గజల్...20 ;-పి.చైతన్యభారతి
మగువలంత కష్టాలను మరిచిపోతె బాగుండును.
సఖులతోడ ఆటలందు మునిగిపోతె బాగుండును! 

కర్తవ్యపు దీక్షలందు దినమంతా గడిచిపోయె. 
తనకోసం క్షణమైనా మిగిలిపోతె బాగుండును! 

దినకరునితొ పోటిపడుచు క్రమశిక్షణ నేర్చుకొనెను. 
చందమామ ఒడిలనైనా ఒదిగిపోతె బాగుండును! 

దిక్కులార చెప్పగలర వేతనాన్ని లెక్కకట్టి. 
త్యాగానికి వెలలేదని తేలిపోతె బాగుండును! 

సేవలతో ఆనందం  వెదుకుచుండు సహనదేవి. 
అయినవారు నేస్తాలుగ
మారిపోతె బాగుండును!

శోధనయే చేయలేక బ్రహ్మకూడ అలసిపోయె.
చట్టాలే విస్తుపోయి మారిపోతె  బాగుండును! 

చైతన్యం అణువణువున రెక్కతొడిగె ఏనాడో..
కృతజ్ఞతను మనసులోన నాటిపోతె బాగుండును!


కామెంట్‌లు