యశోధరుడు! అచ్యుతుని రాజ్యశ్రీ

 న్యాయం అన్యాయం మధ్య సన్నని గీత!పూర్వం రాజులు న్యాయాధీశులు దోషి ఎవరైనా కఠినంగా శిక్షించేవారు.విక్రమపురంలో యశోధరుడు వ్యాయం  ధర్మానికి ప్రతీకగా ఉండేవాడు.ఆరోజు ఓపరదేశి అతని ఇంటి తలుపు తట్టి"అయ్యా!బైట జోరుగా వర్షం పడ్తోంది.ఆశ్రయం ఇవ్వండి "అని అభ్యర్ధించాడు.ఆయువకుని సాదరంగా ఆహ్వానించి వేడివేడిగా అన్నంపెట్టాడు."ఇక్కడే పడుకోబాబూ!రేపటి వాతావరణం చూసి వెళ్దువుగానీ"అన్నాడు.ఇద్దరు పిచ్చాపాటీ కబుర్లలో పడ్డారు. "బాబూ! నేడు రాజ్యంలో అవినీతి అన్యాయం అక్రమాలు తాండవిస్తున్నాయి.నారక్తం సలసల మరుగుతోంది"అన్న యశోధరునితో" అయ్యా! తప్పులెన్నటం సులభం! ఎలాతప్పు జరిగిందో విప్పి చెప్పటం కష్టం " అన్నాడు. " ప్రతివాడిలో నీతినిజాయితీ కొరవడింది. సేవాభావం ఉన్న నాలాంటి వాడికి అధికారం ఇస్తే  చక్క దిద్దవచ్చు"."అంటే!మీకు అవకాశం వస్తే ఎంత గొప్ప వాడైనా అవినీతి పరుడ్ని శిక్షిస్తారా?""ఓ! అవసరమైతే  నాపదవికి రాజీనామా చేస్తా!" 
తెల్లారగానే యువకుడు కృతజ్ఞతలు తెల్పి వెళ్లి పోయాడు. కొన్నాళ్ళకి ఓరాజభటుడు యశోధరుని ఇంటికి వచ్చి "రాజు గారు మిమ్మల్ని  నాతో తీసుకుని రమ్మన్నారు " అన్నాడు. మొదట కళవళ పడ్డాడు.కానీ ధైర్యం గా రాజసభలోకి అడుగు పెట్టిన అతను విస్మయం చెందాడు. ఆరాత్రి తన ఇంట బసచేసిన యువకుడు!"నేటి నుంచి మీరే మన రాజ్యపు న్యాయశాఖ మంత్రి!" దిగ్భ్రమతో "చిత్తం ప్రభూ!"అన్నాడు. ఆనాటి నుంచి పీడిత తాడిత ప్రజలువెంటనే యశోధరుని దగ్గరికి పరిగెత్తి న్యాయం పొందేవారు.దోషి ఎంత గొప్పవాడైనా లెక్క చేసేవాడు కాదు.ఆరోజు పహరాదారుని ఎవరో హత్యచేశారు.అంతా గగ్గోలు!మూడురోజులు గడిచినా హంతకుడు దొరక్కపోటంతో రాజు వెటకారంగా "ఇదేనా మీచాతుర్యం?" అని ప్రశ్నించాడు. "ఆరోజే హంతకుడు నాకు చిక్కాడు.నేను గ్రహించి ఊరుకున్నాను.ఎందుకు అంటే ఆహత్యచేసింది మీరే కాబట్టి!""అవును. నావెంట నడు స్తూ నాపై కత్తి విసరడంతో తృటిలో తప్పించుకుని వాడిని చంపాను." "అందుకే మీకు  ఉరిశిక్ష వేస్తున్నాను రాజా!" యశోధరుని ఆజ్ఞతో భటులు రాజు మట్టి విగ్రహాన్ని సభలో పెట్టారు. "మీరు  రాజ్యం కి శిరస్సు! మీలాంటి యువనీతి వంతుడైన రాజు ని చంపితే దేశం అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి ఈబొమ్మకి శిరశ్చేదనంచేస్తున్నా" అంటూ  నిండు సభలో  దాని తలని నరికేశాడు.జయహో యశోధర మంత్రి అని సభంతా హర్షధ్వానాలతో  మారుమ్రోగింది.రాజు మంత్రి ని  కౌగిలించుకుని "మీరు నాతండ్రి లాంటివారు" అని ఆనందభాష్పాలు రాల్చాడు🌷
కామెంట్‌లు