ఆవేశం అనర్ధదాయకం; -: సి.హెచ్.ప్రతాప్
 రామాపురం శివార్లలో చిదానందుడు అనే మహర్షి ఒక గురుకులం స్థాపించి శిష్యులకు విద్యాబోధన చేస్తున్నారు.ఆయన సకల శాస్త్ర పారంగతుడు. వేద శాస్త్రాలను, పురాణాలను, ఉపనిషత్తులను ఔపోసన పట్టిన దిట్ట. ఆయన శిష్యరికంలో అనేకమంది సకల శాస్త్ర కోవిదులుగా తీర్చిదిద్దబడి దేశంలో వివిధ ప్రాంతాలలో మంచి కొలువులలో స్థిరపడ్డారు.

ఒక రోజు ఉదయం చిదానందులు సంధ్యావందనం చేసుకుంటుండగా భార్గవుడు అనే అతని శిష్యుడు కోపంగా గురువు  వద్దకు వచ్చాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం ఆవేశంతో జేవురించి వుంది. ముక్కుపుటాలు ఎగిరెగిరి పడుతున్నాయి. " గురువు గారు, ఊరిలో రామయ్య అనే వర్తకుడు నా గురించి, మీ గురించి, మన ఆశ్రమం గురించి ప్రేలాపనలు పేలుతున్నాడు. ఆధ్యాత్మికత ముసుగులో చేయకూడని పనులు చేస్తున్నామని మనల్ని ఆక్షేపిస్తున్నాడు."
శిష్యుని ఆవేశం చూసిన చిదానందులు " నాయన మితిమీరిన ఆవేశం వంటికి , మనసుకు కూడా పనికిరాదు.ఇప్పుడు మనమేం చేయాలో చెప్పు" అని శాంతంగా అడిగారు.
"మీరిప్పుడు నాతో వస్తే అతని దగ్గరకు వెళ్ళి అతని ఆక్షేపణలకు తగ్గ సమాధానం చెబుదాం.అప్పుడు అతను నోరు మూసుకుంటాడు" చెప్పాడు శిష్యుడు.

చిదానందుడు కాస్సేపు ఆలోచించి" సమస్య తీవ్ర రూపం దాల్చి నట్లుంది. సరే అయితే మనం ఇద్దరం వెళ్ళి ఆ రామయ్యకు తగిన బుద్ధి చెబుదాం" అని అన్నారు.

" ఇంకేం, వెంటనే పదండి. తిరిగి వచ్చేసరికి బాగా పొద్దు పోవచ్చు" తొందర పెట్టసాగాడు భార్గవుడు.

"ఇప్పుడు చేయవలసిన ధార్మిక కార్యాలు ఎన్నో వున్నాయి, కాబట్టి రేపు ఉదయమే వెళ్దాం" అని చెప్పి భార్గవుడిని పంపించేశారు మహర్షి.

మర్నాడు ఉదయం నిత్య నైమిత్తిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మహర్షి భార్గవుడిని పిలిచి వర్తకుడిని కలిసే నిమిత్తం గ్రామానికి వెళ్దాం అని అన్నారు. మహర్షి, ప్రస్తుతం సాధనలో వున్నాను. మధ్యాహ్నం వెళ్దాం అని అన్నాడు భార్గవుడు.

మధ్యాహ్నం తిరిగి అతడిని పిలవగా" మహర్షి, ఆలోచించి చూస్తే  ఇందులో రామయ్య తప్పు ఏమీ లేదనిపిస్తోంది. ఏదో యధాలాపంగా అతడు అన్న మాటలు పట్టుకుని నేను అనవసరంగా వాదనకు దిగాను. ఈ మాత్రం దానికి మనం అతడిపై గొడవకు వెళ్ళడం అనవసరం  అనిపిస్తోంది. ఈ సారికి అతడి తప్పును క్షమించేస్తాను" అని సవినయంగా అన్నాడు భార్గవుడు..
అప్పుడు చిరునవ్వుతో చిదానందులు" ఆవేశం అనర్ధ దాయకం అని నీకర్ధం అయ్యేలా చేసేందుకే నిన్న మనం వెళ్లడానికి అంగీకరించలేదు. ఆవేశంలో మన మనస్సు నిగ్రహం కోల్పోతుంది. ఏం మాట్లాడుతామో, ఎలా ప్రవర్తిస్తామో అన్నదానిపై మనకు నియంత్రణ ఉండదు. 24 గంటలు గడిచేసరికి  ఆ కోపం అంతా చల్లారిపోయి, వివేకం ఉదయిస్తుంది.మనపై మరింత నియంత్రణ వస్తుంది.అందుకే ఆవేశంలో వున్నప్పుడు మనస్సును చల్లార్చుకోవడానికి ప్రయత్నించాలి" అని హిత బోధ చేసారు.

కామెంట్‌లు