*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0159)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దక్షుని ఇంట సతీదేవి ప్రాణత్యాగం - రుద్రుడు తెలుసుకుని - వీరభద్ర, మహాకాళి ల సృష్టి  - యజ్ఞ ధ్వంసము, వైరి సంహారమునకు ఆజ్ఞ*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
 *కైలాస పర్వతమును తాకి రెండుగా చీలిన శివుని జట పూర్వభాగము నుండి వీరభద్రుడు, ఉత్తర భాగం నుండి భద్రకాళి ఉదయించారు. అలా శివుని జట నుండి పుట్టిన వీరభద్రుడు మహాబలి. ముందుండి శివగణములను నడిపించగలిగిన వాడు. భూమండలము కంటే పది అంగుళాలు ఎక్కువ ఎత్తు కలిగినవాడు. ప్రళయాగ్ని లాగా కనిపిస్తూ వున్నా శివభక్తులలో ఉన్నతుడు, అగ్రగణ్యుడు. అతనికి వేయి భుజాలు వున్నాయి. కోపముతో నిండిన వీరభద్రుని ఉచ్ఛ్వాసనిశ్వాసాలు చాలా భారంగా వున్నాయి. మహారుద్రని కోపమువలన వీరభద్రుడు పుట్టిన సమయంలోనే అనేక శరీర సంబంధమైన రోగాలు పుట్టాయి.*
*జట యొక్క రెండవ భాగమునుండి పుట్టిన భద్రకాళి, మహాకాళి. ఆమెను కొన్ని కోట్ల భూతములు చుట్టి వున్నాయి.  అవి క్రూరత్వం తో మానవులు అందరికీ భయాన్ని కలిగిస్తున్నాయి. ప్రళయమే రూపు దాల్చి మహాకాళి, భద్రకాళి గా వచ్చిందా అన్నట్టుగా కనిపిస్తోంది.*
*వీరభద్రుడు, మహాశివుని చూచి, "నీవు త్రినేత్రుడవు. నన్ను పుట్టించిన కారణము తొందరగా తెలుపు, తండ్రి. ఈశానా! లోకాలను తలకిందలుగా చేయాలా. ప్రాణులు అందరినీ నశింప జేయాలా! నీ కరుణతో నేను ఎంత కష్టమైన పని అయినా క్షణ కాలంలో పూర్తి చేస్తాను. మీచే పంపబిడినది గడ్డిపోచ అయినా కూడా, ఎటువంటి పనినైనా చేసుకు రాగలదు. నాకు వున్న శక్తి అంతా మీనుండి వచ్చినదే. మరీ మరీ నీకు నమస్కరించి వేడుతున్నాను. నేను చేయవలసిన పనికి నన్ను వెంటనే పంపించు, శంభో! నాకు అనేక శుభలక్షణములు కనిపిస్తున్నాయి. శుభాలను ఇచ్చేవాడవు నీవే కదా!*
*వీరభద్రుని మాటలు విన్న శివ భగవానుడు" వీరభద్రా! నీకు ఎప్పుడూ జయమే కలుగుతుంది. నీవు నా పార్షదులలో అత్యంత ఉత్తముడివి. బ్రహ్మ మానస పుత్రుడైన దక్షుడు, ఈ మధ్యకాలంలో అత్యంత గర్వానికి లోనై నాతోనే శత్రుత్వాన్ని కోరుకుని పదే పదే నన్ను నిందిస్తూ నా పరివారానికి కూడా హాని తలపెట్టాడు. నీవు ఆ దక్ష యజ్ఞ ప్రాంతానికి వెళ్ళి యజ్ఞాన్ని ధ్వంసం చేయి. సతీసమేతుడైన దక్షుని నిర్జించు. మౌనంగా వుండి ఆతనికి సహాయపడిన సమస్త దేవలోకాన్ని కూడా శిక్షించు. ఇంకెవరైనా నిన్ను ఎదుర్కునే ప్రయత్నం చేస్తే వారిని భస్మం చేయి. నీవు అక్కడికి వెళ్ళగానే మంగళ వాయిద్యాలతో నీకు స్వాగతం పలికే విశ్వ దేవుడు మొదలైన వారిని కూడా భస్మం చేయి. అక్కడ వున్న వారందరినీ సబంధు బాంధవంగా కాల్చివేసి, నా శపథం పూర్తి చేయి, వీరభద్రా!"*
 *ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు