మా ఆత్మీయుడు భాస్కర్(8);-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322


 అక్కడ స్వాతంత్ర్య సమరవీరుల  కార్యక్రమాలే కాకుండా  ఇతరులు ఏర్పాటు చేసుకున్న మంచి మంచి కార్యక్రమాలకు కూడా నెలవుగా  ఉంటుంది ఆ భవనం. రకరకాల వ్యక్తులు వచ్చినప్పుడు విశ్రాంతిగా కూర్చోవడానికి  ప్రత్యేకమైన భవంతి ఉంది  దానిలో స్నాన సంధ్యలు చేయడం దగ్గరనుంచి  పగలు రాత్రి కూడా ఉండడానికి ఏర్పాటలన్నీ ఉన్నాయి.ఆ వచ్చిన వారిలో  ఎవరు ఎలాంటి వారు  ఎవరిని ఎలా గౌరవించాలి అన్నది సీతారామయ్యగారికి తెలిసినట్లుగా మరొకటి తెలియదు. వారికి కావలసిన అవసరాలను తీరుస్తూ  చక్కటి కాలక్షేపం చేస్తారు  స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలను పిలిచి  వారి తల్లిదండ్రుల గురించి  స్వాతంత్ర్య సముపార్జన కోసం తమ పెద్దలు చేసిన త్యాగాలను గురించి  ఉపన్యాసాల రూపంలో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు  దానివల్ల యువతలో కూడా దేశభక్తి పెరగడానికి  తమ పెద్దల  నిస్వార్థ  సేవలు తెలియడానికి ఉపయోగపడుతుందని సీతారామయ్యగారి అభిప్రాయం.ఆ విషయంలో ఆయన సఫలం అయ్యారు.

ఒకనాటి సమావేశంలో సీతారామయ్య గారు మధ్యలో నన్ను పిలిచి  మా ఆనంద్ గారు తేలప్రోలు ఆరుమళ్ల సుబ్బారెడ్డి గారి అబ్బాయి వీరి నాన్నగారు స్వాతంత్ర సమరయోధులు  వారి గురించిన విషయాలు చెబుతారు అని ప్రకటించి నన్ను ప్రోత్సహించారు  మా నాన్నగారి గురించి మహాత్మా గాంధీ  పంచములకు  దేవాలయ ప్రవేశం లేని రోజులలో ప్రవేశించడానికి ప్రయత్నం చేసిన  సమయానికి ముందు నుంచి తేలప్రోలు మా గ్రామంలో  మా దేవాలయాల అన్నిట్లోకి కుల మత వర్గాల విచక్షణ లేకుండా అందరికీ హక్కు ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ  దైవ ప్రతిమను చూడడానికి అర్హులే అన్న నినాదంతో ప్రారంభించారు. మా గ్రామాల్లో పెద్ద నూతులలో వారికి  నీరు తోడుకునే అవకాశం లేదు మా ఇంట్లో  వంట పని కూడా చేసేది వారే  మా ఇంటి ముందే ఉన్న పెద్ద బావిలో మొదట మా ఆంటోనీ తోనే నీరు తోడించారు  అలా ప్రజాసేవ చేయడంలో ముందుండి  పోరాడిన వారు  సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్లాలన్న అభిప్రాయంతో  ఎన్నో త్యాగాలను చేశారు. వితంతు వివాహాలను బిడ్డను గన్న వితంతు వివాహాలను  ప్రోత్సహించారు. వామపక్ష పార్టీ నాయకులు కొండపల్లి సీతారామయ్య గారికి  12 సంవత్సరాల వితంతువును  వివాహం చేసింది మా నాన్నగారు  అని చెప్పిన తర్వాత నన్ను ఎంతో  అభినందించారు. రామ శబ్దంలో ఉన్న విశేషం తాను క్షేమంగా ఉండి ఎదుటి వారి క్షేమాన్ని కూడా కాచి రక్షించేవాడు. తాను ఎలాంటి కష్టనష్టాలకు లోను కాకుండా జీవించాలి అనుకుంటాడో ఎదుటివాడు కూడా అలాగే ఉండాలి అని పాటించేవాడు ఆ లక్షణం  సీతారామయ్యగారిలో  పూర్తిగా జీర్ణించి ఉంది. వృత్తి రీత్యా ఆయన ఉపాధ్యాయుడు అధ్యయనం చేసే విద్యార్థులను తన ప్రక్కన తొడ మీద కూర్చోబెట్టుకొని తన సొంత బిడ్డకు ఎలా అక్షరాలు నేర్పుతారో అలా నేర్పగలిగిన చతురత కలిగినవాడు. తాను పనిచేస్తున్న బడిలో విద్యార్థులకే కాక ఆ గ్రామంలో ఉన్న పెద్దలకు కూడా విషయ పరిజ్ఞానం ఉండాలి అని భావించి కొంతమందిని చేర తీసి ప్రభుత్వం వారు వయోజన విద్యను ప్రారంభించడానికి ముందు 25 సంవత్సరాల పూర్వం దానిని ఉద్యమంగా నిర్వహించిన వారు  మొదటినుంచి వార్తా పత్రికలు చదివే అలవాటు వారికి ఉన్నది  తాను చదివిన విషయాలను మిగిలిన వారికి కూడా తెలియజేయడం కోసం  అధ్యాపకునిగా వారు చేసిన గొప్ప విశేషం  ఆ గ్రామం మధ్యలో 4 మార్గముల కూడలిలో ఒక బోర్డు ఏర్పాటు చేసి ఆ రోజు పత్రికలలో వచ్చిన  పతాక శీర్షికలను అన్నిటిని  వారికి అర్థమయ్యే భాషలో రాయడం అలవాటు చేసుకున్నారు. అక్షరం ముక్క తెలియని గ్రామస్తులు కూడా  దేశ విదేశీ రాజకీయాలను మాట్లాడగలిగిన  స్థితికి తీసుకువచ్చిన ప్రముఖులు సీతా రామయ్య గారు.


కామెంట్‌లు