మసిపాతలో మాణిక్యం;- సత్యవాణి కుంటముక్కుల; సెల్ ; 639660566
  కామేశ్వరమ్మ వంటగదిలో తనలోతనే స్తోత్రాలూ ,మంత్రాలూ చదువుకొంటూనే,కొడుకూ,కోడలూ మనవరాలాకి క్యారేజీ కట్టడం కోసం హడావిడితో సతమతమైపోతోంది.
         ప్రతీరోజూ ఐదుగంటలకల్లాలేచి, వంటింటిబయట పనులన్నీముగించుకొని,ఆరుగంటకు, వంటఇంట్లో ప్రవేశిసించి,మనవరాలికి ఇష్టమైన వేపుడుకూరతోపాటు, ఇంట్లోఅందరికీ పప్పూకూర,పచ్చడీ పులుసులతో వంటపూర్తిచేస్తుంది.తల్లి రాకముందు భార్యవంటతో రుచులు మరచిపోయిన కొడుకు రామం, తల్లివచ్చేకా ఆమెచేసే వంటరుచిబాగామరిగి
ఐదారు కేజీలు బరువుపెరిగినా
పట్టించుకోవటంలేదు.గరికిపాటివారు చెప్పినట్లు,గడ్డిలాంటి వంటలుతింటూ,బక్కచిక్కి పదికాలాలు బ్రతికుండి ప్రయోజనఏమిటి?హాయిగా తల్లిచేసిపెట్టే అద్భుత శాకపాకాలు ఆరగించెయ్యడమే మంచిదని నిశ్చయించుకొన్నాడతడు.అంతగా అయితే ,జిమ్ కెళితే సరి చచ్చినట్టు బరువుతగ్గుతాను అనుకొంటాడుకానీ,ఆపనిమాత్రంచేయడు.మీ అమ్మగారొచ్చేకా మీరు బాగా బలిశారు అంటుంది మోటగా శ్యామల.నువ్వుకూడా అంటాడు భార్యని రామం.
                ఇంతకీ ఈరోజు కామేశ్వరమ్మ లేవడం ఓగంట ఆలస్యమైయ్యింది.రాత్రి మనవరాలు వసుథకీ,కోడలుకీమద్యజరిగినసంభాషణ కామేశ్వరమ్మమనసును గాయపరచింది.కోడలి మనసులో తనకి గడ్డిపరకకున్నవిలువలేదనితెలుసు.కానీ నిండా పదేళ్ళు కూడాలేని మనవరాలి మనసుని విరిచేస్తోందని తెలిసి
ప్రాణం చివుక్కుమంది.అసలు
తనకి కోడలింట్లోవుండడం ఇష్టంలేదు.తనతల్లిలా చదువుకొని,వేలు సంపాదించటంరాదని కోడలిమనసులో తనపట్లవున్న చులకనభావం గురించి తనకు తెలుసు.అందుకే భర్తున్నప్పుడు 
ఏదో సంర్భంగా ఇద్దరూ కలసి రావడంజరిగేది.ఆకార్యక్రమం ముగిసినవెంటనే తమపల్లెకు చేరుకొనేవారు.హఠాత్తుగాభర్తచనిపోవడంతో,పల్లెలోవున్నఇల్లు,వున్నకాస్తపొలం అమ్మేసి, తల్లిని తనతో తెచ్చుకొన్నాడురామం. కామేశ్వరమ్మ భర్త ఉద్యోగస్తుడు కాకపోవడంవలన, ఆమెకి ఫించన్లూ వగైరాలేమీ లేకపోవడం వలనా, కామేశ్వరమ్మంటే మరింతచులకన భావం ఏర్పడింది కోడలికి.ఇల్లు,పొలంఅమ్మినసొమ్మును తనకూతురు పేర బ్యాంకులో డిపోజిట్ చేయించింది కోడలు.పోన్లే,తనమనవరాలిపేరుమీదేకదా వేశారు అనుకొని మనసుని నిమ్మళించుకొంది.
                  నిన్నరాత్రి వసుథ హోమ్ వర్కు చేసుకొంటూ,"అమ్మా మరేమో వెన్స్ డే మా స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే చేస్తున్నారు.అందరూ వాళ్ళనానమ్మలనీ,అమ్మమ్మలనీ తాతయ్యలనీ తీసుకొని రమ్మని చెప్పేరు.మన నానమ్మ ఎలాగూ ఇక్కడేవుంది,అమ్మమ్మనీ తాతగార్నీ రమ్మని ఫోన్ చెయ్యి"అంది.
                " ఏమిటీ మీ నానమ్మని తీసికెళదామనే స్కూలుకి?అలాంటి కార్పోరేటు స్కూలికి ఆవిడను తీసికెళితే మనపరువేమన్నావుంటుందా?
నీ స్నేహితులంతా వెక్కిరిస్తారునిన్ను.అమ్మమ్మనీ, తాతనీ రమ్మందాములే !"అంది కోడలు.అక్కడే వుండి రేపటికూరకు చిక్కుడు కాయలు బాగుచేసుకొంటున్న కామేశ్వరమ్మ మనసు చివుక్కుమంది.కూరముక్కలు వంటింట్లో పెట్టి, తనగది అనుకొంటున్న స్టోర్ రూమ్ లో మంచంమీదచేరింది గుడ్లనీళ్ళు తుడుచుకొంటూ.
                    తన తల్లిలా ఈద్యోగంచేసి డబ్బుసంపాదించక పోవచ్చు,డబ్బులేకపోవచ్చు కానీ అత్తగారికీ మనసనేది వుంటుంది,అది తనుసరిగ్గామాట్లాడకపోతే గాయపడుతుందని , చదువుకొని ఉద్యోగంచేస్తున్న కోడలికి ఎందుకుతట్టదో అని అనుకొందామె.
                   ముందునుంచీ కోడలిమనస్థత్వముతెలిసినా,
కొడుకుమీద మమకారంకొంతా,
మాటలో మాటై,మనసులో మనసైన భర్త లేడన్న చింతకొంతా,ఆసరా లేకుండాజీవించలేనేమోనన్న భయం కొంతా కొడుకు ఇల్లూ,పొలం అమ్మికూడా రమ్మంటే మారుమాటలేకుండా కొడుకు వెంట పట్నం వచ్చేలా చేసింది,కానీ కోడలి ప్రవర్తనతో తప్పుచేశాను ఇక్కడకు వచ్చి,
"భర్తరాజ్యం తనరాజ్యం,కొడుకు రాజ్యం పరరాజ్యం"అన్న సామెత ప్రతిరోజూ గుర్తుచేసుకొంటుందామె.తనలాంటి పరిస్థితి మరే స్త్రీ కోరితెచ్చుకోవద్దని అరచి అందరికీ చెప్పాలనిపిస్తుంది,కానీ గొంతెత్తి దేవుని నామాలుకూడా చదువుకోలేని పరిస్థితిలో తనమసులో మాట ఎవరికి చెప్పగలదు?
                          పల్లెలో తన ఇంట్లో చదువుకొన్నట్లు విష్ణు సహస్త్రనామాలు చదువుకొంటుా వంటిట్లో పనిచేసుకొంటుంటే"భక్తి మనసులో వుంటేచాలు,ప్రదర్శించక్కరలేదు "అని మొదటిరోజే హెచ్చరించింది కోడలు.అందుకే
మనసులోనే చదువుకొంటూ పనులు చేసుకొంటుందామె.
ఆమె జరిగినవీ,జరుగుతున్నవీ
నెమరేసుకొంటుంటే ,ఆమెకు తెలియకుండానే కళ్ళనీళ్ళు జారిపోతున్నాయి.
                       ఇంతలో ఆఫీస్ నుంచివచ్చిన రామం "అమ్మేదీ?"
అనిఅడగడం,"పక్కఎక్కేశారని "కోడలు వ్యంగంగా చెప్పడం
వినిపిస్తూనేవుంది."ఏమిటి ,వంట్లో బాగాలేదా?నాకన్నంపెట్టకుండాపడుకోదే!"అంటూ కొడుకు గదిలోకి రావడం,గదిలో లైటువేసి,నుదుటిపైన చెయ్యివేసి చూడడం అంతా గమనించినా నిద్రపోతున్నట్లు కదలకుండా వుండిపోయింది కామేశ్వరమ్మ.రామం తల్లికి జుట్టు సవరించి, దుప్పటి కప్పి,లైటార్పి గదితలుపులు దగ్గరకు వేసి వస్తుంటే,తల్లిపై ఆమాత్రం మమకారం చూపడం సహించలేని రామం భార్య మూతి తిప్పుకొంది .
తల్లికి తండ్రి గుర్తుకొచ్చి బెంగపడివుంటుందనుకొన్నాడు రామం.
              వసుథ స్కూల్లో గ్రాండ్ మదర్స్ డే కోసం ఆమె అమ్మమ్మ తాతయ్యలు వచ్చేరు బుధవారం ఉదయం.రామం అత్తగారు కామేశ్వరిని ఏదో పలకరించాలికదా అన్నట్లు అల్లుడికోసం పలకరించిందికానీ ,మావగారు మాత్రం మనస్పూర్తిగానే "అక్కయ్యగారూ బాగున్నారా!" అంటూ ఆప్యాయంగా పలుకరించే సరికి ,కామేశ్వరికి కళ్ళలో నీళ్ళుఉబికాయి.రామం నాన్న ఆమెను "నెత్తిమీద నీళ్ళకుండతో పుట్టేవు"అంటూ
ఆటపట్టిస్తూవుండేవాడు.అదేమిటో ఆమెకు సంతోషానికీ, విషాదానికీ కళ్ళనీళ్ళువస్తూ వుంటాయి.అందుకే ఆయన "ఇలాగైతే  ఈ కాలంలో నువ్వు బ్రతకలేవు,కొంచమైనా మనసు గట్టిచేసుకో" అంటూ ఆమె సున్నితమైన మనసును గ్రహించి అంటూండేవాడు .
            బుధవారం మద్యాహ్నంనుంచే రామం ఇంట్లో హడావిడి మొదలైయ్యింది.వసుథ అమ్మమ్మ ,తాతయ్యలు, రామం భార్యా, వసుధతోపాటుగా కార్లో బయలుదేరి  స్కూలు పోగ్రాముకి వెళ్ళేటప్పుడు రామం మావగారు, కామేశ్వరితో "అక్కగారూ! మీరూ రాకపోయారా?గ్రాండ్ పేరెంట్స్ అంటే మీరుకూడాకదా!" అంటుంటే,వసుధ అమ్మమ్మ గుడ్లురిమింది.ఆయన మరిమాట్లాడలేదు. "మేమొచ్చేసరికి ఆలస్యమౌతుంది అత్తయ్యా!వంటచేసెయ్యండిఅంటూ ,ఏమేమి చెయ్యాలో పురమాయించింది కోడలు.
కారు వెళ్ళిపోయింది .కామేశ్వరమ్మ
కళ్ళువత్తుకొంటూ వంటింటికేసి నడచింది. మనసు కూడదీసుకొని పనిలోపడిందిఆమె.
                        రామం ఆఫీసునుంచి నేరుగా వసుధస్కూలుకి చేరాడు.పంక్షన్ కి చాలా అట్టహాసంగా ఏర్పాటుచేశారు యాజమాన్యం.మూడేళ్ళపిల్లలదగ్గరనుంచి,మూడుకాళ్ళముసలివారుదాకా అన్నివయసులవారితో కలకలలాడిపోతోంది ఆ ప్రదేశమంతా.భార్యా అత్తమామలు వున్న ప్రదేశం వెతుక్కొంటూ వెళ్ళాడు రామం. తల్లివారితో లేకపోవడం గమనించేడు."అదేంటీ ?అమ్మరాలేదేం?"ప్రశ్నించాడు భార్యను రామం.
"రమ్మన్నాను, అందరంవెళితే వంటమాట ఏమిటి?మీరొచ్చేసరికి వంటచేసుంచుతాను ,మీరువెళ్ళండి అన్నారు అత్తయ్య,పల్లెటూరామెకదా! ఇలాంటి పోగ్రామ్స్ అంటే భయపడి వుంటారు"భార్యమాటపూర్తవ్వకుండానే తల్లిని తీసుకురావడానికి ఇంటికి బయలుదేరాడు రామం. రోజూ బయటికి తీసికెళ్ళి తిప్పక్కర్లేదుకానీ, ఇలాంటప్పుడుకూడా తల్లిబందీలా ఇంట్లోవుండిపోవడం అన్యాయం అనిపించిది రామానికి.భార్య తనతల్లిపట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం, పెడసరం గమనిస్తూనే వున్నాడు రామం.
అయితే పల్లెటూరునుంచి కొడుకింటికి వచ్చేముందే కొడుకుదగ్గరమాటతీసుకొంది కామేశ్వరమ్మ. "మా అత్తా కోడళ్ళమాటలలో ఏది ఎలావున్నా ,ఏమిజరిగినా నువ్వు కలగజేసుకోనంటేనే నేను నీతో వస్తాను,లేదంటే నేను మావయ్యదగ్గరకి వెళ్ళిపోయుంటాను.కొడుకుండికూడా అన్నపంచను చేరేనంటే నీకే అవమానం"అంటూ ఆరోజే నానోరు కట్టేసింది అమ్మ అనుకొన్నాడురామం.
             ఇంటిగేటు తీసుకొని  పోర్టికోలోఅడుగు పెట్టినరామానికి తల్లి ఆలపిస్తున్న "జగదానందకారకా"అంటూ మధురగానాలాపన వింటూ తన్మయత్వంలో తలుపుతట్టడంకూడా మరచి పోయాడురామం.ఎప్పుడో చిన్నప్పుడుతప్ప ఈమద్యకాలంలో తల్లినోట పాటవిననేలేదు.పాటపూర్తయ్యాకా తలుపుకొట్టిన కొడుకుకు తలుపుతీసిన ఆమె ఆదుర్దాగా"అదేంనాన్నా! వసుధస్కూలుదగ్గరకి వెళ్ళలేదా?వంట్లోకానీ బాగోలేదాఏం "అంటూ నుదురుమీద చెయ్యేసిచూసింది.తల్లి చెయ్యి పట్టుకొని "అమ్మా!తొందరగా బయలుదేరు,స్కూలువాళ్ళు నిన్ను తీసుకొని రమ్మన్నారు"అంటూ హడావిడి పెడుతున్న కొడుకుకేసి అయోమయంగా చూసింది కామేశ్వరమ్మ.తల్లికళ్ళలో కనిపిస్తున్న భావాలని కనిపెట్టినరామం,తల్లిపెట్టిలోంచి ఒకమంచి చీర ఏరితీసి తల్లిచేతిలోపెట్టి ,"నేను బయట వుంటాను ,నువ్వు తొందరగా చీరకట్టుకొనిరా!"అంటూ మరోమాటకవకాశం యివ్వకుండా బయటకెళ్ళినుంచున్నాడు . రెండునిమిషాల్లో చీరకట్టుకొని వచ్చి,కొడుకు డోర్ తీసి పట్టుకొనినిల్చుంటే కొడుకు
ప్రక్కన ముందుసీట్లో కూర్చొంది ఆమె.
         స్కూలు ఆవరణలో కారుదిగిన ఆమెకు ఆకాశాన్నంటే ఆబిల్డింగులూ, ఆపూలతోటలూ,చల్లని నీడనిచ్చే పెద్దపెద్ద చెట్లూ అన్నీ చూసిన ఆమెకు మతిపోయినట్లనిపించింది.తనమనవారాలు వసుధ పెద్ద ఖరీదైన స్కూల్లో చదువుతోందని తెలుసుకానీ,మరీ ఇంతఖరీదైన స్కూల్లో అని ఆమె అనుకోలేదు.తమపల్లెలో బడికి కాంపౌడువాలుకూడా లేకుండా,తరగతిగదులకు తలుపులుకూడా వుండవని వింనేదామె.అందుకనే పల్లెబడులను వదిలిపెట్టి, బస్సులెక్కి పాలుతాగేపిల్లలుకూడా, పట్నంస్కూళ్ళకి పోవడం జరుగుతోందని తెలుసామెకి.
"అవునుమరి ఇలాంటి బడులలోపిల్లలను చదివించడంకోసమే ఆస్తులు అమ్ముకొని ,పుస్తీ పూసా తాకట్టుపెట్టుకొంటున్నారు పల్లెల్లోవాళ్ళు" అనిఅనుకొంది ఆమె.ఇంతపెద్దస్కూలుకనుకనే
కోడలుతనగురించి అలాఅంది.ఆమె అన్నదాంట్లో తప్పేమీలేదు అనికూడా అనుకొందామె.
       ఆలోచనలోమునిగిపోయిన తల్లిని తట్టి, "అమ్మా !రా "అంటూ చెయ్యిపట్టుకొని లోపలకు తీసికెళుతుంటే,
రిసెక్ష్పన్ లో వున్న అందమైన అమ్మాయి ఆమెకు ఒక అందమైన గులాబీ చేతిలోపెట్టి," వెల్ కమ్ గ్రాండ్ మా" అంటూ ఒకహగ్ ఇస్తే, కామేశ్వరమ్మకు చాలా మొహమాటపడింది.తల్లి తరఫున తనే ఆమెకు థాంక్స్ చెప్పి , భార్యకూర్చున్న వరుసలో కుర్చీలు ఖాళీలు లేకపోవడం గమనించి, చివరివరుసలో ఎవరినో రిక్వెష్ట్ చేసికుర్చీఖాళీ చేయించి తల్లిని కూర్చోపెట్టి వెనకనే నించున్నాడు రామం.
                             స్టేజిపైన ముఖ్యఅతిథి ప్రసంగం సాగుతోంది." ఈనాడు  సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి.కుటుంబంలో  ఎప్పడైతే అనుబంధాలు అడుగంటి పోయాయో, అప్పుడే  మానవవిలువలు అడుగంటిపోయాయి.ఈనాడు జరుగుతున్న నేరాలూ- ఘోరాలూ అన్నింటికీ కుటుంబవిలువలు అడుగంటిపోవడమే కారణం.సమాజ విలువలు పునరుధ్ధరింపబడాలని అనేకమంది సంస్కర్తలు అనేకరకాలుగా ప్రయత్నిస్తున్నారు.అయితేఏ సంస్కరణ అయినా గృహంలోనే మొదలుకావాలి.అందుకనే ఈ స్కూలు యాజమాన్యంవారు ,గృహాలకు మూలవిరాఠ్ స్వరూపాలైన తాతలు ,నానమ్మలు ,అమ్మమ్మల విలువలను తెలియజేయాలనే భావంతో ,ఇంత పెద్దఎత్తున ఈనాడు
ఈ కార్యక్రమము మొదలు పెట్టేరు.ఇప్పటికే మనరాష్ట్రంతోపాటుగా అనేక రాష్ట్రాలలోని పాఠశాలలవారు తల్లితండ్రుల విలువలను తెలియజెప్పడానికి తల్లితండ్రులకు పాదపూజ మొదలైన అనేక కారర్యక్రమాలు నిర్వహిస్తూవున్నారు.ఈ పాఠశాల యాజమాన్యం వారు మరో అడుగు ముందుకేసి ఈనాడు ఈ గ్రాండ్ పేరెంట్స్ డేని నిర్వహిచడం సమాజంపట్ల స్కూల్ యాజమాన్యంయొక్క బాధ్యతను తెలియజేస్తోంది.ఇటువంటి మంచికార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా ఆనందంగావుంది. నమస్కారం!" అంటూ ఆయన వేదిక దిగి వెళ్ళేకా, ఇద్దరుముగ్గురు కొంచం అటూఇటుగా, సమాజంలో క్షీణిస్తున్నవిలువలగురించీ,దానికిమూలం ఉమ్మడికుటుంబాల విచ్చిన్నతగురించీ మాట్లాడేరు.
                 ఉపన్యాసకార్యక్రమాలతరువాత గ్రాండ్ పేరెంట్స్ ను స్టేజిమీదకు ఆహ్వానించి ,వారి కొడుకులూ కోడళ్ళూ,కూతుర్లుా అల్లుళ్ళూ నీరుపోస్తుండగా మనవలచేత కాళ్ళుకడిగించి పాదపూజ జరిపించారు.రామం ఎంతబ్రతిమాలినా కామేశ్వరమ్మగారుమటుకు స్టేజిమీదకువెళ్ళడానికి ఒప్పుకోలేదు.తల్లిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేని రామం వూరుకొన్నాడు.
                     తరువాయిభాగంగా గ్రాండ్ పేరెంట్స్ వారికి వచ్చిన కళలను ప్రదర్శించవచ్చు,లేదాపరిచయం చేయవచ్చుఅనిచెప్పినప్పుడు చాలామంది పాటలుపాడేరు.కొంతమంది మగవారు పద్యాలుచెప్పేరు.మరికొంతమంది సినీమాడైలాగ్స్ చెప్పేరు.ఏకపాత్రాభినయాలుచేశారు మరికొందరు.అలా పెద్దవారంతా వారివారి కళలను 
ప్రదర్శిస్తూ మళ్ళీ ఉత్సాహంతో యువతీ యువకులుగామారిపోయారు.
 ఇన్నాళ్ళకు ఈ స్కూలుయాజమాన్యంపుణ్యమాఅని తమతమ అభిరుచులను పదిమందితో పంచుకొనే అవకాశం కలిగినందుకు వారిలో ఉత్సాహం వెల్లివిరిస్తోంది.ఇదంతా ఆనందంగా తిలకిస్తున్న రామం తల్లితో," అమ్మా! నేనొక కోరిక కోరతాను ,కాదంటే నాపైవట్టే అని,తల్లిని  భుజంచుట్టూ చెయ్యవేసి 
గబగబా నడిపించుకొంటూ స్టేజ్ దగ్గరకు తీసుకొచ్చి, అక్కడవారితో ఏదోమాట్లాడుతున్న రామంభార్యకు మతిపోయింది.
తల్లిరాలేదని తెలియగానే,తల్లికోసం ఇంటికెళ్ళిపోయేడీ మానవుడు తల్లీ కూతురూఒకరిమొఖంలోకి ఒకరు చూసుకొని నవ్వుకున్నారు.
కానీ యిలా ఈ పల్లెటూరి గబ్బిలాయి తల్లిని స్టేజిమీదకు తీసుకొనిరావడం ఏమిటో అంతుచిక్కడంలేదు.  ఆమె తండ్రి ఏమిజరుగుతుందా అని ఆతృతగా,ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
             రామం తల్లిచేతికి మైక్  యిచ్చి,భయంభయంగాచూస్తున్నతల్లి వెన్నుతట్టి, తనతలపైచేయిపెట్టుకొని' ఒట్టు'  అన్నట్టు సైగచేయగానే కళ్ళనీళ్ళుకళ్ళలోనే కుక్కుకొంటూ,కళ్ళుమూసుకొని, అన్నమయ్య సంకీర్తన 'అంతటనీవేను హరిపుండరీకాక్ష' అంటూ మొదట భయంభయంగా ,వణుకుతూ మొదలు పెట్టిన కామేశ్వరమ్మగారి స్వరం నిమ్మదిగా నిలతొక్కుకొని మధురంగా ,ఆర్తిగా ఆలపిస్తుంటే అమృతం ధారలుగా కురుస్తున్నట్లు తామంతా ఆ అమృతాన్ని సేవిస్తున్నట్లూ, తమను తాముమరచిపోయుండిపోయారు సభలోనివారంతా!
మరొక్కటి, మరొక్కటి ఇంకొక్కటి అంటూ
అందరికోరికపై మరో పది కీర్తనలువరకూ పాడించుకొన్నారు.కామేశ్వరమ్మకే తెలియలేదు తనలో ఎప్పుడూ వుండే సిగ్గూ,బెరుకూ
ఎప్పుడుపోయిందో! తనకొడుకు "నువ్వు ఇప్పుడు స్టేజ్ పైన ఒక పాట పాడాలి, పాడకపోతే నామీద ఒట్టే !"అన్నప్పుడు మొదటభయపడింది,ఇదేమిటి వీడిలాంటి పనిచేశాడు.చిన్నప్పుడెప్పుడో పెళ్ళిసంగీతం అనినేర్చుకొన్నసంగీతం తనది.ఆతరువాత పెళ్ళీ,పిల్లలూ ఈ రంధిలోపడి సంగీతంప్రసక్తే వదిలిపెట్టింది.
ఆమధ్య ఎప్పుడో పుస్తకాలపెట్టి సర్ధుతుంటే కనపడ్డ సంగీతం బౌండ్ పుస్తకం కనబడితే,తీసి సరదాగా పాడుకొంటుంటే భర్తవిని,"అబ్బో !కావుడూ! చాలా బాగాపాడుతున్నావోయ్  !రోజూ పాడుకొంటూవుండు,నేను వింటూవుంటాను." అని ఎంతగానో ప్రోత్సహించాడు.అన్నమయ్య సీడీ లుతెచ్చి ప్లేయర్ లోవినిపించి నేర్చుకొమ్మనేవాడు .అలా ఆనాడు భర్తప్రోహంతో నేర్చుకొన్న కీర్తనలను ఆయనకోసంపాడుతున్నాననుకొని,అతడు ఇక్కడెక్కడోవుండి వింటూ ,'బాగా పాడేవు కావుడూ!' అంటున్నట్లనిపించి,ఒకదానివెనకాలమరోటి పాడేసింది.ఇలా ఆలోచిస్తుా తనను తను మరచిపోయిన కామేశ్వరమ్మకు సభికులు కొడుతున్న తప్పట్లువినపడలేదు.చల్లని నీళ్ళు పాదాలపైపడగానే ఆలోచనలు చెదిరి ఈలోకంలోకి వచ్చిందామె. రామం ,అతనిభార్యా కాళ్ళపై నీళ్ళు పోస్తుంటే ,తనమనవరాలు వసుధ తన చిట్టిచేతులతో తనపాదాలు కడిగి పాదాలపై
పూలను వుంచి, తలఆన్చి నమస్కరిస్తోంది.సంతోషమో మరదేమి భావమో తెలియదుకానీ,ఆమెకళ్ళు ధారాపాతంగా వర్షిస్తూవున్నాయి.
      రెండురోజులతరువాత  వీధిగేటుకి 'కామేశ్వరీ ఉచిత సంగీత శిక్షణాలయం'అన్న బోర్డును కన్నీటితో మసకలు కమ్మిన కళ్ళతో,ఆబోర్డును ఆప్యాయంగా తన పమిటి చెంగుతో తుడుస్తుంటే,"జీవితంలో గెలిచేవోయ్ కాముడూ!"అంటూ భర్త ఆప్యాయంగా వెన్నుతట్టినట్లు అనిపించింది కామేశ్వరమ్మగారికి. 

కామెంట్‌లు