విలువైనది అమూల్యం;-డి.కె.చదువులబాబు9440703716

 రవీంద్ర ఏడవతరగతి చదువుతున్నాడు. పరీక్షల్లో మంచిమార్కులు సంపాదించేవా డు. ప్రథమశ్రేణిలో నిలిచే విద్యార్థుల్లో ఒకడు.అలాంటి రవీంద్ర ఈమధ్య కాలంలో పరీక్షలు సరిగా వ్రాయడం లేదు. అరాకొరా మార్కులు వస్తున్నాయి. ఉపాధ్యాయులకు కారణం అర్థం కావడం లేదు. ప్రధానోపాధ్యా యుడు  అమ్మ,నాన్నను పాఠశాల కు పిల్చుకు రమ్మని రవీంద్రను పంపాడు. రవీంద్ర వెళ్లే సమయానికి వాడి తాత ఊరి నుండి వచ్చి ఉన్నాడు. నాన్న ఇంటి వద్ద లేకపోవడంతో అమ్మతో విషయం చెప్పాడు. అమ్మ పాఠశాలకు బయలుదేరుతుంటే రవీంద్ర తాత కూడ వెంట వచ్చాడు. ప్రధానోపాధ్యాయుడు వారికి విషయం చెప్పాడు.
"అయ్యా!మీరు చెప్పింది నిజమే!మావాడు ఈమధ్య సెల్ ఫోనుకు అలవాటు పడ్డాడు. సెల్ ఫోన్ తో గంటలు గంటలు గడుపుతు న్నాడు. సరిగా చదవడం లేదు. మేము ఎంతగా చెప్పినా వినడంలేదు" చెప్పింది రవీంద్ర అమ్మ.
విషయం  విన్న తాత ప్రధానోపాధ్యాయుడి తో "అయ్యా !మీరు నాకు ఒక అవకాశం ఇస్తే తరగతి గదిలో విద్యార్థులందరికీ  కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను." అన్నాడు.
   "మీరు మంచి విషయాలు చెబితే అభ్యంతరం ఏముంది. చెప్పండి" అని   ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను సమావేశ పరిచారు. 
వారితో తాతగారు "విద్యార్థులారా! మీకు ఒక కథ చెప్తాను. వింటారా?"అని అడిగాడు. "అలాగే తాతగారూ!" అన్నారు విద్యార్థులు. "ఈకథను నాకు మాతాత గారు చెప్పారు. నేను మీకు చెబుతా వినండి" అని ప్రారంభించాడు.
"అనగనగా ఒక గద్ద ఆకలితో గాలిలో ఎగురుతూ ఆహారం కోసం అన్వేషిస్తూ వెళ్తోంది. అప్పుడు ఒక నక్క  చిన్నబుట్టలో ఎరలను తీసుకుని వస్తూ కనిపించింది. గ్రద్ద,నక్కముందు వాలి"నక్కా!నక్కా! నాకు ఆకలిగా ఉంది. ఒక ఎరను ఇవ్వవా?"అని అడిగింది.
 అప్పుడు నక్క "నేను అడిగింది ఇస్తే ఇస్తా ను" అంది.
"ఏం కావాలో అడుగు" అంది గద్ద.
"నీ ఈకలు మూడు ఇ‌స్తే ఒక ఎరను ఇస్తాను" అంది నక్క.
మూడుఈకలు ఇచ్చి ఒక ఎరనుతీసుకుని తిన్నది గద్ద. ఇంకొకటి తినాలనిపించింది. మరో మూడు ఈకలను ఇచ్చి ఇంకొక ఎరను తిన్నది.అలా ఎరల మీద ఆశతో ఈకలను ఇస్తూ తింటున్నది. చివరికి గద్ద ఈకలన్నీ అయిపోయాయి.ఏదైనా ఒక చెట్టు మీదకు చేరుకుని హాయిగా విశ్రాంతి తీసుకోవాలను కుంది.ఎగరడానికి ప్రయత్నించింది. రెక్కలకుఈకలు లేకపోవడంవల్ల ఎగరలేక పోయింది.
అప్పుడు నక్క నవ్వి" ముందూ వెనుకా ఆలోచించకుండా ఎరలమీద ఆశతో ఈకలను పోగొట్టుకున్న నువ్వు పైకి ఎగరలేవు.పుష్టిగా వున్న నిన్ను తింటాను " అంటూ గద్దను చంపి తింది.
 తాత కథను చెప్పి పిల్లలూ ఈకథ ద్వారా మీరు ఏమి తెలుసుకున్నారు?"అని అడిగాడు.
 "ఏపనైనా చేసేముందు మంచీ చెడు ఆలోచించాలి.అత్యాశ మంచిది కాదని తెలుసుకున్నాము తాతయ్యా" చెప్పారు పిల్లలు.
"మా తాత ఈకథ చెప్పినప్పుడు సెల్ ఫోను లు లేవు. మీలో చాలా మంది ఇంటివద్ద చదవుకోకుండా సెల్ ఫోన్ లో ఆటలు ఆడుతూ మీకు ఏమాత్రం ఉపయోగపడని విషయాలను చూస్తూ గద్ద ఈకలను పోగొట్టుకున్నట్లు విలువైన కాలాన్ని పోగొట్టుకుంటున్నారు.ఫలితంగా చదువులో వెనుకబడి పోతున్నారు. పక్షి పైకి ఎగరడా నికి ఈకలు ఎంత విలువైనవో మీరు జీవితం లో పైకి రావడానికి కాలం విలువైనది. ఎరలపై ఆశతో, ఆకర్శణతో విలువైన ఈకలను పోగొట్టుకున్న గద్ద ఎలా పతనమ యిందో సెల్ ఫోను ఆకర్శణతో విలువైన సమయాన్ని పోగొట్టుకునే విద్యార్థులు జీవితంలో పైకి రాలేరు. గద్దలాగే జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కాలంలో ప్రతిక్షణం అమూల్యమైనది.పట్టుదలతో కాలాన్ని అభివృద్ది కొరకు సద్వినియోగం చేసుకున్న వారే జీవితంలో విజేతవుతలవుతారు" అని చెప్పడం పూర్తి చేశాడు తాత.
  "సెల్ ఫోన్ లో అనవసరమైనవి చూస్తూ మేము ఎంతో విలువైన కాలాన్ని కోల్పోతూ చదువులో వెనుకపడి పోయాము. ఉపయోగపడే విషయాలకొరకు అవసరమైనప్పుడు మాత్రమే సెల్ ఫోను ఉపయోగిస్తాము"అన్నారు పిల్లలు. వారిలో వచ్చిన మార్పుకు ఉపాధ్యాయులు సంతోషించారు.
కామెంట్‌లు