మనకీర్తి శిఖరాలు .;-మరింగంటి సింగరాచార్యులు .; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 మరింగంటి సింగరాచార్యులు .తెలంగాణలోని నల్లగొండ జిల్లా, దేవరకొండ ప్రాంతానికి చెందిన 16వశతాబ్దపు కవి. వైష్ణవ బ్రాహ్మణుడు. ఇతని తండ్రి వేంగళాచార్యులు. తాత తిరుమలాచార్యులు. మాద్గల్య గోత్రుడు. దశరథరాజనందన చరిత్ర అనే నిరోష్ఠ్య కావ్యాన్ని రచించాడు. ఇతడు తన కవిత్వంతో ఇబ్రహీం కుతుబ్‌షానే మెప్పించి ముత్యాలహారాలు, గుర్రాలు, మదపు వెల్లగొడుగులు, అగ్రహారాలు కానుకలుగా పొంది సత్కరింపబడ్డాడు. దశరథరాజనందన చరిత్ర అను నిరోష్ఠ రామాయణం, సీతాకళ్యాణం ఇతని ముద్రిత రచనలు. తెలుగులో తొలి చతురర్థి కావ్యం నలరాఘవ యాదవ పాండవీయం వ్రాసింది ఇతనే. ఏక కాలంలో నాలుగు కథలను బోధించే ఈ కావ్యం ప్రస్తుతం అలభ్యం. తెలుగులో మొట్టమొదటి నిరోష్ఠ్య కావ్యము కూడా ఇతని ఖాతాలోకి చేరుతుంది. ఇతడు రచించిన దశరథరాజ నందన చరిత్ర తెలుగు సాహిత్యంలో వెలువడిన మొట్టమొదటి నిరోష్ఠ్య కావ్యముగా పరిశోధకులు నిర్ణయించారు. ఇతడే రచించిన బిల్హణీయము అనే మరొక కావ్యంలో చిత్రకవిత్వం, బంధ కవిత్వం కనిపిస్తుంది. ఇంకా ఇతడు రామకృష్ణ విజయము అనే ద్వ్యర్థికావ్యాన్నీ, అనేక శతకాలను రచించాడు. ఇతడి జీవితకాలము సా.శ.1520-1590 అని మరింగంటి కవుల సాహిత్యసేవపై పరిశోధన కావించిన శ్రీరంగాచార్య నిర్ధారించారు. సింగరాచార్యులు అష్టభాషాప్రవీణుడు.తన సోదరుడు మరింగంటి జగన్నాథాచార్యులతో కలిసి జంటగా శతావధానాలు చేసేవాడు. ఇతడు అబ్దుల్ కరీం, ఇబ్రహీం కుతుబ్‌షాల ఆస్థానములో కవిగా ఆశ్రయం పొందాడు.
వరదరాజ స్తుతి
శ్రీరంగ శతకము
చక్రలాంఛనవిధి
కవి కదంబము
శతసంహిత
రామకృష్ణ విజయము (ద్వర్థి కావ్యము)
నాటకశాస్త్రము
ధనాభిరామము
ప్రేమాభిరామము
నలయాదవరాఘవపాండవీయము (చతురర్థి కావ్యము)
సకలాలంకార సంగ్రహము
రాకాసుధాపూర్ణరసపుష్ప గుచ్ఛము
ఆంధ్రభాషాభూషణము
దశరథరాజ నందన చరిత్ర
శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతాకళ్యాణము
తారక బ్రహ్మరామ శతకము మొదలైనవి.
వీటిలో దశరథరాజనందన చరిత్ర, శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతాకళ్యాణము, తారకబ్రహ్మ రామశతము తప్ప మిగిలిన రచనలన్నీ ఇప్పుడు లభించుటలేదు. దశరథరాజనందన చరిత్ర అంతర్జాలంలో తెలుగు పరిశోధన, పొత్తపుగుడి లలో లభిస్తుంది.
బిరుదములు.
ఆశుకవి
శతఘంటావధాన
అష్టభాషాకవితావిశారద
శారదాప్రశ్నవివరణ

కామెంట్‌లు