సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 విహసితము... విహాపితము
******
ఒక్క విహసితము చాలు వందమందిలో మనకంటూ ప్రత్యేకతను చాటుకోవడానికి, ఎంతో మంది స్నేహ హస్తం అందుకోవడానికి...
చీకటి వెలుగుల వలె, కష్టాలు-సుఖాలు, నష్టాలు-సంతోషాలు వస్తూ పోతుంటాయి.అలా లోలోపల ఎన్ని వేదనలు,సంవేదనలు ఉన్నా  పెదవులపై విహసితము చెరగకుండా జీవించడం స్థితప్రజ్ఞత లక్షణం.
అంత ప్రత్యేకత కలిగిన విహసితము అంటే ఏమిటో చూద్దాం...
విహసితము అంటే చిఱునవ్వు,చిర్నవ్వు,అంతస్మితము,ఉత్స్మయము,ఉత్స్మితము,ఎలనవ్వు,కొఱనవ్వు,చిఱుతనగవు,దరహాసము,మందహాసము,స్మితము లాంటి అర్థాలు ఉన్నాయి.
విహసితముతో విహాపితము చేద్దాం. విహాపితముమనస్ఫూర్తిగా చేయాలి.ఆత్మ తృప్తి, ఆనందం కలిగించాలి.తీసుకున్న వారిలో కూడా  సంతృప్తిని కలిగించాలి.
విహాపితమునకు ఉన్న అర్థాలు ఏమిటో చూద్దాం.
విహాపితము అంటే దానము,అంహుతి,వితరణము,ఈవి,దత్తము, విశ్రాణనము,దాయములాంటి అనేక అర్థాలున్నాయి.
విహసిత వదనంతో సదా ఉందాం. విహాపితమును మనస్ఫూర్తిగా చేద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు