ఆటో రాజీ ఆనంద సేవ!!;-- యామిజాల జగదీశ్
 చెన్నై నగరంలో మహిళా ఆటో డ్రైవర్ రాజీ అశోక్ రాత్రి పది గంటల తర్వాత మహిళలు, వృద్ధులకు ఇరవై ఏళ్ళకుపైగా ఉచితంగా సేవ చేస్తుండటం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో దాదాపు రెండు కోట్ల మంది నివసిస్తున్నారని అంచనా. వారిలో ఆఫీసులకీ, విద్యాలయాలకీ, ఆస్పత్రులకీ ఇతర అత్యవసరాలకు దాదాపు పది లక్షల మంది షేర్ ఆటో, ఆటోరిక్షాలపై ఆధారపడుతుంటారు. వీరి అవసరాలను తీర్చడానికి చెన్నై, శివారు ప్రాంతాలలో దొదాపు లక్ష ఆటోలు నడుస్తున్నాయి.
ఇవి కాకుండా ప్రభుత్వ బస్సులు, ఎలక్ట్రిక్ రైళ్ళు వంటివాటిని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ప్రయాణాలకు వినియోగిస్తుంటారు.
కోయంబేడు, చెన్నై సెంట్రల్, ఎగ్మూర్ రైల్వే స్టేషన్ వంటీ రద్దీ ప్రాంతాలలో ఆటోలపై ఆధారపడే వారి సంఖ్య అధికం.
తమిళనాడు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలను ప్రకటించిన తర్వాత ఆటో నడిపేవారికి ఆదాయం తగ్గినట్లు తెలుస్తోంది.
ఈ స్థితిలో చెన్నైకి చెందిన బి.ఎ. చదువుకున్న ఆటో డ్రైవర్ రాజీ అశోక్ మహిళలు, వృద్ధుల కోసం రాత్రి పది గంటల తర్వాత ఉచితంగా సేవ చేయడం విశేషం.
అందులోనూ ఆస్పత్రులకు వెళ్ళే వారికైతే ఇరవై నాలుగ్గంటలూ ఉచిత సేవ చేయడం మరింత ఆశ్చర్యాన్నిస్తోంది 
కేరళ నుంచి తన భర్తతో కలిసి చెన్నైలో ఉంటున్న రాజీ ఆటో నడుపుతున్నట్టు, తగినంత ఆదాయం లభిస్తోందని ఆమె తెలిపారు. పైగా చెన్నై నగరం ఎంతో సురక్షితమైన నగరంగా ఆమె చెప్పుకొచ్చారు. 
మొదట్లో రాజీ దంపతులు కోయంబత్తూరులో ఉండేవారు. అక్కడ ఆమె భర్త ఆటో నడుపుతుండేవారు. 
అప్పుడామె తక్కువ జీతానికి ఓ కంపెనీలో పని చేస్తుండేవారు. ఆదాయం పెద్దగా ఉండేది కాదు. కుటుంబ పరిస్థితులను తట్టుకోవడం కోసం కోయంబత్తూరు నుంచి చెన్నైకి మకాం మార్చారు. చెన్నైలోనూ ఆమె భర్త ఆటో నడుపుతూ వచ్చారు. అయితే భర్తకు తోడుగా తానూ ఏదో ఒకటి చేయాలనుకున్నారు రాజీ. తాను ఆటో నడపాలని అనుకున్నారు. మనసులో మాటను భర్తతో పంచుకున్నారు. "అందరూ మంచోళ్ళే...నీకు ఇష్టముంటే నడుపుకో" అని ప్రోత్సహించారు ఆమె భర్త. ఆయన ఓ గంటన్నర సేపు ఆటో నడటం నేర్పించారు ఆమెకు. ఆ తర్వాత తానే నడపటం మొదలుపెట్టారు రాజీ. 
ప్రారంభంలో ఆటో నడుపుతున్నప్పుడు ఒక్కొక్కరూ ఎలాంటివారో అర్థం చేసుకున్న ఆమెను కొందరు రాత్రి పది గంటల తర్వాత ఎందుకమ్మా ఆటో నడుపుతున్నావు అని అడిగినవారున్నారు. కొందరు అవి ఇవి మాటలు మాట్లాడి డబ్బులివ్వక వెళ్ళిపోయేవారట. 
ఓరోజు రాత్రి టైము పది దాటింది. సెంట్రల్ స్టేషన్ కి ... వస్తావా అని అడిగారు. అయితే ఆ మనిషి అడిగిన తీరుతో ఆమెకు కోపం వచ్చింది. రానని చెప్పేశారు రాజీ. అయితే ఆ మనిషి వదల్లేదు. "ఎంతైనా ఇస్తాను. నువ్వొస్తావా" అని పదే పదే అడిగాడా మనిషి. 
ఇలా రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులను చూసిన రాజీ ఒక్కొక్కప్పుడు ఎందుకురా ఆటో నడుపుతున్నానని అనుకున్న సందర్భాలున్నాయి. అయితే పిల్లలను చదివించడానికి తానూ కష్టపడకతప్పదనుకున్నారు. ఆమె కూతురికి పెళ్ళికూడా చేసేసారు. ఆ కూతురుకో బిడ్డకూడా పుట్టింది. కొడుకు కాలేజీలో చదువుతున్నాడు. కూతురి పిల్లలకు ఆమె ఆటో నడపటం ఇష్టం లేదట. ఎందుకంటూ తక్కువచేసి మాట్లాడుతుంటారట. అయితే కన్నబిడ్డలు  ఆమెను గొప్పగా చూస్తున్నారు. కుటుంబ పరిస్థితులవల్ల ఆటో నడపటం చేస్తున్నానంటుంటారు రాజీ. 
పూర్వం ఉదయం అయిదు గంటలకే ఆటో సవారీ మొదలుపెట్టేసే ఆమెను ఇప్పుడు శరీరం అంతగా సహకరించడం లేదట. ఉదయం తొమ్మిది తర్వాతే నడపటం మొదలుపెడుతున్నారు. 
ఒకరోజు ఆమె కోడంబాక్కం నుంచి జెమినీకి వస్తుండగా ఓ రోడ్డుప్రమాదం. ఓ వ్యక్తి గాయపడ్డాడు. అందరూ ఆ మనిషి చుట్టూ నిల్చుని వినోదం చూస్తున్నారు తప్ప ఏమీ చేయడం లేదు. అప్పుడు ఆమె తన ఆటోలో వస్తున్న ప్రయాణికులను దిగమని చెప్పి యాక్సిడెంటుకి గురైన మనిషిని ఎత్తుకుని ఆటోలో కూర్చోబెట్టి ఆస్పత్రికలో చేర్చారు. ఆనంతరం అతని ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పారు. గాయపడిన మనిషి పేరు అన్బరసన్. బ్యాంక్ మేనేజర్. ఆరోజు ఆయన పర్సులో బోలెడు డబ్బుంది. ఆ డబ్బుని వారికి జాగర్తగా అప్పగించి అర్ధరాత్రి ఇంటికి చేరారు రాజీ. తర్వాత ఆ మనిషి కోమాలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. తరచూ ఆమె ఆస్పత్రికి వెళ్ళి చూస్తూ వచ్చేవారు. కొంతకాలం తర్వాత ఆయన వివరాలు తెలియలేదు. ఆయన ఎలా ఉన్నారోనని అప్పుడప్పుడూ ఆమె ఆలోచిస్తూ ఉంటారు. సవారీ లేని సమయాలలో స్కూలు విడిచిపెట్టి చెప్పులు లేకుండా నడిచి వెళ్తున్న పిల్లలను చూడగానే వెంటనే వారిని ఆటోలో ఎక్కించుకుని పోయి వారిని వారి ఇళ్ళ దగ్గర విడిచిపెడతుంటారు. వారి నుంచి డబ్బులు తీసుకోకుండా చేసే ఈ సేవ తనకెంతో ఆనందాన్నిస్తుందని రాజీ చెప్తుంటారు.
రోజుకి ఏడు వందల రూపాయలవరకూ సంపాదనుంటుందని, ఒక్కోరోజు ఏమీ లభించదని చెప్పే రాజీ చెన్నైనగరంలో రకరకాల మనుషులున్నారని చెప్తారు. తొలిరోజుల్లో ఎవరెలాంటివారో అంచనా వేయడం కష్టంగా ఉండేదట. అయితే పోనుపోనూ అనుభవం ఎన్నో పాఠాలు చెప్పిదనే రాజీ ఆక్సిడెంటులో గాయపడిన వారికి సాయం చేస్తున్నప్పుడు కొందరు నీకు దీనివల్ల ఒరిగేదేముంటుంది అని మాటలనేవాళ్ళున్నారట...అయితే మంచో చెడో...ఈ ప్రాణం ఇతరులకు ఏదో రూపంలో సాయపడాలి. లేకుంటే మనిషై పుట్టినందుకు అర్థమేముంటుందన్న రాజీ సహృదయం ఆకాశాన్ని మించిందంటే అతిశయోక్తి కాదుగా!!
 






కామెంట్‌లు