మగాడు;-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి, హైదరాబాద్.
 పుట్టుకతో ఆనందం
సంబరాలు చేసుకుంటారు అందరూ
ఇంతింతై వటుడింతయై పెరిగే కాలాల్లో
అవధులు దాటే ఆనందడోలికల్లో
నిజమైన ఆనందం తానై అవతరిస్తాడు
వివాహబంధంలో ముడిపడే నాటికి
బాధ్యత తానై నడుచుకుంటాడు
భర్తగా బందీయై
కొడుకుగా తేలిపోతాడు
నాన్నగా నమ్మకం పెంచి
అన్నగా అండగా వుంటాడు
అహరహం శ్రమిస్తూ
సుఖాలను తన వారికందిస్తూ
డబ్బు సంపాదించే యంత్రమౌతాడు
కఠినంగా వుంటే కాఠిన్యుడంటారు
ఉదారంగా వుంటే చేతగానివాడంటారు
అందరినీ కలుపుకుపోతే అమాయకుడంటారు
క్రమశిక్షణ కల్గివుంటే నియంతంటారు
తోడు,నీడై కుటుంబం కోసం
ఆరోగ్యం త్యాగం చేస్తాడు
ఎంతో దుఃఖం మది నిండా వున్నా
కంటి నిండా నీళ్ళున్నా
ఏడవలేని నిస్సహాయుడు
గుండెల్లో గోదారి ప్రవహిస్తున్నా
ఉత్తమ నటుడిగా వర్ధిల్లుతాడు
వెనకేసినది వుంటేనే
వెనకుంటారని తెలిసి
తనను తాను అర్పించుకుంటాడు
పొద్దున్నే పాలవాడు
ఆపై సకల పనివాడు
జీతంలేని జీతగాడు
సర్వవేళలా సిద్ధంగా వుండే చోదకుడు
ఇరవైనాలుగుగంటల కాపలావాడు
బౌన్సర్ లకే బౌన్సర్
సిక్సర్ లను ఆపే ఫీల్డర్
క్యాచ్ లను ఒడిసిపట్టే కీపర్
ఎలాంటి బంతులనైనా ఎదుర్కొనే బ్యాట్స్ మెన్
హిట్ వికెట్ కాకుండా చూసుకొనే 
సమయోచిత ఆటగాడు
ప్రేమకు మురిసి
తానెంతో అలసి
కలిసి,జడిసి,నలిగి
కాటికి కాళ్ళు చాపేనాటికి
పూర్ణపురుషుడౌతాడు
మగాడు మట్టిలో కలిసి
గోడకు వేళ్ళాడుతాడు
చెరిగిపోని జ్ఞాపకమౌతాడు
(పురుషదినోత్సవ శుభాకాంక్షలతో)

కామెంట్‌లు