సుప్రభాత కవిత ; -బృంద
ఎద జలధిలో ఎనలేని
తలపుల కెరటాలు....
అంతరంగ మందు 
ఆగిపోని ఊటలు

పొంగుతూ కొన్ని
కుంగిస్తూ కొన్ని
ఆడిస్తూ కొన్ని
మౌనంగా కొన్ని

అన్నిటినీ సాక్షిగా చూస్తూ
చెదరక బెదరక
చివరికి  నీ మనసెరిగి
నిశ్చయించుకో నీ గమ్యం

స్వప్నించే కనులకు
సత్యాలెదురైతే
ఊహల ఉప్పెన
తీరాన్ని దాటితే....

చిగురుటాశలను తుంచివేయక
చివరంటా పెంచుకుంటూ
చిరునవ్వుల సాయంతో
సహనంతో సాధించుకో!

మనసుకు మెదడు తోడు
హృదయానికి బుద్ది తోడు
కలలకు కన్నులు తోడు
గమనానికి పాదాలు తోడు

ఉత్సాహం ఉరికిస్తూ
విసుగును తరిమేస్తూ
క్షణాలు కరిగిస్తూ
చేసే గమనమే జీవితం

రేపు ఎపుడూ నిన్నటికన్నా
మేలైనదే!
సహనంతో అహాన్ని దహిస్తూ
ప్రతిక్షణం  జీవితాన్ని జీవిస్తూ

ఆగమించే ఉదయానికి
అంజలి ఘటిస్తూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు