గుర్తుకొస్తున్నాయి-- రొంటిసంచి ;-సత్యవాణి-  కాకినాడ
  మనజీవితంలో జరిగిన కొన్ని కొన్ని చిన్నచిన్న సంఘటనలే మనకు పాఠాలు నేర్పుతాయి.
          అలాంటి పాఠం నేర్పిన సంఘటన నాజీవితంలోజరిగింది.అదేమిటంటే,    ,    వెళ్ళక వెళ్ళక నేను మావారితో బజారు పనిమీద,ఆయన బజాజ్ స్కూటరు మీద బయలుదేరాను.
అదసలే డొక్కు బండి.ఎక్కడ ఎందుకు,ఎప్పుడాగిపోతుందో దానికీ,దాని యజమానైన మావారికీ కూడా తెలియదు. తనబండి మీద రానంటే తనకు కోపం."పడుచు బళ్ళు తప్ప ఎక్కవ్" (మోటార్ సైకిళ్ళు)అంటూ అసూయ పడతారు ఆయన.
             సరే ఇప్పుడు విషయానికి వస్తే,తప్పని పరిస్థితిలో ఆయనతో ,ఆయన బండిమీద బజారుకు బయలుదేరాను.
                బండి బాగానే వెడుతోంది,సైకిళ్ళ కంటే కొంచం వేగంగానే. శ్రీరామనగర్ ప్లైవోవర్ దిగి సాయిబాబా గుడి దగ్గరకు వచ్చేసరికి యధాప్రకారం రోడ్ మధ్యలో నేను భయపడినట్లుగానే,  బండి ఆగిపోయింది.దానికది అలవాటే! అప్ యెక్కవలసివచ్చినా,డౌన్ లో దిగవలసివచ్చినా ఆగిపోతుంది." అందుకే మహానుభావా  !మీతో నేను రాననేది" అని నేనంటే,"నా బండిమీద నీకు నమ్మకం లేదు కదా!అందుకే దానికి నీ సవారీ అంటే నచ్చక ఆగిపోతుంది.మరి నే వెళ్ళేటప్పుడు ఎందుకాగిపోదు?"అంటూ వితండ వాదం చేస్తూంటారాయన.
              యధాప్రకారం    టూ టౌన్ సాయిబాబా గుడి యెదురుగా ఆగిపోయిన బండికి ,మా ఆయన చెమటలు కార్చుకుంటూ, కిక్ మీద కిక్  కొడుతుంటే,ట్రిఫిక్ అంతరాయానికి కోపంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ విజిల్ మీద విజిల్ వేస్తున్నాడు. ఆయన దగ్గరకొచ్చి "సార్ !బండిని ప్రక్కకి తీయండి అని,తీయడానికి ఆయనకి బండిని తోసి సహాయంకూడా చేసిపెట్టేడు.
                  సరే ఆయన ఎప్పటిలాగే బండిని పడుకోపెట్టీ,నించోపెట్టి,ఊపి ఊపీ
 స్టార్ట్ చేసే ప్రయత్నంలోనే ఆయన వున్నారు.మధ్య మధ్య   బండిని కోపంతో తన్నుతున్నారుకూడా.
                    ఇది యింతలో యెలాగా అయ్యే పని కాదని నేను నిదానంగా పరిసరాలు పరిశీలిస్తున్నాను.అంతులేకుండా పెరిగిపోయిన కాకినాడ ట్రాఫిక్ కి ఆశ్చర్యపోయి చూస్తున్నాను.ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసే విన్యాసాలకు నవ్వుకుంటూనే,చమటతో తడసిన అతని యూనీఫామ్ చూసి జాలిపడుతూ ,అతడికి సహకరించని జనాలను చూసి చిరాకు పడుతుా వుండగానే ఎప్పుడు ఆయన బండి  స్టార్ట్ అయ్యిందో నేను గమనించేలోపుగానే, వెనకాల నేను యెక్కిందీ లేనిదీ చూసుకోకుండానే, రయ్య్ మని దూసుకు వెళ్ళిపోయారాయన.తప్పట్లు కొట్టీ,విజిల్స్ వేసీ పీలవడానికి నేనేమీ మగరాయుడిని కాదుగదా!
 అక్కడ వున్నవారు నా అ వస్థ,నా వెర్రిమొఖం గమనించి, వారు తప్పట్లూ కొట్టేరు .విజీల్సూ వేశారు. వెనక్కి తిరిగితే వినిపించుకొనే పధ్ధతి లేనాయన ,అయినా బండాపితే ఎక్కడ మళ్ళీఅవస్థలు పడవలసివస్తుందనో ఏమో ఆపకుండా వెళ్ళిపోయారు.
                    ఈతరంలేడీస్ లా, భుజానికి బ్యాగ్ ,అందులో రడీ కేష్ పెట్టుకోవడం అలవాటు లేని నేను,రూపాయి అవసరానికి కూడా ఆయన జేబుకేసి ఆశగా చూసేనేను, కళ్ళనీళ్ళు కుక్కుకుంటూ,అవమాన భారంలో మునిగిపోయి నిలబడీ పోవడం గమనించిన ఒక మనసున్న మహరాజు ,నా అసహాయ పరిస్థితిని ఆకళింపు చేసుకొని ,"ఎక్కడికెళ్ళాలమ్మా?అని
అడిగి ",నేనూ అటే వెళ్ళాలి రండి" అని ఆదరంగా పిలిచి బండిమీద ఇంటి దగ్గర దింపుతూ,"అమ్మా ! మా అమ్మలాంటి వారు,మీకు ఒకమాట చెపుతాను .ఏమీ అనుకోకండి. ఆడవాళ్ళ దగ్గర ఎంతో కొంత సొమ్ము  ఎప్పుడూ వుండాలి "చిన్న పర్సులో పెట్టుకొని జాకట్ లో వుంచుకోవడం అలవాటు చేసుకోండి.మా ఇళ్ళలో మా ఆడాళ్ళు రొంటిచిక్కం లేకుండా అడుగు బయటపెట్టరు. ఆపద సమయంలో అదిఅక్కరకొస్తుంది"అని మంచిదైన సలహా చెప్పి వెళ్ళాడు.
                  ఆ తరువాత  ఆదుర్దాగా ఇంటికి వచ్చినాయన,ఇంటిదగ్గర నన్నుచూసి, స్థిమితపడి ,ఆతర్వాతఆయన చేసిన పొరపాటుకు నన్ను, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం, బండెక్కించి  కూడా తీసికెళ్ళిన పెళ్ళం బండెక్కిందో  లేదోనని వెనక్కి తిరిగి చూడకపోవడం ఆయన తప్పుకాదన్నట్లు, అందుకనే నేటి ఆడవాళ్ళందరూ భర్తలకానుకొని,పొట్ట చుట్టూ చెయ్యేసుకొని గట్టిగా పట్టుకూర్చున్నట్లు పట్టుకొమ్మంటే వినవు.నన్ను ముట్టుకోవడం నీకు నామర్థా" అంటూ సతాయించి వదిలిపెట్టేరు.
 చూసుకోకుండా తుర్రుమని వెళ్ళిపోయి,పొరపాటైయ్యిందని ఒప్పుకొని,క్షమించమని అడగక పోగా ,తిట్టడమా ?అని నేను అలగడం,అవన్నీ పక్కన పెడితే ,
ఇప్పుడు నేను హ్యాండ్ బ్యాగ్ ని భుజానికి తగిలించుకొని బయటకు వెళుతున్నా,ఆ అబ్బాయి చెప్పినట్లు ఎంతో కొంత సొమ్మును చిన్న ఫర్స్ లో పెట్టుకొని జాకెట్ లో దాచు కొంటాను.అది నా గుండెకు దగ్గరగా వుండి నాకు ఎంతో ధైర్యాన్నిస్తుంది.హ్యాండ్ బ్యాగ్ ఎక్కడైనా జారిపోయినా, లేక మరచి పోయినా,ఎవడైనా దొంగ వెధవ కొట్టేసినా, నాకు నా చిన్న ఫర్స్" నేనున్నానుగా" అని భరోసాగా వుంటుంది.         నాకు ఆ కుర్రాడు చెప్పిన అభయ సూత్రం మీకేమైనా ఉపయోగపడుతుందేమోనని చెప్పాను. .
               

కామెంట్‌లు