహదారిగా మారిపోయింది....
ముక్కలైన మనసు భారాన్ని
మాటలలో పోల్చి, రాతలలో 
వ్రాయగా చెదిరిపోని 
శిలాక్షరాలలా మిగిలిపోయింది...
ఊసులాడే ఊపిరి,
కదిలే గాలిలో కనిపించని 
సంతకాన్ని, చేసి చేసి
అలసిపోయింది... 
మానని గాయాల
గుబులు పెరిగి గుండె,
చప్పుడు చేయక 
చప్పున ఆగిపోయింది...


కామెంట్‌లు