సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 ఉద్విగ్నత... ఉద్రిక్తత
   *****
ఉద్విగ్నత, ఉద్రిక్తత ఇవి రెండూ శారీరకంగా మానసికంగా విపరీతమైన ప్రభావాన్ని చూపుతాయి. అనేక అనర్థాలకు కారణం అవుతాయి.
ఉద్విగ్నత అంటే ఆందోళన, అశాంతి, కలత, వ్యాకులత చెందడం లాంటివి.
 
కొందరు ప్రతి చిన్న విషయానికి ఉద్విగ్నతకు లోనవుతూ ఉంటారు. ఈ ఉద్విగ్నత  వలన ఏపని మీద సరైన ద్యాస ఉంచలేరు. ప్రతి విషయం పట్ల అనవసర భయాలతో  హైరానా పడుతూ ఉంటారు.
అన్నిటికీ అనుమానాలు అపోహలు,చేయలేమోననే సందేహాలు వారిని ప్రతి విషయంలోనూ పట్టి పీడిస్తూ ఉంటాయి.
వారి ఉద్విగ్నత  వారికే కాదు, వారితో కలిసి ఉండేవారికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
ఉద్రిక్తత  అనేది తీవ్రమైన మానసిక ఒత్తిడి. ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా స్పందించడం. ఆవేశకావేశాలకు లోనవ్వడం.
ఉద్రిక్త మనస్తత్వం ఉన్న వారు  తమ మనసుకు నచ్చని విషయాలు,సంఘటనల పట్ల  ఉచితానుచితాల ఆలోచన లేకుండా, మానసిక శారీరక నియంత్రణ కోల్పోయి ప్రవర్తిస్తారు.
ఈ ఉద్రిక్తత వలన అనేక కుటుంబ, సామాజిక సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
అందుకే అనవసరమైన ఉద్విగ్నత, ఉద్రిక్తతను తగ్గించుకోవాలి.
వీటిని  తగ్గించుకోవడానికి నిత్యం యోగా, ధ్యానం చేస్తూ ఉండాలి. వీటి స్థాయిల్లో  తేడా ఎక్కువగా ఉంటే మాత్రం తప్పకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు