మాయనై మన్ను వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్ఱుమ్ మణివిళక్కై
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ ద దామోదరనై
తూయోమాయ్ వన్దు నాం తూ మలర్ తూవి త్తొழுదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిన్దిక్క
పోయ పిழைయుమ్ పుగుదరువాన్ నిన్ఱనవుమ్
తీయినిల్ తూశాగుం శెప్పు ఏలో రెంబావాయ్!
ప్రతి పదార్థాలు:
మాయనైమన్ను వడ మధురై మైన్దనై ఆశ్చర్యకరమైన చేష్టలు కలవాడు, ఉత్తర మధురా నగరికి అధిపతివై;
త్తూయ పెరునీర్ పవిత్రమైన నీరు గల గొప్ప నది యగు;
యమునై త్తుఱైవనై యమునా నది యొక్క తీర వనమున ఉన్న;
ఆయర్ కులత్తినిల్ తోన్ఱుమ్ గొల్లకులమున అవతరించి;
మణి విళక్కై అందమైన దీపమైన;
తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద
తల్లి కడుపును పండించిన;
దామోదరనై తూయోమాయ్ వందు నామ్
దామోదరుని మంచి మనసుతో శుద్ధులమై మనము సమీపించి;
తూమలర్ తూవిత్తొழுదు
పవిత్రమైన పుష్పములతో పూజించి;
వాయినాల్ పాడి నోరారా కీర్తించి;
మనత్తినాల్ శిన్దిక్క మనసారగా మనమందరమూ ధ్యానించిన;
పోయ ప్పిழைయుమ్ పుగుదరువాన్ నిన్ఱనవుమ్
గడచిన జన్మలోని పాపములను, భవిష్యత్తులో రాబోయే పాపములనూ అన్నీ(ఆగామి, సంచితములు రెండూ)
తీయినిల్ తూశాగుమ్ సంచిత, ఆగామి కర్మలు నిప్పున పడ్డ దూది వలె భస్మీభూతమగును;
శెప్పేలో రెంబావాయ్ అని కీర్తించుదాము.
భావము:
ఆశ్చర్యకర చేష్టలు కలిగి నిత్యమూ భగవత్ సంభంధము కల ఉత్తరదేశ మందలి మధురానగరికి నిర్వాహకుడునూ ~ యమునానదీ తీర విహారి ~ గోప వంశమున ప్రకాశించిన మంగళదీపము ~ తల్లియగు యశోద గర్భమును ప్రకాశింప చేయునటుల ~ తాడుచే కడుపున కట్టబడిన దామోదరుడగు శ్రీకృష్ణ భగవానుని చేరి పరుశుద్దములగు పుష్పములతో పూజించి ~ వాక్కుతో కీర్తించి ~ మనసారా ధ్యానించినచో పూర్వ సంచిత పాపరాశి ~ ఆగామి పాపరాశి ~ అగ్నిలో పడిన దూదివలె నశించును ~ భగవన్నామమును పాడుదాము.
వ్రతమాచరించుటకు మన సంచిత ఆగామి పాపములడ్డురావా? అను శంకకు భగవంతుని నోరారా కీర్తించి మనసారా ధ్యానించినచో అన్నీ నశించునని తెలిపింది గోదమ్మ తల్లి!
భగవానునివలె ఆచార్యుడు కూడా అత్యాశ్చర్యకరములగు చేష్టలు కలవాడే శ్రీకృష్ణభగవానుడు యమునాతీరవిహారి. ఆచార్యుడు విరజానదీ తీర విహారి. అజ్ఙానులగు జీవుల కులమును సదుపదేశముతో ప్రకాశింప చేయువాడు. మంత్ర గర్భమున భక్తితో కట్టుబడి ప్రకాశింప చేయువాడు~ అహింసాది పుష్పములతో అర్చించబడి మన విఘ్నములను నశింపచేయువాడు ఆచార్యుడు!
వ్యాఖ్య:
జనన మరణాలు లేనివాడయ్యు శ్రీమన్నారాయణుడు కర్మానుసారముగా కాక, స్వసంకల్పానుసారంగా ధర్మోద్దరణకు ఉపక్రమిస్తాడు. అతని స్వరూపము ప్రాకృత ధృష్టికి గోచరము కానిది. ఉత్తర దిక్కున మధురానగర వ్రజ దక్షిణ మధుర యందలి జనులకంటె అధృష్టవంతులు.
తూయపెరునీర్ యమునై త్తురైవనై --యమునానది జలాలు పవిత్రమైనాయి; అక్కడ కృష్ణుడు యమునా నదీ జలాలలో స్నానమాడుటయే కాక ఆ నీటిని నోటి పుక్కిట పట్టి ఉమ్ముటవంటి బాలక్రీడలను నెరపినందున తూయ పవిత్రమైన పెరునీర్ గొప్పదైన నది . రాజవంశాన పుట్టినా గొల్లకులమున వెలసినాడు. దుష్టశిక్షణార్థమే కాక
తాయైక్కుడళ్ విళక్కం శెయ్ద ఆ తల్లి (దేవకి) కడుపు వెలుగొంద జేసినాడు.
దామోదరనై యశోదచే తలుగులతో ఉదరమున కట్టించుకున్నాడు. మనమందరమూ నీరాడి శరీరమలినములను, హరినామ కీర్తనాలచేత మనసు మాలిన్యములను, తొలగించుకొని పవిత్రులమై వచ్చి మనము వ్రతాన్ని చేద్దాము. అలా చేస్తే మన కర్మలు, సంచితములు, ఆగాములు, ప్రారబ్ధములను ~ ఇవి జీవుని ముక్తికి ప్రతిబంధకాలు కనుక ~
నిప్పునబడ్డ దూదివలె నిశ్శేషంగా భస్మీభూతమవుతాయి
కనుక ఈ వ్రతఫలాన్ని పొందుదాము!
ఈ పాశురానికి అనువాద సీస పద్యము (రచయిత: కీశే.కుంటిమిద్ది
శేషశర్మగారు:)
మాయల మారియై మధురలో జన్మించె;
గొల్ల కులమ్మున దల్లి కడుపు
విలసిల్ల జేసె, మంగళ దీపమగుచు, కా
ళింది తీరాన కేళీవినోద
ముల సల్పె నట్టి దామోదరు మన మెల్ల
స్నాతలై పూతలై పూతలై నతులొనర్చి
కమ్మని పూవుల గడక పాదారవిం
దమ్ములర్పించి చిత్తమ్మునందు
ధ్యానమొనతించి పాట నోరాడ పాడ
పునరావృత్తి పద గోపురార్గళముల
సంచితాగామి కర్మలు సమసిపోవు
కాలదే నిప్పులోబడ్డ తూలరాశి!
(ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి