వర్తమానం; - సి.హెచ్.ప్రతాప్
 హస్తినాపురం రాజ్యాన్ని యుధిష్టరుడు పాలించే రోజుల్లో ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు రాజ ప్రసాదానికి వచ్చి ధర్మరాజు దర్శనం చేసుకొని  తనకు పూట కూడా గడవడం కష్టంగా వుంది కాబట్టి కొన్ని గోవులను దానం చేస్తే వాటి ఆసరాతో తన కష్టాల నుండి గట్టెక్కి సుఖ జీవనం చేయగలనని అర్ధించాడు.
 
ఆ సమయంలో మంత్రులతో, సోదరులతో ముఖ్యమైన అంశాలపై సమాలోచనలు జరుపుతున్న ధర్మరాజు ఆ బ్రాహ్మణుడితో తనకు ప్రస్తుతం ఖాళీ లేనందున మర్నాడు ఉదయం రాజదర్బారు కొలువు తీరిన సమయంలో వస్తే తగిన విధంగా దానం చేయగలరని చెప్పాడు.
సభలో వున్న భీమసేనుడు ఆ మాటలు విన్నాడు. వెంటనే మంత్రులతో రేపు విజయ దివస్ గా ప్రకటించి రాజ్యమంతటా ఉత్సవాలు, సంబరాలు జరిపించండి. బీదసాదలకు, బ్రాహ్మణులకు దానధర్మాలు గొప్పగా చేయండి. ఇంద్రప్రస్థ రాజ్య ప్రజలు రేపటి రోజు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. చరిత్ర లో మరచిపోలేని రొజుగా రేపటి రోజు మిగిలిపోవాలి అని ఆజ్ఞ ఇచ్చాడు.
ఆ మాటలకు మంత్రులందరూ తెల్లబోయారు.హఠాత్తుగా రేపటి రోజు విజయ దివస్ గా ఎందుకు ప్రకటించాల్సి వస్తుందో వారికి లవలేశమైనా అర్ధం కాలేదు. ధర్మ రాజుకు కుదా ఈ విషయమై పెద్ద సందేహం కలిగింది. ఎవరు యుద్ధం చేసారు, ఎవరు గెలిచారు? అన్న వివరాలతో  విషయాన్ని సవివరంగా వివరించమని భీమసేనుడిని కారాడు.
"ధర్మరాజా ? మానవులు ఎవరూ చెయ్యలేని పనిని  ధర్మానికి ప్రతిరూపమైన నువ్వు చేసావు. ధర్మం చేయమని అడగడానికి వచ్చిన ఆ పేద బ్రాహ్మణుడిని రేపు రమ్మని చెప్పి పంపించేసావు. అంతే రేపటి దాకా బ్రతికి వుంటానని నమ్ముతున్నావు.అంటే 24 గంటల పాటు మృత్యువుతో దూరంగా వుంచినట్లే కదా! మృత్యువుపై పై చేయి సాధించడంలో ఈ భూమండలంపై మానవ పుట్టుక ప్రారంభం అయిన నాటి నుండి నేటి వరకు నీదే తొలి విజయం కదా. అందుకే రేపటి రోజును విజయ్ దివస్ గా ప్రకటించి ఆనందోత్సాహాలతో జరిపించమని కోరుతున్నాను" అన్నాడు భీముడు.  
భీముని మాటలతో ధర్మరాజుకు జ్ఞానోదయ మయ్యింది. పేద బ్రాహ్మణుడిని కటిక దారిద్రాన్ని అనుభవిస్తూ అవసరార్ధం తన వద్దకు వస్తే తాను మాత్రం రేపు రమ్మని పంపించేయడం పై భీమసేనుడు తనకీ విధం గా గుణపాఠం చెప్పాడని అర్ధమయ్యింది. నిన్నటి రోజు గడిచిపోయింది. అది ఇక తిరిగి రాదు.రేపటి రోజు వస్తుందో రాదో తెలియని అనిశ్చితిలో ఉంటుంది. ఇక మిగిలింది ఈ రోజు మాత్రమే. ఒక మంచి పని చెయ్యాలన్నా, జీవితంలో విజయం సాధించడానికి కృషి చెయ్యాలన్నా, అది ఈ రోజే చెయ్యాలి. రేపటికి వాయిదా వేయడం వలన జీవించడాన్ని రేపటికి వాయిదా వేస్తున్నామని, నేడు సాధించాల్సిన విజయాలను రేపటికి వాయిదా వేస్తునామని, రేపనే రోజు అసలు రాకపోతే , ఈ రోజు అందాల్సిన విజయం ఎప్పటికి అందదని  అర్ధం.
వెంటనే ధర్మరాజు ఆ పేద బ్రాహ్మణుడిని పిలిచి అతడు అడిగిన వాటిని దానం చేసాడు. ఏ మంచి పని అయినా వాయిదా వేయకుండా అప్పటికప్పుడే చెయ్యాలని తనకు అర్ధం అయ్యే విధంగా బోధించేందుకు భీమసేనుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

సి హెచ్ ప్రతాప్ 

కామెంట్‌లు