*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0210)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దేవతల ప్రార్థన - బ్రాహ్మణ రూపం - హిమవంతుని చూచుట - శివుని నింద - పార్వతితో పాణిగ్రహణము కోరుట*
*నారదా! గిరిరాజు, నటరాజు రూపంలో వచ్చిన రుద్రుడు చూపిన లీలల వల్ల ఆ పరమేశ్వరుని పై కుదిరిన భక్తి భావముతో నిరంతరం శివుని ధ్యనంలో ఉన్నాడు. అటువంటి హిమవంతుని చూచి దేవతలు అందరూ ఎంతో సంతోషించారు. శివాశివుల వివాహము తొందరలోనే జరుగ బోతోంది అనుకున్నారు. వీరందరూ దేవ గురువైన బృహస్పతిని, తన ధ్యానంలో కూర్చున్న సదాశివుని దగ్గరకు పంపారు. బృహస్పతి తో కూడి కైలాసానికి చేరిన దేవతలు అందరూ "మహాదేవా! కరుణాసింధో! పార్వతిని నీ పట్టిగా చేసుకుని లోకాలను కాపాడు తండ్రీ!" అని వేడుకున్నారు. వీరి ప్రార్థన విన్న శంభుడు "అట్లే అగుగాక" అని అభయం ఇచ్చారు.*
*మరల గిరిరాజు వద్దకు ప్రయాణం అయ్యారు, శంభుపతి. అక్కడ తన భార్య మేనక, కుమార్తె కాళి, సకల పరివారం తో కలసి సభలో వున్నాడు హిమవంతుడు. లీలా మానుషుడు, అందరి మంచి కోరేవాడు, అందరూ తానే అయిన వాడు అయిన చోరపతి ఆ సభలోకి ప్రవేశించారు. నుదుట ఊర్ధ్వ పుండ్రము, చెవులకు స్వర్ణ కుంతలాలు, చేతిలో కమండలము, గొడుగు, జపమాల, మెడలో తులసిమాల లతో సర్వాంగ సుందరుడుగా సభలోకి వచ్చిన వారు, తన భర్త శివుడే అని పార్వతి తెలుసుకో గలిగింది. మేనకా హిమవంతులు అందరితో కలసి ఆ సద్బ్రాహ్మణునకు ఉచితాసనం ఇచ్చి సకల మర్యాదలు చేసారు. పార్వతి నతమస్తకురాలు అయ్యింది. "సర్వమంగళా! నీకు సకల శుభములు కలగి, మనో వాంఛ తీరు గాక!" అని పార్వతికి ఆశీర్వాదం ఇచ్చారు బ్రాహ్మణుడు.*
*"మీరెవరు? ఏ పని మీద వచ్చారు? " అని అడిగిన హిమవంతుని తో ఆ సదబ్రాహ్మణుడు " గిరిపతీ! నీవు నీ కూతురి వివాహము శివుని తో చేయలి అనుకున్నావని  తెలిసి వచ్చాను. నీవు తలపెట్టిన కార్యం వల్ల నీ కూతురు ఏమాత్రం సుఖపడదు. నిత్యం శ్మశానం లో తిరుగుతూ, విబూది రాసుకుని వుంటాడు, రుద్రుడు. బట్టలు లేక, నగ్నంగా, అర్ధ నగ్నంగా తిరుగుతూ, పాములు మెడలో వేసుకుని ఉంటాడు. అతని వయసు ఎంతో ఎవరికీ తెలియదు. వంశమేమో, తల్లిదండ్రులు ఎవరో, ఏమీ తెలియదు. మంచివారికీ, చెడువారికీ ఒకే విధంగా అనుగ్రహిస్తాడు. ఎన్నో సార్లు చిక్కులు తెచ్చుకున్నారు. మొండి, భిక్షాటన చేస్తారు. ఇప్పుడు మీరు పార్వతి వివాహ విషయంలో చేస్తున్న ఆలోచన మంచిది కాదు. పార్వతి! ఈ విషయంలో మంచి చెడులను గ్రహించలేదు. మీరే ఏది మంచో ఆమెకు నచ్చ చెప్పాలి." అని చెప్పాడు.*
*"నేను సదాచార బ్రాహ్మణుణ్ణి. వైష్ణవుణ్ణి. అందరి మంచి కోరుతూ, వైదిక వృత్తిని ఆచరిస్తూ, భూమి పైన తిరుగుతూ ఉంటాను. నేను ఎక్కడికైనా వెళ్ళగలను. ఎటువంటి పనిని అయినా చేయగలను. శుద్ధాత్మను, దయాసాగరుడను. అందువల్ల, లక్ష్మీ సమానమైన కళలు వున్న పార్వతిని నాకు ఇచ్చి వివాహము చేయి. నీ కుమార్తె ను ఆశ్రయ రహితుడు, నిస్సంగుడు, కురూపి, గుణహీనుడు అయిన మహాదేవునకు కాక నాకు ఇచ్చి పెండ్లి జరిపించు. పార్వతి సకల భోగాలతో సుఖపడుతుంది" అని చెప్పి వారు చేసిన మర్యాదలు అన్నీ స్వీకరించి తనవగృహానికి వెళ్ళి పోయాడు, బ్రాహ్మణుడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

కామెంట్‌లు