సంప్రదాయం - శాస్త్రీయత;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.

 ప్రపంచ దేశాలలో మన సంస్కృతీ సంప్రదాయాలకున్నంత పేరు మరి ఏ ఇతర సంస్కృతీ సంప్రదాయాలకు లేదు అన్నది వాస్తవం, దాన్ని ఖచ్చితంగా ఎవరైనా ఒప్పుకొని తీర వలసిందే అందులో ఎలాంటి సంకోచం లేదు. అయితే మన సంస్కృతీ సంప్రదాయాలకు ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ప్రతి విషయం వెనుక దాగి ఉన్న శాస్త్రీయతే.
అయితే ఈ శాస్త్రీయత అనేది
మన పూర్వికులు మన జీవన విధానాన్ని బట్టి ఏనాడో నిర్ణయించి మన జీవన విధానంలో భాగంగా రోజువారి కార్యక్రమాల్లో ఇమిడ్చి అతి సులువుగా వాటిని అనుసరించే మార్గాలను ముందే అన్వేషించి ఉంచారు కనుకే వేలాది పరిశోధకులు మన సంప్రదాయాల వెనక ఉన్న శాస్త్రీయతను గుర్తించే పనిలో పడ్డారు. అయితే సంప్రదాయానికి శాస్త్రీయతకు ఉన్న భేదం ఏమిటి అంటే.
సంప్రదాయం అంటే గుడ్డిగా చెప్పిన విషయాన్ని పాటించడం, శాస్త్రీయత అనేది సరైన కారణాలతో విషయాన్ని బహిర్గతం చేయడం. ఈ విషయం గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా?
మనం ఎలా పెరిగామో అలా మన పిల్లలైతే ఇప్పుడు పెరిగే అవకాశం లేదు ఎందుకంటే
నవ నాగరికత పురుడు పోసుకున్న వేళ పాత చింతకాయ కథలు పనికిరావు. ఇది మన సంప్రదాయం కనుక ఇలానే చేయాలి, అలానే చేయాలి అంటూ ఆంక్షలు విధించే పద్ధతిని మార్చుకొని మనం కూడా పిల్లలకు శాస్త్రీయ పరమైన రుజువులను వారికి
వివరించే ప్రయత్నం చేస్తే, వారిని మంచి బాటలో నడిపించినవారం అవుతాం అనేది నా నమ్మకం.
ఉదాహరణకి మీ పిల్లలకు మీరు బయట నుంచి రాగానే కాళ్లు కడుక్కొని ఇంట్లోకి రమ్మని చెప్పారనుకోండి, 
వాళ్లు దాన్ని తప్పక ఎదురు ప్రశ్నిస్తారు. ఎందుకమ్మా అలా చేయమంటున్నావ్ ఎలాగో స్నానం చేస్తానుగా అంటూ వాదనకు దిగుతారు అలా కాకుండా బయట అంతా తిరిగి రావడం వల్ల స్ట్రెస్ అనేది పెరుగుతుందని చల్లని నీళ్లు పాదాలపై పడగానే
శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి నరాలలోని రక్త సరఫరాకు కాస్తంత ఉపశమనం లభిస్తుందని వారికి అర్థమయ్యేలా చెప్పినట్లయితే వారు అమ్మ చెప్పిన అలవాటును తప్పక పాటిస్తారు. నిజానికి నేటి తరం పిల్లలకు తెలివితేటలు బాగా పెరిగిపోయాయి. కనుక వారి తెలివితేటలకు తగ్గట్టుగానే మనం ప్రవర్తించినట్లయితే వారు మన మాట తప్పక వింటారు లేదా అంతే సంగతులు మరి....
 

కామెంట్‌లు