సానుకూల ధృక్పధం; -సి.హెచ్.ప్రతాప్
 ఒక ప్రపంచ ప్రసిద్ధ చెప్పుల తయారీ సంస్థ అధిపతి ఒక సందర్భంలో తన సంస్థ యొక్క వ్యాపార కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించుకున్నాడు. ఏ దేశంలో కొత్త ఫ్యాక్టరీ పెట్టాలా అని ఆలోచిస్తూ వార్తా పత్రికలు తిరగేస్తుండగా ఒక ఆఫ్రికా దేశంలో , ఒక నగరంలో కొత్తగా ఫ్యాక్టరీ పెడితే అవకాశాలు బాగుంటాయని చదివాడు. వెంటనే తన మేనేజర్ కు ఫోన్ చేసి ఆ నగరం యొక్క వివరాలు ఇచ్చి అక్కడికి వెళ్ళి వ్యాపార అవకాశాలు పరిశీలించడంతో పాటు ఫ్యాక్టరీ పెట్టేందుకు అనువైన స్థలం కూడా నిర్ణయించుకు రమ్మని  చెప్పాడు. ఆ మేనేజర్ ఆ నగరానికి వెళ్ళి ఆదరాబాదరాగా అధిపతికి ఫోన్ చేసాడు." సార్, మీ వద్దనున్న సమాచారం తప్పు.ఈ నగరంలో ఎవరికీ చెప్పులు లేదా బూట్లు వేసుకునే అలవాటు లేదు. ఇక్కడ నాగరికత కూడా అంతగా అభివృద్ధి చెందలేదు.ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడం వలన మనకు ధన నష్టం తప్ప ఎలాంటి ప్రయోజనం ఒనగూడదు.మీరు అనుమతిస్తే నేను తర్వాత ఫ్లైట్ పట్టుకొని అక్కడకు వచ్చేస్తాను" అని చెప్పాడు.
ఆ మాటలకు అధిపతికి ఎంతో కోపం వచ్చింది. అయినా తన కోపం నిగ్రహించుకుని, అతగాడిని వెనక్కి వచ్చేయమని చెప్పి ఇంకొక కుర్రాడైన మేనేజర్ను అక్కడికి పంపాడు. మొదటివాడికి ఇచ్చిన సూచనలనే రెండవ వాడికి కూడా ఇచ్చాడు.
రెండో మేనేజర్ అక్కడికి వెళ్ళిన రెండ్రోజుల తర్వాత ఎంతో ఎగ్జైటింగ్ గా ఫోన్ చేసాడు." సార్. ఈ ప్రదేశం ఒక అద్భుతం. ఇక్కడ ఎవరికీ చెప్పులు లేదా బూట్లు వేసుకునే అలవాటు అసలే లేదు. అయితేనేమి వారికి తక్కువ ధరలో చెప్పులు, బూట్లు తయారు చేసి వారికి అందించి వారికి క్రమక్రమంగా అవి వాడడం అలవాటు చేస్తే మన బిజినెస్ అద్భుతంగా పెరుగుతుంది.ఇప్పటి వరకు ఎవరూ అడుగుపెట్టని మార్కెట్ కనుక మనం త్వరగా అడుగుపెట్టి వ్యాపారం అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాలి. మీరు అనుమతి ఇస్తే స్థలం కూడా వెదికాకే అక్కడికి వస్తాను" అని చెప్పాడు.
అధిపతి చిరునవ్వుతో అతడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా తర్వాత నెల నుండి 25 శాతం జీతం పెంచి కొత్త దేశంలో పెట్టబోయే ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్ గా నియమించాడు. వ్యాపారం ఒక్కటే, ప్రదేశం ఒక్కటే, ఇద్దరు వ్యక్తులు వాటిని చూసే వైఖరి పట్ల ఆధారపడి ఉంటుంది. పాజిటివ్ థింకింగ్ అంటే సానుకూల దృక్పధం అవలంబించేవారికే విజయలక్ష్మి వరిస్తుంది. 
సి హెచ్ ప్రతాప్ 

కామెంట్‌లు