గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (24);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.
 ఒకరోజు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో  రెడ్డి గారితో ఇవాళ ఇన్ని అసమానతలు బ్రాహ్మణ- బ్రాహ్మణేతర భేదాలు ఎలా వచ్చాయి? ఎక్కడినుంచి వచ్చాయి?  అన్నదానికి సమాధానంగా రాతి యుగంలో మనిషి జీవించిన రోజులనుంచి  ఈ క్షణం వరకు కొత్తకొత్త అసమానతలు వస్తూనే ఉన్నాయి  భార్యాభర్తలిద్దరూ  పనిచేసుకుని జీవించే రోజుల్లో  స్త్రీ గర్భవతి అయిన సందర్భంగా ఆమెకు  విశ్రాంతిని ఇచ్చి తానే ఆహార సముపార్జన చేస్తున్నప్పుడు  నేను సంపాదిస్తున్నాను నీవు తింటున్నావు కనుక నా కన్న నీవు తక్కువ అన్న ఆలోచన ప్రారంభమైంది. ఆ తర్వాత కొంత కాలానికి పొట్ట నింపుకోవడం కోసం ఏ మనిషికి, ఏ పని చేతనౌనో అది చేయడానికి అంగీకరించి నప్పుడు వారు చేసే పనులను బట్టి  వృత్తులను ఆధారంగా  విభజించారు. రాజ్య పరిపాలన చేసే వారు  క్షత్రియులు, వారికి సలహాలు ఇచ్చే వాడు బుద్ధి కలిగిన వాడు బ్రాహ్మణుడు. పండిన పంటలను  దేశవిదేశాలలో  అమ్మేవాడు వైశ్యుడు, ఆ పండించే రైతు శూద్రుడు అన్న పద్ధతిలో విభజన జరిగి ఉండాలి. ఆహార విషయంలో కూడా సాత్విక ఆహారాన్ని తినే వారిని ఒక తెగగా, రాజస ఆహారం రెండవదిగా,  తామసం మూడవదిగా, గొడ్డు మాంసాన్ని కూడా తిని కడుపు  నింపుకునే శ్రామికులను  పంచములుగా విభజించారు.  కానీ మూలం ప్రతి వాడు శూద్రుడే అన్న విషయాన్ని మరిచిపోతున్నారు. ఆ తర్వాత సంస్థానాలు వచ్చాయి. వాటిని పరిపాలించిన వారు రెడ్డిరాజులూ ఉన్నారు. గ్రామాలలో ఆ గ్రామ ప్రజలను కాపాడే వ్యక్తులను కాపులు  (రక్షించేవారు) అన్నారు.
జాతులలో ఉపజాతులు వచ్చినట్లుగా  కులాలలో కూడా ధనికుడు, పేదవాడు అని సృష్టించి  వాడిది మా కులం కాదు వేరే కులం అని ప్రకటించడంతో వారు వేరే కులస్తులయ్యారు. మతాలలో కుమ్ములాటలు ఎలా జరుగుతున్నాయో ఇక్కడ కులాల పేరుతో కూడా అంతకుమించిన ఘోరాలు జరుగుతున్నాయి. దీనికి  అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతి చిన్న విషయానికి పోట్లాటలు, తగవులు, హత్యలు  మామూలు అయిపోయినాయి. గురజాడ, కందుకూరి, గాంధీ లాంటి మహానుభావులు ఎందరు ఎన్ని ఎలా చెప్పినా ఈ ప్రజలు పట్టించుకోరు. రేడియోలో ధర్మసందేహాలు మీరు ఎలా చెప్పినా వింటారు. దానివి  విని అద్భుతం బాగా చెప్పారు అన్న వాళ్ళే తప్ప దానిని అనుసరించే వారు ఎంతమంది ఉంటారు అనేది శివనాగిరెడ్డి గారి ప్రశ్న. మనిషి మనస్తత్వం మారనంత వరకు  సమానత్వము అన్నమాట  నినాదంగానే ఉంటుంది తప్ప ఆచరణకు రాదు.  ఇది పచ్చి నిజం అని ముగించారు శివ నాగి రెడ్డి గారు.

కామెంట్‌లు