ఒక అడవిలో బంగారు అనే కోతి ఉండేది. అది కడుపునిండా తినడం, అల్లరి పనులతో విసిగించడం చేసేది.
అది ఒకరోజు పల్లెనుండి ఒక సంచిని తెచ్చుకుంది.అడవిలో కష్టపడి తిరిగి, పండ్లను,దుంపలను,విత్తనాలను సేకరించి సంచిలో పెట్టుకుంది. సంచిని భుజానికి తగిలించుకుని,అతికష్టం మీద నడుస్తోంది. ఒక ఎలుగుబంటు కోతికి ఎదురయింది. "బంగారం..బంగారం.. ఆసంచిలో ఏమున్నాయి?"అంది ఎలుగుబంటు. "ఆహారం ఉంది" చెప్పింది కోతి. "కడుపునిండా తిని పడుకోకుండా రేపటి కోసం తీసుకెడుతున్నావా? అంత అత్యాశ మంచిది కాదు. నాకు కొంత ఆహారం ఇవ్వు. బరువు తగ్గుతుంది" అంది ఎలుగుబంటు. "నీకివ్వడానికి నాకేం పనిలేదా? వెళ్లు.. వెళ్లు" అంది కోతి.
తర్వాత ఒక ఉడత, కుందేలు ఎదురొచ్చా యి.
"బంగారం..బంగారం..సంచిలో ఏముంది?"అని అడిగాయి. "ఆహారముంది"చెప్పింది కోతి. "కడుపునిండా తిని ఆడుకోక ఇదేం అత్యాశ. మాకు పండో ఫలమో ఇవ్వరాదూ! సంచి బరువు తగ్గుతుంది" అన్నాయి. "మీకివ్వడానికేనా నేను కష్టపడింది?. వెళ్లండి"అంది కోతి.
మరికొంతదూరం వెళ్లాక ఓజింక ఎదురొచ్చింది. అదికూడా ఎలుగు, కుందేలు ,ఉడతలాగే అడిగింది. కోతి పలకకుండా వెళ్లిపోయింది. పైన ఎగురుతూ ఇదంతా గమనిస్తున్న ఓచిలుక 'కోతి ఆసంచి ని ఏచెట్టు తొర్రలోనో దాస్తుంది కదా! అది నిద్రిస్తున్నప్పుడు నేను ఓపండు తిని, మిగిలినవి ఒకటొక్కటే తీసుకెళ్లి పక్షులకూ, జంతువులకూ ఇచ్చి మంచిపేరు సంపాదించాలి.' అనుకుంటూ వెంబడించింది.
కోతికి దారిలో ఆహారం సంపాదించుకునే శక్తిలేని ముసలి జంతువులు, గాయాలతో బాధపడుతున్నవి,అంగవైకల్యంగల జంతువులు కొన్ని కనిపించాయి. వాటి కోసమే వెదుకుతున్నట్లూ కోతి సంతోషంతో వాటికి ఆహారం పంచుతూ పోసాగింది. చివరకు ఖాళీ సంచిని తీసుకెళ్లి చెట్టు కొమ్మకు తగిలించింది. ఇదంతా చూసి చిలుక ఆశ్చర్యపడింది. కోతి వద్దకెళ్లి చాలా మంచిపని చేస్తున్నావని ప్రశంసించింది. "మాకు ఎవరికీరాని ఆలోచన నీకు ఎలా వచ్చింది"అని అడిగింది చిలుక.
"ఈమధ్య పల్లెలో దేవాలయంలో ఓమహాత్ముడి ప్రవచనాలు విన్నాను.ఆ మాటల ప్రభావంతో కడుపు నిండగానే నిద్రపోవడమో, గెంతడమో,కబుర్లతో కాలం గడపడమో చేయకూడదని శక్తిలేనివారికి చేతనైన సాయం చేయాలని నిర్ణయించు కున్నాను. అవసరమైన వారికి చేతనైన సాయం చేయడాన్ని మించిన సార్థకత జీవితానికి ఏముంటుంది చెప్పు?" అంది కోతి.
ఈసంగతి చిలుక ద్వారా అడవి అంతటా తెలిసిపోయింది.జంతువులు,పక్షులు ఆలోచించి,ఈపని మంచిగా ఉంది. అనుకున్నాయి.కష్టాల్లో ఉన్నవాటికి చేతనైన సహాయం చేసుకుంటూ జీవించసాగాయి. సాయం చేయడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించసాగాయి.
"నువ్వు అల్లరిమాని అడవికే ఆదర్శంగా నిలిచావు.నువ్విప్పుడు అల్లరి బంగారానివి కాదు.ఆదర్శం బంగారానివి" అంది చిలుక. "ఇందులో నాగొప్ప ఏమీ లేదు. మనం మంచి మాటలు వింటే మంచి ఆలోచనలు, మంచి నడవడిక వస్తుంది. నేను మంచి మాటలు వినడం, ఆచరించడం చేశాను.నాప్రవర్తన మార్చుకున్నాను. అంతే..."అంది కోతి.
అల్లరికోతి అన్న అడవిఅంతా తనలో మార్పును అభినందిస్తూ తన బాటలో నడిచినందుకు కోతి సంతోషపడింది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి