కలిసి వుంటేనే కలదు సుఖం; -సి.హెచ్.ప్రతాప్-సెల్ : 91468 27505
 ఒకసారి ఒక మానవ శరీరంలో వివిధ భాగాలు నేను గొప్పంటే నేను గొప్పని గొడవకు దిగాయి. చెయ్యి " రోజంతా ఎంతో కష్టపడి పని చేస్తే తప్ప ఈ శరీరం యజమానికి  అన్నం దొరకదు. ఆఖరుకు అన్నం కూడా నేనే వండి వాడి నోటికి అందించాలి. ఇంత కష్టపడుతుంటే నాకు అసలు గుర్తింపే లేదు. పైగా ఎడమ చెయ్యి అంటే లోకులకు ఎంతో లోకువ. అయినా నాకు ఒక ముద్ద కూడా అన్నం తినడానికి అవకాశం లేదు. మొత్తమంతా కడుపే తినేస్తోంది" అని తన అక్కసు వెళ్ళగక్కుకుంది.  ఇక కాలు" ఈ యజమాని ఎక్కడకు వెళ్ళమంటే అక్కడికి కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళాలి. కాస్త విశ్రాంతి కూడా దొరకదు. మిగితా భాగాలు కాస్సేపయినా విశ్రాంతి తీసుకుంటాయి కాని నాకు ఆ చాన్సే లేదు. ఇంతా చేస్తే నాకసలు గుర్తింపే వుండదు. ఎప్పుడు విశ్రాంతిగా వుంటే ఆ కడుపుకే అంతా తిండి  దొరుకుతుంది" అని బాధ పడింది. తల, గుండె, ఇలా అన్ని భాగాలు కడుపుపై యుద్ధం ప్రకటించాయి. కూడబలుక్కొని సమ్మె ప్రకటించాయి. ఏ అవయవం కూడ పనిచెయ్యడం మానేసింది. గుండె మాత్రం సమ్మెలో పాల్గొనలేదు ఎందుకంటే గుండె ఆగిపోతే శరీరం లో ప్రాణం పోతుంది కాబట్టి. కడుపుకు అన్నం వెళ్ళడం మానేసింది. రెండు రోజులపాటు అన్నీ బాగానే , ఉత్సాహంగా వున్నాయి. కడుపుకు తగిన శాస్తి అయ్యిందని సంతోషంగా వున్నాయి.మూడో రోజు నుండి మిగితా శరీర భాగాలకు శక్తి ప్రసరించడం తగ్గింది. కడుపు మాత్రం నాకు ఇన్నాళ్ళకు విశ్రాంతి దొరికిందని సంతోషించింది.
నాలుగయిదు రోజులు గడిచేసరికి కడుపు హాయిగా నిద్రపో సాగింది. 24 గంటలు పనిచేసే అది ఇప్పుడు 24 గంటలు నిద్రపోతోంది. అయితే ఆహారం లేనందున మిగతా భాగాలు నీరసంతో వేలాడిపోయాయి. ఒక్క అవయవం కూడా దానంతట అది కదిలే స్థితిలో లేదు. అప్పుడు మనస్సు కల్పించుకొని అన్ని అవయవాలను సమావేశపరిచింది. " భగవంతుడు శరీర నిర్మాణం చేసేటప్పుడు ప్రతి భాగానికి సమున్నత స్థానం కల్పించాడు. ప్రతి భాగం విలువైనదే. ఏ భాగానికి ఎక్కువ , తక్కువ విలువ అనే ప్రశ్న అవివేకం. ఒక భాగం విలువ తెలుసుకోవాలంటే ఆ భాగం లేని దివ్యాంగులను అడిగితే తెలుస్తుంది, ఆ భాగం వారి శరీరంలో లోపించడం వలన వారికి ఎంతటి కష్టం కలుగుతోందో ?
కాబట్టి ఎవరు ఎక్కువా ఎవరు తక్కువా అనే ప్రశ్నే అసలు తప్పు. మీరందరూ ఒకటే. మీ అందరికీ సమానమైన విలువ వుంది. కాబట్టి మీరు గొడవలకు దిగకుండా కలిసివుంటేనే శరీరం ఆరోగ్యానికి మంచిది. " అని వారికి సర్ధి చెప్పింది. తమ తప్పు తెలుసుకున్న అన్ని శరీర అవయవాలు ఇకపై కలిసికట్టుగా వుండాలని తీర్మానించుకొని, అనవసరంగా ఆడిపోసుకున్నందుకు కడుపుకు క్షమార్పణలు చెప్పాయి.
 
కామెంట్‌లు