*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 099*
 *ఉత్పలమాల:*
*బొంకనివాఁడె యోగ్యుఁడరి | పుంజము లెత్తినచోటఁ జివ్వకున్*
*జంకనివాఁడెజోదు రభ | సంబున నర్ధి కరంబు సాఁచినన్*
*గొంకనివాఁడె దాత మిము | ఁగొల్చి భజించినవాఁడె పో నిరా*
*తంక మనస్కుఁడెన్నగను | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
అబద్దములు మాట్లాడని వాడె ఉత్తముడు. శతృవులు యుద్ధానికి మీదకు వచ్చినప్పుడు వీపు చూపకుండా నిలబడిన వాడే యుద్ధ వీరుడు. ఎవరైనా సహాయం కోరుతూ చేయి చాచి అడిగినప్పుడు ఇవ్వడానికి వెనకాడని వాడే నిజమైన దాత. ఆలోచించి చూస్తే, మిమ్మల్ని నిరంతరంగా కొలుస్తూ, నీ భజన చేసే వాడే కల్మషము లేని మనసు గల వాడు అవుతాడు!.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*మనము ఎన్ని సార్లు ఎంత చెప్పుకున్నా, పేరు బలం, పేరు జపం, పేరు అనే చెట్టు కొమ్మను పట్టుకుంటే తప్ప మనం భవసాగర తరణం చేయలేము. ఇది నిజం. ఇదే నిజం. అబద్దాలు చెప్పని వాడైన, నిత్యం నిజ జీవిత యుద్ధంలో పోరాడే మామూలు మనిషి అయినా, అడిగిన వానికి లేదు, కాదు అనకుండా దానం ఇచ్చే వాడైనా, ఎవరైనా వదిలి పెట్టకుండా నిత్యం పట్టుకుని ఉండాల్సింది "భగవన్నామం" ఒక్కటే. నామ జపం ఈ చరాచర జగత్తు అంతా ప్రతీ క్షణం, ప్రతీ రోజూ మారు మ్రోగుతూ ఉండాలి. అలా జరిగినప్పుడు, అందరూ క్షేమంగా ఉండ కలుగ తారు, ప్రపంచం అంతా కూడా ఆనంద మయం అవుతుంది. ఈ నామ జపం ఇక్కడ నిరంతరంగా, స్వచ్చమైన గంగా ప్రవాహంలా జరిగేలా పరమేశ్వరుడు అనుగ్రహించాలని వేనోళ్ళ వేడుకుంటూ........*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు