*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 059*
 *చంపకమాల:*
*ఇతఁడు దురాత్ముఁడంచు జను | లెన్నఁగ నారడి గొంటి నేనెపో*
*పతితుఁడ నంటినో పతిత | పావనమూర్తివి నీవుగల్గనే*
*నితరుల వేఁడనంటి నిహ | మిచ్చిన నిమ్ము పరం బొసంగు మీ*
*యతులిత రామనామ మధు | రాక్షరపాళి నిరంతరంబు హృ*
*ద్గతమని నమ్మి కొల్చెదను | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: కరుణా సముద్రా! దశరధరామా!  లోకులు నన్ను దుర్మార్గుడు అని నన్ను అంటే, నేను దుర్మార్గుడనే అనుకున్నాను. పాపాములు చేసే వాడిని అన్నారు. పాపము చేసిన వారిని రక్షించే పావన మూర్తి వి అయిన నీవు వుండగా నేను వేరే దేవీ దేవతలను కీర్తించి శరణు వేడను అనుకున్నాను. ఇక్కడ ఈ భూమి మీద సుఖాలు ఇచ్చేది, పరలోకంలో మోక్షముని ఇచ్చది అయిన తేనెకంటే మధురమైన నీ రామ నామాన్ని ఎల్లప్పుడూ మనసులో నమ్మకంతో వుంచుకున్నాను... అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*భారత, భాగవత, రామాయణాలలో వ్యాస భగవానుడు, పోతానామాత్యుడు, కవిత్రయం, ఎక్కిరాల భరద్వాజ గారు ఇలా ఎందరో నీ మాహాత్మ్యాన్ని మా కన్నులకు కట్టేడట్టుగా, మనసుకు వినిపించేడట్టుగా ఎన్నిసార్లో చెప్పారు. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు నిన్ను, నీ పరిపూర్ణత్వాన్ని స్థిరీకరించి కీర్తిస్తున్నాయి. మా మనసును పట్టి వున్న మాయ పొరలు తొలగించుకునే మార్గం ఏమిటి, కరుణాధామా! నీ దయ, కరుణ లేకుండా మమ్మల్ని మేము తెలుసుకునే అవకాశం వుంటుందా, పశుపతీ. తిన్నగా నీవద్దకు వచ్చి, నిన్ను ప్రసన్నం చేసుకోవడం మావల్ల కాని పని. అందుకే, "సీతమ్మ మా యమ్మ! శ్రీరాముడు మాకు తండ్రి!" అని మా అమ్మనే అడిగి మా మాట నీచెవిలో వేయమని వేడుకుంటాము. ఎంతైనా అమ్మ మనసు కదా. కొంచెం నెమ్మదిగా అయినా తప్పకుండా కరిగి పిల్లల కోరిక తప్పక తీరుస్తుంది. అలా నిన్ను మచ్చిక చేసుకుని, చిటికెలో మోక్షము పొందుతాము........*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు