సమాజ వికాసంలో గురువు ;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 "విద్యలేనివాడు వింత పశువు" అనే నానుడి అనాది నుండి మనం వింటున్నదే. అందువల్ల విద్యకు అనాదిగా ఇస్తున్న విలువ గూర్చి మనకు తెలుపుతోంది. అయితే విద్యాబోధన జరిపేవాడు "గురువు". అతనిని "ఉపాధ్యాయుడు" అని కూడా అంటారు. ఈ గురువు అనే పదానికి మన ప్రాచీన గ్రంథమైన "గురుగీత"లో చెప్పిన అర్థం చూద్దాము.
శ్లో!!
గుకారశ్చాంధకారస్తు / రుకారస్తన్నిరోధకృత్
అంధకార వినాశిత్వా / ద్గురు రిత్యభి ధీయతే!!
(గురుగీత 1 - 45; పుట.36)
 ''గు" అనగా అంధకారం అని, "రు" అనగా ఆ అంధకారాన్ని తొలగించేవాడని అర్థము. అందువల్ల "గురువు" అంటే అంధకారమును తొలగించే వాడు అని, "జ్ఞానప్రదాత" అని తెలుస్తోంది.
అంతేకాదు ఇంకొక అడుగు ముందుకు వేసి
శ్లో!!
గురుర్బహ్మ గురుర్విష్ణు / ర్గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షా త్పరబ్రహ్మ / తస్మై శ్రీ గురవేనమః!!
(గురుగీత 1 - 58; పుట.47)
"గురువే బ్రహ్మదేవుడు. గురువే విష్ణుదేవుడు. గురువే మహేశ్వరుడు.ఆ గురువే సాక్షాత్తుగా పరబ్రహ్మమై ఉన్నాడు. అలాంటి గురుదేవులకు నమస్కారము" అని ప్రబోధించారు.
పురాతన కాలంలో కూడా ఉపాధ్యాయుడికి ఎనలేని విలువ ఉంది సమాజంలో. అలనాడు భగవంతుని అవతారమైన "కృష్ణుడు" కూడా "సాందీపముని" వద్ద విద్యను అభ్యసించాడు. శ్రీరామునంతటి వాడు "విశ్వామిత్రు"ని వద్ద విద్యను అభ్యసించాడు. నేడు కూడా "ఎంతో తెలివైనవారు" అని అనబడేవారు కూడా ఒక ఉపాధ్యాయునివద్దనే విద్య నేర్చుకొని ఉన్నారు. అంటే విద్యార్థులెంతటి వారైనా ఉపాధ్యాయుడు అవసరం అని, ఉపాధ్యాయుడే వారి విజ్ఞాన అభివృధ్ధికి తోడ్పడుతాడు అనేది నిర్వివాదాంశం.
"తరగతి గదిలో జాతి భవిష్యత్తు తీర్చి దిద్దబడుతుంది" అని అన్నారు ప్రముఖ విద్యావేత్త కొఠారి. మరి దానికి ముఖ్య కారకుడు ఉపాధ్యాయుడే కదా! అందువల్ల ఉపాధ్యాయుడే జాతి నిర్మాతగా భావించబడుతోంది.
భిన్న మతాలకు,భిన్న ఆర్థిక, సామాజిక వర్గాలకు, భిన్న జాతులకు సంబంధించిన విద్యార్థులకు ఉపాధ్యాయుడు నేడు విద్య గరుపుతున్నాడు. వారందరికీ కలిసి జీవించే వారసత్వపు జీవన విలువల్ని నేర్పవలసిన అవసరం ఉంది. అప్పుడే నాడు గాంధీజీ కలలుగన్న కుల, మత, జాతి విచక్షణలేని సంఘాన్ని మనం నిర్మించగలుగుతాం.
మానవుడు ఒక వ్యక్తిగా సమాజంలో గౌరవంగా జీవించాలన్నా, గౌరవింపబడాలన్నా అతనికి విజ్ఞానము, సమస్యలను విశ్లేషించుకొని తీర్చుకోగల అవగాహనా శక్తి, మంచి చెడ్డల విచక్షణాశక్తి, శ్రమశక్తిపై గౌరవము ఉండాలి. అందువల్ల వీటన్నింటిని విద్యార్థుల్లో అభివృద్ధి చేయాలి. నేటి బాలలే రేపటి పౌరులు కనుక వారి జీవితాల్లో వెలుగు నింపడానికి ఉపాధ్యాయులంతా కృషి చేయాలి.
సమాజమును ఉన్నత మార్గాన తీసుకొని పోగల శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉన్నది. ఈ విద్యను ప్రజలకు అందించగల కీలకమైన స్థానములో ఉపాధ్యాయులున్నారు. వారు తమ బాధ్యతలను, తమయొక్క విశిష్ట స్థానమును గుర్తించి ఉద్యోగరీత్యా వారి బాధ్యతలను చిత్తశుద్ధితో, న్యాయంగా నిర్వహించాలి. సమాజమును ఉన్నత మార్గాన తీసుకొని పోవడం ఉపాధ్యాయుల ప్రధాన కర్తవ్యము.
ఉపాధ్యాయుడు లేకపోతే దేశప్రగతి లేదు.దేశప్రగతికి, పురోగతికి, సమాజ వికాసానికి దోహదపడే వ్యక్తులను,వివిధ రంగాల్లో తయారుచేసి, దేశానికి అందించే మహోత్క్రష్ట సృష్టికర్త ఉపాధ్యాయుడే.అలాంటి కర్తవ్యాన్ని అంకితభావంతో నిర్వర్తించే ఉపాధ్యాయ లోకానికి దేశం యావత్తూ చేతులెత్తి నమస్కరిస్తుంది.
**********************************************************************************
{"గురుపౌర్ణమి" సందర్భంగా నా చిరువ్యాసం}

కామెంట్‌లు