*కథ*;- మొదటి భాగం (పద్యాలలో)
========================
ఆ.వె
పూర్వజన్మ కర్మ పుణ్యమైననుగాని
పాపమైనఁ గాని వదలకుండ
వెంబడించునంట వేణునాథున్నైన
దైవ నిర్ణయమని ధరణ లేదు
ఆ.వె
చేయునట్టి పనులు సెలయేరు విధముగా
ఘనులజేయునట్టి కథను వినగ
పూర్వమందునొక్క పురములోబాలుడు
తుంటరి పనులెల్ల వొంటబట్టి
ఆ.వె
పెద్ద చిన్న యనక ప్రేమంటెయెరుగక
కోతి పనులతోడ రీతిదప్పి
దారికడ్డునిలచి వీర ప్రతాపంబు
జూపుచుండె నెపుడు పాపివోలె
తే.గీ
దివ్యమైనట్టి రేఖలు దిశను మార్చ
కరమునందునన్ గలవని నెరుగడితడు
మౌని యొకనాడు బోవగా మార్గమందు
చెంత చేరగా వచ్చెనీ చిలిపి కందు
తే.గీ
దుడుకు తనముతోయున్న యా పడుచువాన్ని
చూసి జాతకంబునుజెప్పె చిత్రముగను
నాగరా మహర్జాతక ననుచు మౌని
మొదలు బెట్టగన్ నిలబడె మొరటు వాడు
తే.గీ
స్వామి యేమంటిరిప్పుడు సత్యమేన
చెప్పు మరియొక్కమారని చేయిజూపె
నిక్కముగ జెప్పుచుంటిని నీదురాత
మంచి యోగంబు యుండెను మరువకనెను
ఉ.
ఎప్పుడు వచ్చునయ్య మరి యిప్పుడె జెప్పిన బాటవీడెదన్
యప్పటి దాకవీడనని యడ్డమునిల్వగ మౌనిబల్కెనే
తప్పక నాచరించినను ధన్యుడవైదువు జూడుమాయనన్
చెప్పుమటంచు చిత్తమని చేతులు గట్టెను మౌనిముందరన్
ఉ.
అక్కడ గుట్టకానుకొని యద్బుతలింగము నుండెజూడుమా
చక్కగ శుద్ధి జేసి శివ సాధనజేయుచు నిత్యమందునన్
మక్కువతోడసేవలొక మాస మొనర్చగ మంగళంబుగన్
దక్కును సత్ఫలంబులగు ద్రవ్యము గాంచగ సంతసింతువే

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి