ఈమధ్య ఆబడిలో ఓకొత్త విధానం ప్రవేశపెట్టారు. ప్రతిశనివారం7వక్లాసు దాకా పిల్లలు తాము చదివిన తెలుసుకున్న విషయాలను తమ క్లాస్ పిల్లలకు చెప్పాలి.ఇందులో బాగా చెప్పే పిల్లలు రోజూ బడిప్రారంభం కాకముందే ఉండే ప్రార్ధన సమయంలో చెప్పాలి.దీనివల్ల పుస్తకం చదవటం నలుగురికి చెప్పటం భయంపోవడం అలవాటు ఔతాయి.
ముందుగా శివా లేచాడు "మనం ఏపని ఐనా మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేయాలి. అప్పుడే దేవుడు అనుగ్రహిస్తాడు.నేను చదివిన సంఘటన చెప్తున్నా. ఆవ్యక్తి ఎవరో కనుక్కోండి. ఆతల్లి ప్రయాగ మకరసంక్రాంతి స్నానానికి మూడునెల్ల పసివాడితో వెళ్లింది.ఆమెకు నిండా ఇరవైఏళ్లు లేవు.తొక్కిసలాటలో ఆపసివాడు జారిపోయి ఓవ్యక్తి గంపలో పడిపోయాడు.అతను ఇంటికి వెళ్లిపోయాడు.చంకలో పిల్లాడు కన్పడక తల్లి లబోదిబో అని శోకాలు పెట్టింది .పోలీసులు వెతికి ఆబిడ్డను అప్పగించారు. బక్కగా నీరసంగా ఉండేవాడు. పులిమీద పుట్రలా ఆపసివాడు ఏడాదిన్నర వయసులో ఉండగా తండ్రి చనిపోటం ఆర్ధిక బాధలున్నా మహా చురుకు! ఆరోజు తోటిపిల్లలతో కలిసి తోటలో ఆడాడు.అంతా చెట్లుఎక్కి కోతి కొమ్మచ్చులు ఆడారు.పళ్ళు కాయలు కోసుకుంటుండగా తోటమాలి కర్రతో వచ్చేప్పటికి అంతా కాలికి బుద్ధిచెప్పారు.ఓచోట కూచున్న ఆబక్క కుర్రాడు చిక్కాడు."బాబూ!నేను ఊరికే ఈరెండుపూలు తెంపి ఇక్కడే కూచున్నాను.నాన్న లేని బీదపిల్లాడిని."అని అన్నాడు. తోటమాలికి అతని నిజాయితీ పై సంతోషం వేసింది. "నాయనా!నీపరిస్థితులు బాగా లేవు .జాగ్రత్తగా ఉండాలి. బాగా చదువుకోవాలి"అని విడిచి పెట్టాడు. అంతే!మంచి పుస్తకాలు చదువుతూ గురునానక్ గీతాలు పాడేవాడు "నానక్! నానే హీ రహో జైసే నానే దూబ్!" అంటే చెట్టు ఎండి కూలి నామరూపాలు లేకుండా పోతుంది. కాని గరిక పచ్చ గడ్డి నేల కూలదు.ఎండకు వాడినా దాని వ్రేళ్ళు నేలలో సజీవంగానే ఉంటాయి.నీరు తగలగానే ఆకుపచ్చగా మెరుస్తుంది."ఆపిల్లాడు సంస్కృతం వేదాంతం లో శాస్త్రి డిగ్రీ పొందాడు.హిందీ షార్ట్ హాండ్ ఉర్దూలో పాండిత్యం సంపాదించాడు. బురఖా ధరించి అలహాబాద్ పెద్ద గంట స్థంభంపై మన జెండా ఎగరేసిన సాహసి దేశభక్తుడు! "నాకు శిక్షవేయండి"అని పోలీసుల ఎదురుగా నిలబడ్డాడు. మంచి రచయిత!మేడం క్యూరీ జీవిత చరిత్రను హిందీ లో రాశాడు.300పేజీల క్విట్ ఇండియా ఉద్యమం చరిత్ర జైల్లో రచించాడు. మనదేశానికి హోంశాఖ మంత్రిగా పనిచేసి పోలీసులు లాఠీఛార్జి తో అల్లరి మూకలని చెదరగొట్టడంతో పాటు అమాయకులు బలికాకుండా నీటి గొట్టాల ప్రయోగం ప్రవేశ పెట్టింది ఆయనే!" శివా ఆఖరుగా అడిగాడు "ఇది కథకాదు.నిజంగా జరిగింది. ఆబాలుడు ఎవరు?" చాలా మంది తెలీక బుర్ర గోక్కున్నారు.రోహిత్ ఠక్కున లేచి"మన రెండవ ప్రధానమంత్రి శ్రీలాల్ బహదూర్ శాస్త్రిజీ " అనగానే క్లాసంతా చప్పట్లు మారుమోగాయి🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి