పాపం... మణి!;- సుమ కైకాల
 "అత్తయ్య గారూ!  వారం క్రితం నాతో ఆవకాయ పట్టించారు. నాకు రాదు మొర్రో అన్నా వినకుండా కుర్చీలో కూర్చొని అన్నీ నాతో చేపించారు. ఇప్పుడేంటి పచ్చడి ఇలా చిన్న చిన్న జార్ లలోకి తీస్తున్నారు?" అంది మణి.
మాట్లాడకుండా "ఆహా ఏమి రుచి? తినరా మైమరచి! " అంటూ కర్ణకఠోరంగా పాట పాడుకుంటుంది ఆoడాలు.
"వంటగది అంతా నీట్ గా సర్దమన్నారు. నన్ను  కూడా నీట్ గా తయారయి మీ పక్కన నిలబడమన్నారు? ఎందుకో చెప్పండి అత్తయ్యగారు?" ...
ఈ సారి పాట మారింది. "వేడి వేడి అన్నంలో కూసింత నెయ్యి వేసి రవ్వంత ముద్దపప్పు , ఓ చెంచా ఆవకాయ కలిపి తింటే మజా...మజా..."
"నేనిలా అరగంట నుండి నిలబడే ఉన్నాను. మీరలా జాడీ నుండి పచ్చడి తీస్తున్నట్లు ఆక్షన్ చేస్తూనే ఉన్నారు. పాటలతో నన్ను చoపేస్తున్నారు ఎందుకత్తయ్యా? కాళ్ళు పీక్కుపోతున్నాయి"  మణి ఉసూరుమంటూ అంది.
"అదేదో టీవీ ఛానల్ వాళ్ళు నిన్న మన కాలనీ కి వచ్చారు. స్వయం ఉపాధి అంశం తో ప్రోగ్రాం చేస్తున్నారట. ప్రోగ్రాం లో కథ ఏమిటంటే పాపం! అత్తగారు నాలా చాలా మంచిది. కోడలు పని పాట పట్టించుకోకుండా  షాపింగ్ ల పేరుతో డబ్బు దుబరా చేయడంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో మగవాళ్లకు  ఎలా సహాయం చేయవచ్చో ఉదాహరణలు చూపించటం అన్నమాట. ఇప్పుడు నేను ఆవకాయ పట్టి  చిన్న చిన్న జార్లలో పెట్టి  అమ్మడం చూసిన నువ్వు బుద్ధి తెచ్చుకుని కష్టపడటంలో ఉన్న ఆనందం డబ్బు వృథా చేయడంలో లేదు అని గ్రహిస్తావన్నమాట! ఇందాకే ఛానల్ వాళ్ళు మన ఇంటికి వస్తామని  ఫోన్ చేసారు. అందుకే ఈ సెట్టింగులు"... మూతి గంగాళంలా తిప్పుతూ అంది ఆoడాలు.
ఆ.... కొయ్యబారిపోయింది మణి.

కామెంట్‌లు
Unknown చెప్పారు…
Super idea ✌