"అపార్ధం";-ఎం బిందుమాధవి
 తొందరపడిఒకనిర్ణయానికివచ్చెయ్యటం మనసులోమనకికలిగినభావాన్ని
(అదిసానుకూలమైనావ్యతిరేకమయినా)ఇతరులకిఆపాదించటంఅనేతప్పుతరచూఅందరంచేస్తుంటాం
.అలాంటి ఒక సంఘటన రామాయణంలో నించి ఇప్పుడు చెప్పుకుందాం!
@@@@
రాముడు పదునాలుగేళ్ళు వన వాసం చెయ్యాలని, భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని కైకేయి కోరుతుందని కధాపరంగా మనకి తెలుసు. ఈ సంఘటన జరిగినప్పుడు భరత శతృఘ్నులు కోసల దేశంలో లేరు. భరతుని మేనమామ గారింటికి వెళతారు.
భరతుడు తిరిగొచ్చాక జరిగింది తెలుసుకుని..తల్లిని నిందించి..మరణించిన తండ్రికి అంతిమ సంస్కారాలు జరిపి..అడవికి వెళ్ళి తన అన్నగారైన రాముడిని తీసుకొచ్చి..తండ్రి కోరుకున్నట్టుగా ఆయనకి పట్టాభిషేకం చెయ్యాలనుకుంటాడు.
ఆ పని మీద అడవికి బయలుదేరిన భరతుడు అశేష సైన్యంతో, రధాలతో, గజాలతో సహా వెళతాడు.
ఆ సైన్యం కదలికల వల్ల రేగిన ధూళి వల్ల కమ్ముకున్న మేఘాలు ఏమిటో చూసి రమ్మని రాముడు లక్ష్మణుడిని పంపిస్తాడు.
రధాలు, ఏనుగుల మీద ఉన్న పతాకలని పోల్చుకున్న లక్ష్మణుడు...భరతుడు సైన్య సమేతంగా వస్తున్నాడు అని చెబుతాడు.
అంతటితో ఆగక..."తమని చంపేసి శత్రు శేషం లేకుండా చేసుకోవాలనే కుట్రతో భరతుడు సైన్య సమేతుడై వస్తున్నాడు. మనం ఆయుధ ధారులమై అతన్ని ఎదుర్కోవాలి. అతను యుద్ధం ప్రారంభించేలోపే మనం అతన్ని చంపెయ్యాలి. అన్నా ఆయుధాలతో సిద్ధమవుదాం. వదిన సీతమ్మని కుటీరంలో నించి బయటికి రావద్దని చెబుదాం" అంటూ కోపంతో బుసలు కొడుతూ ధనుర్బాణాలు ధరించి లక్ష్మణుడు సర్వ సన్నద్ధంగా ఉంటాడు.
"భరతుడు ఇంతకు మునుపు మనకి హాని తలపెట్టిన సందర్భాలేమయినా ఉన్నాయా? నువ్వెందుకు భరతుడి గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు? అసలు ఆ వచ్చేది మన తండ్రిగారయిన దశరధుడు అయి ఉండచ్చు కదా! వనవాసంలో ఉండే కష్టాలు ఊహించి మనని రాజ్యానికి తిరిగి రమ్మని అడగటానికి అయ్యుండచ్చు కదా!"
"లేక మనం వనవాసానికి వచ్చేటప్పుడు రాజ్యంలో లేని భరతుడు మనని చూసి వెళ్ళటానికి వస్తూ ఉండచ్చు కదా! లేదా తనకి పట్టాభిషేకం చేయబడిన రాజ్యాన్ని నన్నే పరిపాలించమని అడగటానికి వచ్చి ఉండచ్చు కదా" అంటాడు భ్రాతృ ప్రేమ కలిగిన దయార్ద్ర హృదయుడైన రాముడు.
ఇది రాముడు చేసే సానుకూలమైన ఆలోచనా విధానం.
"అందరి గురించి మీ ఆలోచన అలాగే ఉంటుంది. నిన్ను నిర్దయగా వనవాసానికి పంపించిన కైకని..అంత ముదిమి వయసులో భార్య ప్రేమకి కట్టుబడి ఆమెకి వరాలిచ్చిన తండ్రి గారిని కూడా నిందించనివ్వలేదు. ఆ తల్లి కొడుకే కదా ఈ భరతుడు" అంటాడు లక్ష్మణుడు.
తనకి అత్యంత ఆత్మీయుడు, బహిః ప్రాణమైన శ్రీ రామచంద్రుడికి కలిగిన కష్టానికి స్పందించిన లక్ష్మణుడి హృదయం ఇది. సహజంగానే అది భరతుడి పట్ల వ్యతిరేకం గానే ఉంటుంది.
"మన తండ్రి గారిని ఈ వరాలడిగే ముందు వరకు మనని అతిగా ప్రేమించి...లాలించి, మన క్షేమమే కోరిన ఆ తల్లిని అలా నిందించకూడదు. అప్పటి వరకు మనని ప్రేమించిన తల్లిదండ్రులు నీ దృష్టిలో మంచి వాళ్ళే. ప్రేమ మూర్తులే! పట్టాభిషేకం చేస్తానన్న తండ్రి గౌరవనీయుడే!"
"అప్పటి వరకు మంచివారైన మన తల్లిదండ్రులు వనవాసానికి వెళ్ళమనేసరికి చెడ్డవారెలా అయ్యారు? ప్రతి మనిషి జీవితం వారి పూర్వ కర్మ నిర్ణయిస్తుంది. ఇది కూడా అలాంటిదే..కాబట్టి వచ్చేది భరతుడే అయితే అతనేమి చెబుతాడో విందాం. త్వరపడి ఏ నిర్ణయానికి వచ్చి ఎవరి గురించి ఏ తీర్పు ఇవ్వకూడదు" అంటాడు రామచంద్ర మూర్తి.
తరువాత భరతుడు రాముడి దగ్గరకి రావటం..తండ్రి గతించిన విషయాన్ని చెప్పటం ...తండ్రి మరణానికి దారితీసిన తన తల్లి చేసిన ద్రోహానికి పశ్చాత్తాప పడటం... రాముడు పాలించవలసిన రాజ్యాన్ని పాలించగల సమర్ధత తనకి లేదని చెప్పటం.. రాముడు లేని రాజ్యంలో తను ఉండలేనని అయోధ్య కి బయట నందిగ్రామంలో అన్నగారి లాగే నార వస్త్రాలు ధరించి సన్యాసి జీవితం గడుపుతాననటం జరుగుతాయి.
అన్నగారు భూశయనం చేస్తాడు కనుక, అదే స్థాయిలో తను శయనించటం అపరాధమని నిర్ణయించుకుని..భూమిని కొంత లోతు తవ్వి అన్నగారి కంటే తక్కువ స్థాయిలో ఉంటూ పదునాలుగేళ్ళు క్షణమొక యుగంగా గడుపుతానని..పదునాలుగేళ్ళ తరువాత వెంటనే అన్నగారు తిరిగి రాకపోతే ఇంక ఒక్క రోజు కూడా జీవించి ఉండనని శపధం చేసి..అలా జరగగలదని అన్నగారి దగ్గర మాట తీసుకుంటాడు. అన్నగారి ప్రతినిధిగా అయోధ్యని పాలించటానికి ఆయన పాదుకలని తీసుకుని తిరిగి వెళతాడు.
మన జీవితాల్లో కూడా ఇలా కాకపోవచ్చు..ఇందుకు తుల్యంగా సంఘటనలు జరుగుతాయి. ఎదుటి వారు ఏం చెప్పదల్చుకున్నారో వినం! వారి హృదయమేమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించం.
మన పాటికి మనం ఊహించేసుకుని..దానికి మరికొన్ని అసందర్భపు అనుభవాలని జోడించి...మన మాటే నిజమని మన చుట్టూ ఉన్నవారిని నమ్మించి ఒప్పించే ప్రయత్నం చేస్తాం!
పూర్తిగా వినకుండా, చూడకుండా.. ఒక వ్యక్తి గురించి తెలుసుకోకుండా తొందరపడి తీర్పు చెప్పేసి, వారిని దూరం చేసుకున్నందువల్ల నష్టపోయే ప్రమాదముంటుంది.
"అర్ధం చేసుకోవటం కష్టం..అపార్ధం చేసుకోవటం తేలిక"
అందరూ భరతులని కాదు.. అలాగే అందరూ లక్ష్మణులనీ కాదు.
నిజానిజాలు తెలిసేవరకు ఓర్పు వహించటం మంచిది!


కామెంట్‌లు