శిష్యోత్తముడు!;-డా. పి.వి.ఎల్. సుబ్బారావు, 9441058797.
బాల పంచపది
===========
1. ఆరంభించిన వశిష్ఠుడు! కొనసాగించిన విశ్వామిత్రుడు!
  ఆదర్శ శిష్యుడు రాముడు!   
   జగాన  పురుషోత్తముడు!
 విద్యార్థీ,
  జ్ఞానజలధివి,కావాలి,రామా!

2. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు!
   సాందీపుని ప్రియ శిష్యుడు !
   సరి గురుదక్షిణ చెల్లించాడు   
   జగద్గురువై భాసించాడు!
   విద్యార్థీ,
   జ్ఞానజలధివి ,కావాలి,రామా! 

3. భారతం నాటి అర్జునుడు!
   ద్రోణాచార్య ప్రియశిష్యుడు!
   మేటి విలుకాడై నిలిచాడు!
కురుక్షేత్రాన అతడే విజయుడు!
  విద్యార్థీ,
 జ్ఞానజలధివి ,కావాలి ,రామా!

4. నేటి భారతాన,
                    వివేకానందుడు!
   పరమహంస ,
                   ప్రధాన శిష్యుడు!
    జ్ఞానం విశ్వాన ,
                 చాటిన ఘనుడు!
    మేటి గురువు,
             అందించిన శిష్యుడు!
   విద్యార్థీ,
   జ్ఞానజలధివి ,కావాలి,రామా!

5. అమ్మానాన్న ఇచ్చేది జన్మ!
 గురు బ్రహ్మ మనకి జ్ఞాన జన్మ!
  తరించే మార్గం అదేనమ్మ!
  సార్థకం ఈ మానవ జన్మ!
విద్యార్థీ ,
జ్ఞానజలధివి, కావాలి, రామా!

6. జిజ్ఞాస గల శిష్యుడు!
    వాత్సల్య పూర్ణ గురుడు!
   వారిబంధాన ఉదయిస్తాడు
   అనంత జ్ఞాన భాస్కరుడు!
   విద్యార్థీ ,
    జ్జానజలధివి,కావాలి,రామా!

7. నేర్వవలసినది అనంతము!
  ఉన్న జీవితము పరిమితము!
   విద్యా ధనము దుర్లభము!
సాధన చేయాలి నిరంతరము!
  విద్యార్థి ,
   జ్ఞానజలధివి,కావాలి, రామా!

8. యుగమేదైనా,
             రవి ఉదయిస్తాడు !
    శిష్యుడు గురువుని,
                   ఆశ్రయిస్తాడు!
   గురువు ప్రేమతో,
                తీర్చిదిద్దుతాడు !
  శిష్యుడు ప్రతిభతో,
                      భాసిస్తాడు!
  విద్యార్థీ,
  జ్ఞానజలధివి, కావాలి, రామా!

9. కళ, శాస్త్రం ఏదైనా కానీ!
విద్యానావకు గురువే చుక్కాని!
  బతుకు అతనితో సాగనీ !
  సరి జ్ఞానతీరం చేరనీ!
 విద్యార్థీ ,
జ్ఞానజలధివి ,కావాలి ,రామా!

10. దేముడు ఆగ్రహించాడు!
      గురువు ఆదుకుంటాడు!
      గురువే ఆగ్రహించాడు!
     ఏ దేవుడూ ఆదుకోలేడు !
     విద్యార్థీ ,
   జ్ఞానజలధివి ,కావాలి,రామా!
_________


కామెంట్‌లు