బైరాగి;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 అమ్మ తన ప్రపంచమైన ఇంటిని మనకు పరిచయం చేస్తే....
చిటికిన వేలును పట్టుకొని నడిపిస్తూ అందమైన బాహ్య ప్రపంచాన్ని
మనకు పరిచయం చేస్తాడు నాన్న...
నాన్న అనేది రెండు అక్షరాల పదమే అయినా దాని వెనుక దాగివున్న 
చరిత్రను చదవడం మొదలుపెడితే ప్రతి పేజీ కూడా ఎర్రని రక్తపు చారల మరకలతో, 
గాయాల రాగాలను పలికిస్తూ మనసులను కబళింపజేస్తుంది...
ఒక్క మాటలో చెప్పాలంటే బంధాల 
కొమ్మలను ఒంటరై మోస్తున్న మాను "తండ్రి"
ఆయనే నిస్వార్ధమైన త్యాగాలకు, అపరిమితమైన అనురాగాలకు నిలువెత్తు విగ్రహం..
సంసారాన్ని సముద్రంతో పోలుస్తుంటారు మన కవులు
ఎందుకంటే అక్కడ ఎలాగైతే సుడిగుండాల సుడులు యమగండాలై వెంటాడుతుంటాయో
అలానే సంసారంలో కూడా సమస్యలు దిన దిన గండాలై
వేదనకు గురిచేస్తూ ఉంటాయి...
అలాంటి సవాళ్లను సమర్థవంతంగా ఎదురుకోవడానికి 
ప్రతి ఇంటా తండ్రిని సృష్టించాడు బ్రహ్మ... విషాన్ని కంఠంలో దాచిన ఆ నీలకంఠుని వలె...
శిలువ భారాన్ని మోసిన యేసు వలె...ఆయన ప్రేమా వాత్సల్యాలు అపారమైనవి...
ఇంటికి పెద్దలా మారి కుటుంబ
బాధ్యతలను తన భుజాలపై మోస్తూ ఎడారి దారుల్లో ఒంటరై ప్రయాణాన్ని 
సాగిస్తూ, కష్టాల కొలిమిలో తాను కాలిపోతూ, బంగారు భవితను 
తన వారసత్వానికి అందించే యాగాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు నాన్న....
నిజానికి, నాన్న అనేది ఏదో నామ మాత్రపు గుర్తింపు మాత్రమే కాదు...అదొక గొప్ప అదృష్టం...
తన గురించి తాను ఏ మాత్రం ఆలోచించకుండా తన కుటుంబం కోసం 
తన జీవితకాలపు సంతోషాలను దానం చేసి బైరాగిగా మిలిగిపోతాడు తండ్రి...
అలాంటి ఉన్నతమైన, ఉత్తమ మైన వ్యక్తిత్వాన్ని 
పూజిద్దాం...గౌరవిద్దాం...సేవిద్దాం....


కామెంట్‌లు