*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 015*
 కందం:
*సదమల మతితో ఁబెద్దల*
*మదికింపుగ మెలగు, నిందమానుము పరులన్*
*మృదుమార్గములను వదలకు*
*విదితంబుగా దానఁగీర్తి వెలయుఁ గుమారా !*
తా:
కుమారా! మంచి బుద్ధి కలిగి పెద్ద వారి మనసు గెలుచుకునేలా ప్రవర్తించు. ఎదుటి వారిని, ఇతరులను నిందించడం మానుకో. చక్కని మంచి దారులను వదలి పెట్టకు. ఇలా కనుక విధి విహితంగా నడుచుకుంటూ అవసరమైన వారికి దానము చేస్తే నీకు ఎంతో మంచి పేరు, కీర్త వస్తుంది....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"చక్కని రాజ మార్గముండగా, సందుల దూర నేల మనసా!" అని త్యాగరాజు గారు తన కీర్తన లో వివరించారు. "చెరపకు రా! చెడేవు" అని కదా, పెద్దల మాట. ఎదుటి వారి పనిని పాడు చేయాలి, చెడగొట్టాలి అనే ఆలోచనలు మనం చేసేటప్పుడు, మన వల్ల అవవలసిన పనిమీద మన ధ్యాస ఉండదు. అందువల్ల, అవతల వారి పని అవుతందో లేదో కానీ, మన పని కచ్చితంగా చెడి పోతుంది. మనం వ్యతిరేక ఆలోచనలను కలిగి ఉంటే, మన మనసు కలుషితం అవుతుంది. అందువల్ల, మనం మంచి వారికి దూరంగా వెళతాము, మనకు తెలియకుండానే. అందుకనే విజ్ఞులు, "అందరూ బావుండాలి. అందులో నేను ఉండాలి" అని కోరుకుంటూ ఉంటారు. మనం కూడా నలుగురి మంచినీ కోరుకుంటూ, ఆనందమైన జీవితం గడిపే సదవకాశాన్ని పరమాత్ముడు మనకు ఇవ్వాలని కోరుకుంటూ............ అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు