మంచిదొంగ దొరికాడు;-డి.కె.చదువులబాబు. ప్రొద్దుటూరు.కడపజిల్లా.

 తరగతి గదిలోకి అడుగుపెట్టాడు తెలుగు ఉపాధ్యాయుడు గోపాలరావు. అమల వెక్కివెక్కి ఏడుస్తూ ఉండడం గమనించాడు. దగ్గరకెళ్లి కారణం అడిగాడు.
  "మాష్టారూ!నా గజ్జెల గుర్రం కనిపించడం లేదు"ఏడుస్తూ చెప్పింది అమల.
ఆయనకు అర్థం కాలేదు. తిరిగి అడిగాడు. మళ్లీ అదేమాట చెప్పింది.వెంటనే కమల లేచి "మాష్టారూ!అమల నాన్న గజ్జెల గుర్రం అనే కథల పుస్తకం తెచ్చాడు. రెండు రోజులుగా ఆపుస్తకాన్ని అమల పాఠశాలకు తెస్తాఉంది.నిన్నటిదినం ఇంటికెళ్లాక పుస్తకాల సంచిలో చూసుకుంటే కనిపించడం లేదట.తరగతి గదిలో ఎవరిని అడిగినా తెలియదంటున్నారు.ఆ పుస్తకాన్ని ఎవరు దొంగలించారో అర్థంకాక ఏడుస్తోంది"చెప్పింది.
ఆయనకు విషయం అర్థమయింది. 
"అమల కథలపుస్తకం ఎవరు తీశారో చెప్పండి?"అన్నాడు మాష్టారు. ఎవ్వరూ ఉలకలేదు.పలకలేదు.ఒక్కొక్కరినీ నిలబెట్టి అడిగారు.అందరూ తెలియదన్నారు. అందరి సంచుల్లో వెదికినా కనిపించలేదు. 'నిన్నటిదినం పోయినది, ఈరోజు సంచిలో ఎందుకుంటుంది.ఇంటి దగ్గర పెట్టి ఉంటారు.' అనుకున్నాడు. ఆయనకు ఏంచేయాలో అర్థం కాలేదు.
మరునాడు అమల నాన్న పాఠశాలకు వచ్చాడు.ప్రధానోపాధ్యాయుడిని కలిశాడు. "కథలపుస్తకం ఎవరు తీశారో తేల్చి
అమలకు పుస్తకం ఇప్పించండి"అని చెప్పి వెళ్లాడు. 
ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులను పిలిచి విషయం చెప్పాడు. 
"పిల్లలందరినీ పదేపదే అడిగాను. ఎవరూ చూడలేదంటున్నారు"చెప్పాడు  తెలుగు మాష్టారు.
 'ఏ సాక్ష్యం లేదు. మరి ఎవరు పుస్తకాన్ని తీసుకెళ్లారో ఎలా తేల్చాలి?.' అని అందరూ ఆలోచనలో పడ్డారు. వారంరోజులయినా పుస్తకం తేలలేదు. 
  ఆనెల నవంబరు14 బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకుతరగతులవారీగా కథలు, పద్యాలు చెప్పే పోటీలు ప్రకటించాడు తెలుగు ఉపాధ్యా యుడు.పోటీలో పాల్గొనేవారు మూడు కథలు,మూడు పద్యాలు చెప్పవలసి ఉంటుంది.పోటీలు పూర్తయ్యాయి. కథల పోటీలో ఆ తరగతిలో గోపీ ప్రథమబహుమతికి, కమల ద్వితీయ బహుమతికి, చందు తృతీయ బహుమతికి,మరో పదిమంది ప్రోత్సాహక బహుమతికి ఎన్నికయ్యారు. అమల పుస్తకం పోయిందన్న దిగులుతో పోటీలో పాల్గొనలేదు.తెలుగు మాష్టారు గోపీని ప్రధానోపాధ్యాయుడి గదిలోకి పిలిచి "గోపీ...అమల సంచిలో నుండి గజ్జెలగుర్రం పుస్తకం నీవే తీసుకున్నావు. నీవు తీశావని ఎవరికీ చెప్పను. రేపటిదినం పుస్తకం తెచ్చి అమల సంచిలో ఉంచు" అన్నాడు గట్టిగా. 'తాను పుస్తకం తీసే సమయంలో ఎవరూ చూడలేదు.మరి తెలుగు మాష్టారు ఇంత కచ్చితంగా ఎలా కనుక్కున్నారు?' అనుకుంటూ తలవంచుకున్నాడు గోపి. మరునాడు పుస్తకం తెచ్చి ఎవరూ చూడకుండా అమల పుస్తకాల సంచిలో ఉంచాడు.తర్వాత సంచిలో పుస్తకం చూసుకున్న అమల "నా గజ్జెల గుర్రం దొరికింది" అంటూ గెంతులేసింది.
 తెలుగు మాష్టారు విద్యార్థులతో "దొంగతనం చాలా పెద్దతప్పు. ఈరోజు చిన్న చిన్న దొంగతనాలు భవిష్యత్తులో పెద్ద దొంగతనాలకు దారితీస్తాయి. కఠినమైన శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఒకసారి దొంగగా ముద్రపడితే ఆ మచ్చను పోగొట్టుకోవడానికి జీవితకాలం సరిపోదు. కష్టపడి సాధించాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో దొంగతనం చేయకూడదు"అని వివరించారు.
పోటీల్లో విజేతలకు గజ్జెల గుర్రం కథలపుస్తకాలు బహుమతిగా ఇచ్చారు.ఆపుస్తకాలను చూసుకుని గోపీతో సహా అందరూ మురిసిపోయారు.
"మాష్టారూ! గోపి ఆ పుస్తకం తీశాడని ఎలా గుర్తించారు"అని తెలుగు మాష్టారును అడిగాడు ప్రధానోపాధ్యాయుడు.
"మాష్టారూ! నేను గజ్జెల గుర్రం పుస్తకం కొని అందులోని కథలు చదివాను. తర్వాత కథలు చెప్పే పోటీ ఏర్పాటు చేశాను. అందరూ రకరకాల కథలు చెప్పారు. గోపీ మాత్రం గజ్జెలగుర్రం పుస్తకంలోని కథలు చెప్పాడు.దాంతో పోయిన ఆపుస్తకం గోపీ వద్ద ఉందని అర్థమయింది. ఈ దొంగతనానికి కారణం మన వద్ద సరైన గ్రంథాలయం లేకపోవడమే" అని చెప్పాడు. ఏ సాక్ష్యం లేని సమస్యను తేల్చిన తెలుగు మాష్టారు తెలివిని అందరూ అభినందించా రు.తర్వాత పాఠశాలలోని పాతబడి, చినిగిపోయిన పుస్తకాలన్నింటినీ తీసేసి రంగురంగుల కథల పుస్తకాలు కొని తెచ్చి నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశారు. పేనాలు,పెన్సిల్లు,రబ్బర్లు,స్కేల్లు,అట్టలు
మొదలగు అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచారు. అవసరమైన వారు వాటిని ఉపయోగించుకుని తిరిగి అక్కడే ఉంచాలి. విద్యార్థుల ముఖాలు దివ్వెల్లా వెలిగిపోయాయి.తర్వాత, ఎప్పుడూ పాఠశాలలో దొంగతనం జరుగలేదు.

కామెంట్‌లు