దానగుణం; -: సి.హెచ్.ప్రతాప్
 ఒక ఊరిలో ధనగుప్తుడు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను వ్యాపారాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసి అందులో మంచి లాభాలు గడించాడు.అయితే అతనికి మంచి తెలివితేటలతో పాటు దానగుణం కూడా మెండుగా వుంది.ఉన్నంతలో బీద సాదలకు దానధర్మాలు చేసి వారిని  ఆదుకునేవాడు. అవసరార్ధం అతని ఇంటికి వచ్చినవారు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళేవారు కాదు. ఆ ఊరిలోని ప్రజలు అతడిని కలియుగ కర్ణుడు అని కీర్తించేవారు. అందరికీ అన్నివేళలా అందుబాటులో వుండేవాడు. అతనికి ధనవంతుడనే గర్వం ఏ కోశానా వుండేది కాదు.
ఒక సందర్భంలో ఆ ఊరికి ఒక సాధువు వచ్చి రామాలయంలో నివాసం ఏర్పాటు చేసుకొని భక్తులతో సద్గోష్టి జరుపుతుండేవారు .అతను సకల వేద శాస్త్ర పారంగతుడు, పైగా తపోనిష్టుడు.అతని ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు.మిగతా వేళలో తీవ్రమైన ధ్యానంలో వుండేవారు .
ఆ నోటా, ఈ నోటా ధనగుప్తుడి దాన గుణం గురించి విని అతనిని ఆశీర్వదించాలని సాధువు సంకల్పించారు . అయితే ముందుగా అతని దానగుణాన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు .
ఒకరోజు తెల్లవారుజామున ధనగుప్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టారు . అప్పుడే నిద్ర లేచిన ధనగుప్తుడు తలుపు తీసి, ఎదురుగా వున్న సాధువును చూసి భక్తిశ్రద్ధలతో చేతులు జోడించి ఇంట్లోకి ఆహ్వానించాడు.
"ధన గుప్తా ! నేను వరుసగా ఏడు రాత్రులు, ఆరు పగళ్ళు ధ్యానం చేసి ఇప్పుడే విరమించాను. ఏడు రోజుల పాటు నిరాహారినై వున్నందున నన్ను ఆకలి తీవ్రంగా బాధిస్తోంది. కాబట్టి తినడానికి ఏదైనా వుంటే పెట్టు" అని సాధువు అడిగారు .
ధనగుప్తుడు పొద్దునే సాధువు వంటి పవిత్రులకు భిక్ష వేసే అరుదైన అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ " ఇప్పుడే వస్తాను స్వామీ" అంటూ లోపలికి వెళ్ళి క్రితం రోజు కొని తెచ్చిన తాజా ఫలాలను  ఒక పళ్ళెంలో పెట్టి తీసుకు వచ్చాడు.
ఇంతలో సాధువు తప:శక్తి వలన ఇద్దరి మధ్య పెద్దగా మంటలు లేచాయి. ఇంటి దూలాన్ని తాకేటట్టుగా లేచిన ఆ మంటలను చూసి ఒక్క అడుగు వెనక్కి వేసాడు ధనగుప్తుడు.సింహం ముందుకు ఉరికేటప్పుడు ఒక అడుగు వెనక్కి వస్తుందంటారు. అదేవిధంగా ఒక్కసారిగా లేచిన మంటలను చూసి ఒక అడుగు వెనక్కి వేసిన ధనగుప్తుడు ఉదుట్టున ముందుకు ఉరికి మంటలలో నుండి నడిచి బయటకు వచ్చి ఆ సాధువు చేతుల్లో ఫలాలు వుంచిన పళ్ళెం వుంచి కాళ్ళకు నమస్కరించాడు. చిత్రం. సాధువు చేతుల్లో పళ్ళెం వుంచిన మరుక్షణం ఆ మంటలు ఆరిపోయాయి. అక్కడ పరిస్థితి యధాపూర్వంగా వచ్చేసింది. ఇంతకు ముందు మంటలు వచ్చిన సూచనలు మచ్చుకైనా లేవు.మంటల నుండి నడిచిన కారణంగా ధనగుప్తుడి ఒళ్ళు మూడొంతులు కాలిపోయింది. ఆ కాలిన గాయాలు కుడా మాయమైపోయాయి.
ధనగుప్తుడికి ఇదంతా ఆశ్చర్యంగా అనిపించింది. అతడిని చూస్తూ సాధువు చిరునవ్వుతో" నిన్ను పరీక్షించాలని నేను ఈ మంటలను సృష్టించాను. నీ ఒళ్ళు కాలుతుందని కాని, నీ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని కాని ఆలోచించక, నువ్వు కేవలం నాకు భిక్ష ఇచ్చి  నా ప్రాణాలు నిలిపేందుకు ప్రయత్నించి నీ దానగుణాన్ని రుజువు చేసుకున్నావు.  ఆకలితో వున్నవారికి కాస్తంత అన్నం,కట్టుకోవడానికి బట్టలు, విశ్రాంతి తీసుకోవడానికి ఇంటి వసారా కాస్సేపు ఇవ్వడం,దుఖంలో వున్న ఇతరులకు కాస్తంత ఓదార్పు నిచ్చి స్వాంతన కలిగించే మాటలు పలకడం వంటి  మంచి గుణాలు మానవులకు ఉత్తమ గతులు ప్రసాదిస్తాయి.  నీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. సకలైశ్వర్య లతో హాయిగా వర్ధిల్లుతావు. సుఖీభవ:  " అని ఆశీర్వదించారు.

కామెంట్‌లు