హరి కనోబా అనే వ్యక్తి బొంబాయిలో నివసిస్తూ వుండేవాడు. తన స్నేహితుల, బంధువుల నుండి శ్రీ శిరిడీ సాయి లీలలను అనేకం విన్నాడు. స్వతాహాగా సంశయ స్వభావం కలిగిన వాడు కావడం వలన మొదట్లో శ్రీ సాయిని నమ్మలేదు. ఏవో గారడీ విద్యలు నేర్చుకొని కనికట్టు చేసే సన్యాసిలా సాయిని భావించాడు. అయితే శ్రీ సాయిని పరీక్షించుదామని ఒక శుభముహూర్తాన తన స్నేహితులతో కలిసి శిరిడీ వచ్చాడు. క్రొత్త బట్తలు,తలపై జలతారు పాగా, క్రొత్త చెప్పులను ధరించి దర్పం తో మశీదు లోనికి అడుగుపెట్టాడు. ఎంతో ధనం వెచ్చించి కొన్న క్రొత్త చెప్పులను మశీదులో ఒక మూల వుంచి సాయి దర్శనం చేసుకొని ఊదీ ప్రసాదాలను అందుకొని తిరిగి వచ్చాడు. దురదృష్ట వశాత్తు తాను వుంచిన ప్రదేశం లో తన క్రొత్త చెప్పులు దొరకలేదు. చికాకు పడుతూ మసీదు అంతా వెదకినా చెప్పులు కనిపించలేదు. అనవసరం గా శిరిడీ వచ్చి చెప్పులు పోగొట్టుకున్నానని బాధపడుతూ తన బసకు తిరిగి వచ్చాడు.
తర్వాత అన్యమనస్కం గానే హరి కనోబా స్నానం , దేవునికి పూజ చేసి, నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చున్నాడు. కాని మనసులో చెప్పుల గురించి చింత వదలలేదు. ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసి, ఇష్టం గా కొనుకున్న చెప్పుల జత మాయమైపోయింది అన్న బాధ అతనిని తొలచి వేస్తోంది. అయిష్టంగానే భోజనం చేసి వాడా వసారా లోకి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఒక కుర్రవాడు ఒక చెప్పుల జత వేలాడుతున్న కర్రను భుజానికి తగిలించుకొని హరీ కా బేటా, జరీ కా ఫేటా (తలపాగా) అని అరుచుకుంటూ వస్తున్నాడు. ఆ చెప్పుల జత తనవిగా అనిపించడం తొ పరుగు పరుగున హరి కనోబా వెళ్ళి ఆ కుర్రవాడిని ఆపాడు.ఆ కుర్రవాడు తనని వివరాలు అడుగగా , తన పేరు కని కనోబా యని, తన తండ్రి పేరు కనోబా యని,తాను బొంబాయి నుండి వచ్చానని, చెప్పాడు. అప్పుడు ఆ కుర్రవాడు ఆ చెప్పుల జతను హరి కనోబా కు ఇచ్చి వేసి తనను శ్రీ సాయి పంపారని, కనోబా కుమారుడైన హరి కనిపిస్తే వానికి జరీ అంచు తలపాగా వుందని రూఢీ చేసుకొని , వివరాలను కనుక్కొని చెప్పుల జతను ఇచ్చివేయమని ఆదేశించారని చెప్పాడు. ఆ మాటలకు హరి కనోబా నోటి వెంట మాట రాలేదు. తాను సాయి దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక్క మాటైనా మాట్లాడలేదు.అటువంటిది ఆయనకు తన వివరాలు ఎలా తెలిసాయి ? దానిని బట్టి శ్రీ సాయి సర్వాంతర్యామి యని , ఈ సృష్టిలో జరిగే సమస్తం ఆయనకు తెలుస్తుంటాయని హరి కనోబాకు అవగతమయ్యింది.వెంటనే శ్రీ సాయి దర్శనార్ధం మశీదుకు వెళ్ళాడు. పశ్చాత్తాప హృదయం తో శ్రీ సాయి కాళ్ళపై పడి తనను క్షమించమని కళ్ళ నీళ్ళ పర్యంతరమై ప్రార్ధించాడు. శ్రీ సాయి చిరునవ్వుతో హరి కనోబా వైపు తన కరుణామృత చూపులను ప్రసరించగా , ఆ క్షణం లో హరి కనోబా హృదయం లో అంత వరకు దట్టం గా పేరుకొని పోయి వున్న సంశయాత్మక స్వభావం పటా పంచలైపోయింది. దాని స్థానే అంతులేని విశ్వాసం చోటు చేసుకుంది. శ్రీ సాయిని పరీక్షించుదామన్న తన వైఖరికి తానే సిగ్గు పడ్డాడు.శ్రీ సాయి యొక్క దివ్యత్వాన్ని, మహత్యాన్ని స్వయం గా అనుభవించి ఆయన పట్ల అంతులేని భక్తి విశ్వాసాలను పెంచుకున్నాడు.శ్రీ సాయికి అత్యంత భక్తుడిగా మారి తన జీవిత కాలం పర్యంతరం శ్రీ సాయి సేవ, ఆరాధనలో మునిగిపోయాడు. మనం కూడా మన విజ్ఞానం తో, బుద్ధితో ప్రతీ విషయన్ని పరిశీలించి, తర్కించి, విమర్శించే వైఖరిని విడనాడుదాం. ఆధ్యాత్మికతకు కావల్సింది అచంచల భక్తి విశ్వాసాలు, నమ్మకం మాత్రమే ! ఏ మేరకు మనలో భక్తి ప్రవృత్తులు, విశ్వాసాలు చోటు చేసుకుంటాయి, ఆ మేరకు భగవంతుని అనుగ్రహం అతి శ్రీఘ్రం గా లభిస్తుంది. .
సి హెచ్ ప్రతాప్
సంశయ స్వభావం; - సి.హెచ్.ప్రతాప్ (చరవాణి: 95508 51075)
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి