"పిన్నీ! కుశలమేనా? ముందువెనుకలు ఆలోచించకుండా,లేడికి లేచిందే ప్రయాణమన్నట్లు,ఎవరికీ ఒక్కమాటైనా ముందుగా చెప్పకుండా ,హడావిడిగా ప్రయాణం పెట్టేసుకొన్నావు.ఎలా కులాసాగా వుంటావులే!మా అందరిమీదా బెంగపెట్టుకొనేవుంటావు.
అమ్మ అక్కడికీ నీకు ఎప్పుడూ చెపుతూనేవుండేది."అంతతొందరెందుకోవిడా? పారబోసి ఎత్తుకొన్నట్లు తొందరపడతావు."అని.
"మీ అమ్మలేకపోతే ఏమర్రా ?నేనులేనూ?"అన్నావు ఆనాడు .ఏదీ ..ఆమాటమీద నిలబడ్డావా?మా అమ్మ వెళ్ళి ఎన్నాళ్ళైపోయిందని ,మాకిచ్చినమాటకూడావిడిచి,ఆవిడను వెతుకుతూ వెంటబడి వెళ్ళిపోయావు? మరి మాకిప్పుడు రౌతులపూడి రావాలంటే మనసుమొగ్గటంలేదే!
అమ్మ ఎటూలేదు.మనకోసం కొట్టుకులాడే పిన్నికోసమన్నా వెళ్ళాలని మనసులాగేది.మరి నువ్విలా నీదారి నువ్వుచూసుకొని మమ్మల్ని దగాచేసావు.నువ్వు కనపడని వీధి గుమ్మంచూస్తే,మనసు బావురుమంటోందిపిన్నీ!
అవును దారంటే గుర్తుకొచ్చింది.నువ్వు పూర్తిగా అక్కడకి,అదే ఆ స్వర్గానికి చేరుకోగలిగివా?అక్కడ అంతమంది మన బంధుమిత్రులు వున్నారుకదా!వారెవరైనా నీకు తారసపడ్డారా?
మీ అమ్మానాన్నగారలూ,నీ అచ్చటా ముచ్చట్లు చూసినఅన్నదమ్ములూ, వదినగార్లూ,మీఅక్కాబావలూ,నీకిష్టమైన మోహన్ ,సతీష్ ,సరోజనీ మొదలైనవారూ,,నీ స్నేహితులూ, అసలు నీకు తెలిసిన అంతమందిలో ఏఒక్కరైనా ఎదురుపడ్డారా?లేదా?ఈ ఏడాదిలో?
ముఖ్యంగా అసలు మాచిన్నాన్న జాడేమైనా తెలిసిందా?ఇద్దరూ అక్కడ కలుసుకొనేవుంటారనీ,కమ్మనికబుర్లు ఇన్నేళ్ళవీ కలబోసుకొంటూనేవుంటారనీ, మేమంతా ఎంతగానో ఆశిస్తూవున్నాము ,కనపడ్డాడా చిన్నాన్న?
నీ అత్తమామలైన మన తాతయ్యగారూ, మామ్మమయ్యలుగానీ, నీ ఆడబడుచులైన అత్తయ్యలూ,మావయ్యగార్లుకానీ, అలాగే,బుల్లినాన్న కనపడితే ,చిన్నాన్నా కనపడతాడు?ఇద్దరూ సుందోపసందుల్లా ఒకచోటే వుండవచ్చు,జాగ్రత్తగా గమనించితే,జాగ్రత్తగా చూస్తూండు. అలాగే, నీలాగే తొందరపడి ముందుగానే అక్కడకి చేరుకొన్న, మనవాళ్ళైన చిన్నపాపా,మూర్తిగాడూ,అపర్ణా,పెద్దబాబూ వీరిలో ఎవరైనా నీ కళ్ళబడ్డారా?చూస్తూండు కనిపించకమానరు ఎక్కడో అక్కడ.
బుల్లిపిన్నీ,చిన్నరుణా,వాళ్ళాయనా వాళ్ళకీ, నీకు కనపడడం ఇష్టంలేకపోయినా,ఎక్కడోఅక్కడ,ఎప్పుడో అప్పుడు నీకళ్ళబడకమానరులే.వాళ్ళు పలకరించకపోయినా, నువ్వు పలకరించుపాపంవాళ్ళను.
నీ ఈడువాళ్ళైన ,కన్నవదినా,రాజావదినా,రత్నవదినా శేషొదినా కనపడితే పోల్చుకోగలవుకదా! అక్కడనీకు వాళ్ళెవరైనా కనపడితే నీకు మంచి కాలక్షేపంకదా!నీతోడివాళ్ళేకనుక మంచిమంచి కబుర్లు చెప్పుకోవచ్చు ఎంచక్కగాను.
అవునుగానీ పిన్నీ!"పిన్నీ,పిన్నీ!" అంటూ నీచుట్టూతిరిగే అన్నయ్య ,"అబ్బాయ్! ,అబ్బాయ్!" అంటూ నువ్వు ప్రాణంగా చూసే అన్నయ్య అక్కడేకదావున్నది.వాడి జాడేమైనాతెలిసిందా?
"అమ్మా!సుందరీ!"అంటూ ఆప్యాయంగా చూసుకొనే మా నాన్నగానీ, "ఓవిడా!"అంటూ పిలుస్తూ,కయ్యమైనా,నెయ్యమైనా నీతోనే అనే , మా అమ్మకానీ కనపడే వుండివుంటారు కదాపిన్నీ నీకక్కడ!
మనఊరి వాళ్ళెవరైనా కనిపించారా నీకు,పెద్దక్కయ్యగారు,చిన్నక్కయ్యగారు,ఉప్పాడమ్మగారు,నానిగాడిపెళ్ళాం,లలితమ్మా, నల్లసూరిగాడూ,వీళ్ళంతా ఈమధ్య ఈమధ్య వెళ్ళినవాళ్ళేకదా! వాళ్ళ ఆచూకీ ఏమన్నా తెలిసిందా? అన్నట్టు మన కరణంపిన్నికూడా నీ వెనకాలే బయలుదేరొచ్చేసింది అక్కడకి, కనపడుతుందేమో కాస్తచూస్తూండు. అసలు నీకు తెలిసిన మన వాళ్ళన్నవాళ్ళూ,మనకు తెలిసినవాళ్ళూ,మ ఊరివాళ్ళూ ఎందరెందరో వున్నారుకదా అక్కడ.వాళ్ళలో ఎవరైనా కనపడుతుంటారేమో కనిపెట్టిచూస్తూండు, కబుర్లకూ,కాలక్షేపానికీ కొరతుండదు.
అవునుగానీ పిన్నీ! అక్కడ నీకెంతో ఇష్టమైన పద్యనాటకాలూ, గానాబజానాలూ మొదలైనవి ఏవో ఒకటి,ఎక్కడోక్కడ జరుగుతూవుంటాయికదా! చక్కగా ఆ సభలకి,సన్మానాలకూ వెళుతూవుండు.మన నాటక,సినీరంగాలవాళ్ళంతా అక్కడేవున్నారుకదా! ఏదో ఒకటి ,ఎవరో ఒకరు వాళ్ళనాహ్వానించి వాళ్ళచేత కార్యక్రమాలు జరిపిస్తూనేవుంటారు.
వాళ్ళల్లో ఎవరైనా ఒకరు నువ్వు చక్కగా పాడతావని తెలుసుకొని,నిన్ను ఎవరైనా పాడమని అడిగినా, మొహమాటంపడకుండా, "మనసునమల్లెలు మాలలూగెనే"అంటూ ఒకసారి గొంతెత్తి పాడావంటే, ఆ ఇంద్రుడేనా చెవొగ్గి వింటాడు."వన్స్ మోర్'వన్స్ మోర్ "అనకమానడు. నువ్వు పాడెయ్యంతే!"ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో"అంటూ.
ఇకపోతే ఆ స్వర్గంలో ప్రతీరోజూ ఎక్కడో అక్కడ విందులూ ,వినోదాలూ జరుగుతూనేవుంటాయిట. నువ్వు ఇక్కడలాగే,అక్కడకూడా విందుల్లో వడ్డన చేస్తానంటూ,సరదాపడుతూ సిధ్ధపడిపోకు. అందరూ తెలివిగా నీమీద వడ్డనభారం పడేసి తప్పుకొంటే ,వడ్డించడం నీకు కష్టమైపోతుంది.ఎల్లకాలం నీకు ఓపికుండదుగదా పిన్నీ!
అవును వడ్డనంటే గుర్తుకొచ్చింది,స్వర్గంలో తిండి అంతా తీపిమయమటగదా! నీకు చూస్తే తీపి సహించదు.ఇక్కడైతే ,ఎన్ని ఆధరవులున్నా,ఆవకాయలేకపోతే ముద్దెత్తవుగదామీ అల్లుడు పెద్దశీనులాగ,మరి అక్కడ మీ ఇద్దరూ ఆవకాయ కలపకుండా అన్నం ఎలాతింటున్నారో ఏమిటో!దిక్కుమాలిన స్వర్గం అన్న పేరుగొప్పేకానీ,కొరియర్ వాడురావడానికి కూడా కుదిరిచావదు, పోనీ ఏవన్నా మనవాళ్ళందరికీ పంపిద్దామన్నా!
అవునుగానీ పిన్నీ!ఎప్పుడన్నా ఏతలనొప్పొచ్చినా,సొంతవైద్యం చెేసుకొని ప్రాణాలమీదకు తెచ్చుకోకు. మన అన్నారండాక్టరుగారు కనిపిస్తారు అక్కడే ఎక్కడో,కాస్త ఎంక్వైరీచెయ్యి.! ఆయన షోడామెంటుమాత్రలు నీకు బాగాపనిచేస్తాయికదా! ,నిమిషంలో తగ్గిపోతుంది నీతలనొప్పి.అంతేకానీ అవీ ఇవీ వాడకు.జాగ్రత్త పిన్నీ!
" పిన్నీ!నువ్వులేని ఈ ఏడాదిలో ఎన్నెన్నో విషేషాలు జరిగాయి.అన్నీ ఒకేసారెందుకు చెప్పెయ్యటం?మళ్ళీ నిదానంగా ఇంకోసారి ఇంకొన్ని విషేషాలు చెపుతాను సరేనా?మరి ఇప్పటికి వుంటాను.మేమంతా నెలాఖరుకి ,నీకోసం మన రౌతులపూడి వస్తున్నాం. వీలైతే కలలోయేనా కనిపిస్తావని ఆశతో ఆశిస్తూ!
నీవాణి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి