-అంతా మనమంచికే - అనుకుంటే పోలా? ;-ఎం. వి. ఉమాదేవి బాసర.
నాలుగుపాదాలున్న గోవు ధర్మదేవత.. 
ఒకే కాలితో నడుస్తున్నపుడు
మంచిచెడుల అర్థం మారి 
మసకమారిన విలువలదృశ్యంలో
మనం అనుకున్న ఆనాటిమండువాలోగిలి
నేనునాది అనే అపార్ట్మెంట్ సంస్కృతిలో 
కాసింత వ్యక్తిత్వం నిలుపుకుంటూనే.. 
చిన్నచిన్న సంతోషక్షణాలని మనసుసంచీలో దాచి
కలతపడే కొన్నివిషయాలకూ జడవక, 
అంతా మనమంచికే 
అనుకుంటే పోలా.. !? 

అపార్ధం చింతతోపులు
చుట్టూరా చీకట్లు పరిస్తే 
కలవరపెడుతున్న..,  కావాలనిపిస్తున్న బంధాలకి 
కాసింత దూరాన నిలబడి 
నీ సుఖమే నేకోరుతున్నా 
అని పాడేసుకుంటే పోలా!? 
మూన్నాళ్ళ స్వచ్ఛ జీవ నదీప్రయాణంలో 
మురికి అంటించుకోడం ఎందుకు?!
అనుక్షణం వేధించే జ్ఞాపకాల వైతరణి దాటేసి, 
ఏదిమంచి చెడో బేరీజు వేసి మల్లగుల్లాలు పడేకంటే, 
సింధూ నాగరికతలోయలో 
స్థితప్రజ్ఞత వెతుక్కుని 
అంతా మనమంచికే అనుకుందాం!!


కామెంట్‌లు