*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 103*
 *చంపకమాల:*
*అల్లన లింగనమంత్రి సుతుఁ | డత్రిజ గోత్రజుఁడాది శాఖ కం*
*చెర్ల కులోద్భవుండనఁబ్ర | సిద్ధుఁడనై భవదంకితంబుగా*
*నెల్లకవుల్ నుతింప రచి | యించితి గోపకవీంద్రుఁడన్ జగ*
*ద్వల్లభ నీకు దాసుఁడను | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
రుగ్వేద ప్రధమ శాఖలో అత్రిజ గోత్రము కల్గిన కంచెర్ల వంశంలో లింగన మంత్రి గారికి కొడుకుగా పుట్టి గొప్ప పేరు సంపాదించుకున్నాను. నా సమకాలీకులు అయిన కవులు అందరూ మెచ్చుకునేటట్టుగా ఒక చక్కని శతకాన్ని రాసి ఈ ప్రపంచానికి భర్తవైన నీకు అంకితం ఇచ్చాను, రమేశా!..... అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*రామచంద్ర ప్రభో! దీనబంధో! కరుణానిధీ! ఎవరు ఎంత గొప్పవారుగా ఎదిగినా, ఎంత పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నా, మన మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని, ఆ మూలాలను పట్టుకుని, ఆ మూలల వలనే మనకు ఉన్నత స్థాయి కలిగింది అని నమ్మకం తో ఉండవలసిన అవసరాన్ని మనకు అర్ధమయ్యేలా చెప్పారు, కంచెర్ల గోపన్న. మన మూలాలలకే కాదు, మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా మనం రుణపడి ఉండాలని కూడా చెప్పారు. మన పుట్టుకకు కారణభూతులైన తల్లిదండ్రులను మరచిపోయి, వారికి గౌరవం ఇవ్వకుండా, మనం ఎంత కీర్తి, ప్రతిష్ఠలు సంపాదించుకున్నా, అది నేల విడిచి చేసిన కర్ర సాము లాగానే ఉంటుంది. ఇంతటికీ కారణమైన జగన్నాధ చక్రవర్తికి కూడా కృతజ్ఞులమై ఉండాలి. అందుకే, మనం పుట్టిన ఊరు, పెరిగిన చోటు, వృద్ధి లోకి రావడానికి సహకరించిన మన తోటివారు లేదా పరిస్థితులు ఇవి అన్నీ మనకు మరపు పొరలలోనికి పోకుండా మన వీపు తట్టి, మనతో ఉంటూ, మనల్ని ముందుకు నడిపించి చివరకు తనలో చేర్చుకోమని, ఆ సకల లోక నాయకుణ్ణి, చిదానందరూపుణ్ణి, చిద్విలాసంతో మనని ఏలుకోమని వేడుకుంటూ........*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు