జైజవాన్; చంద్రకళ . వై .
 అక్కడ ప్రతి రాత్రి 
విషం కురుస్తూనే వుంటుంది
అది దేశ సరిహద్దు తెల్లని మంచు తో పాటు
ప్రాణాలు తీసే తూటాలునిత్యం కురుస్తుంటాయి
అక్కడ మృత్యువు ప్రతి క్షణం
కరాళ నృత్యం చేస్తుంటుంది
దేశంకోసం సిపాయిలు  తమ ప్రాణాలు
అర్పించడానికి సిద్ధంగా వుంటారు
సన్నని సరిహద్దుకి ఇరువైపులా
బారులు తీరిన సైన్యం
వారి మధ్యపోరు సాగుతూనే వుంటుంది 
నెత్తురు ఏరులై పారుతూనే వుంటుంది
క్షత గాత్రుల హాహాకారాలు 
మిన్నంటు తుంటాయి
భరత మాత రక్షణలో వీరోచితంగా పోరాడి
 వారు మౌనంగా నేలకొరుగుతారు
అక్కడ శవ పేటికలు ఎప్పుడూ సిద్ధంగా వుంటాయి
వారి పార్ధివ దేహాలు కుటుంబాలను చేరతాయి
మరణానంతరం  పరమ వీరచక్ర,
బిరుదు లివ్వబడతాయి
గౌరవప్రదంగా అంతిమ యాత్ర సాగుతుంది
సైనిక వందనాలతో దహన సంస్కారాలు జరప బడతాయి
ఒక భార్య తన పసుపు, కుంకుమలను 
ఒక తల్లి తన బిడ్డను 
ఒక బిడ్డ తన తండ్రిని
కోల్పోతూనే వుంటారు
వీర పత్నికావడానికి సిద్ధమయ్యే 
ఓ ఆడపిల్ల  సైనికుని పత్ని అవుతుంది
ఆ త్యాగ మూర్తులకు,అమృత హృదయులకు
ఏమిచ్చి వారి ఋణం తీర్చు కోగలము
శిరస్సు వంచి నీరాజనాలు అర్పించటంతప్ప
జైజవాన్ ! నీకు సలాం !  జైహింద్!


కామెంట్‌లు