భూసారాన్ని పెంచుటే మనందరి లక్ష్యమని ప్రకృతి వ్యవసాయ అధ్యయన కర్త, విశ్రాంత వైద్యులు శంబంగి శ్రీనివాస్ అన్నారు. బొబ్బిలి శ్రీశ్రీశ్రీ దాడితల్లి సరేపోలమ్మ తల్లి పండగ సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన అవగాహన శిబిరానికి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం పలు రకాల పంటల్ని పండించేందుకు భూసారాన్ని ఉపయోగించుకుంటున్నాం, కనుక తిరిగి భూమిని సారవంతమైన నేలగా చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. పూర్వకాలంలో ప్రధాన పంటకు ముందుగా కట్టే జనుము, జీలుగ, పిల్లిపెసర వంటి పంటలు విత్తుకొని వాటిని దున్నడం ద్వారా భూమిలోనికి సారవంతమైన పచ్చిరొట్ట ఎరువుగా జొప్పించి అనంతరం ప్రధాన పంటను వేసేవారని ఈ సందర్భంగా శ్రీనివాస్ గుర్తుచేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బలిజిపేట మండల వ్యవసాయాధికారి ఎస్.శివగణేష్ మాట్లాడుతూ మనిషికి పౌష్టికాహారంలో భాగంగా ప్రధాన పోషకాలైన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలతో పాటు విటమిన్లు మినరల్స్ మొదలగు సూక్ష్మ పోషకాలు ఎలా అవసరమో భూమికి కూడా అన్ని పోషకాలు అవసరమని అన్నారు. ఈ క్రమంలో ప్రకృతి సేద్యంలో ప్రీ మాన్సో డ్రై సోయింగ్ పి.ఎం.డి.ఎస్ విధానం ద్వారా ముప్పై రకాల విత్తనాలు తొలుత విత్తి, ఏభై రోజుల అనంతరం పూత దశలో దున్నుకొనుట వలన అన్ని రకాల మైక్రో చిన్న పోషకాలు, మేక్రో పెద్ద పోషకాలు భూమికి అంది, భూమి యొక్క స్వరూపాన్ని అభివృద్ధి పరచునని శివగణేష్ అన్నారు. దేశవాళీ గోసంరక్షకులు మేళాపు చంద్రమౌళి ఈ శిబిరంలో ప్రదర్శించిన పి.ఎం.డి.ఎస్. విత్తనాలు, ఆర్.డి.ఎస్. విత్తనాలు, కషాయం చేసే విధానం, ప్రయోజనాలను శిబిరానికి హాజరైనవారికి వివరించారు. ఈ అవగాహన శిబిరంలో నేరుగా నలభై రకాల గింజ ధాన్యాలు, ఏభై రకాల కషాయాలు సీసాలందు భద్రపరచి చూపి అవగాహనపర్చారు. తయారుచేసే విధానాలనూ అరవై చార్టుల ద్వారా విశదీకరించారు. నిల్వ సామర్థ్యం, తగు మోతాదు వివరాలు అవగాహన కల్గించారు.
విశిష్ట అతిథులు బొబ్బిలి పురపాలక సంఘం కమిషనర్ ఎల్.రామలక్ష్మి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రవికుమార్, ఉప ఖజానాధికారి పి.పద్మనాభం, స్థానిక కళాభారతి అధ్యక్షులు నంబియార్ వేణుగోపాలరావు, గౌరవ అతిథి జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావులు శిబిరాన్ని సందర్శించి నిర్వాహకులను అభినందించారు. సాహితీవేత్తలు చింత రమణ, కిలపర్తి దాలినాయుడు, మీసాల చినగౌరునాయుడు తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలి శాసన సభ్యులు ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు బేబీ నాయన, బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తెంటు లక్ష్మునాయుడుల సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం అధ్యయనకర్త విశ్రాంతవైద్యులు శంబంగి శ్రీనివాస్, వ్యవసాయాధికారి ఎస్.శివగణేష్, దేశవాళి గోసంరక్షకులు మేళాపు చంద్రమౌళి, ఎఫ్.ఎం.టి. చింత లక్ష్మి, ఐ.సి.ఆర్.పి. గుండాపు శ్రీలక్ష్మి, పంటల రాధ, ప్రకృతి సేద్య ఉద్యోగులు ప్రతినిధులు సిగటాపు తిరుపతిరావు, గజపతినగరం ఇమంది కృష్ణ కుమారి, ముగడ గ్రామ రైతు మర్రాపు గౌరి తదితరులు శిక్షణార్ధులుగా తర్ఫీదు పొంది అన్ని అంశాలను సమగ్రంగా వివరించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి