నన్ననుకోవాలనే...;-- యామిజాల జగదీశ్
 ఓరోజు ఆఫీసుకి బయలుదేరుతున్న వేళ...
ఆ బుజ్జిపిల్ల సుమతి ఆన్నం తినడానికి మారాం చేసింది..."అమ్మ కలిపి తినిపిస్తేనే అన్నం తింటానని...."
సరేనని ఆ తల్లి రాధిక త్వరత్వరగా అన్నం తినిపిస్తూ ఆఖరి ముద్దపెట్టినప్పుడు అమ్మాయి అమ్మ వేళ్ళను కొరికింది.
అప్పుడు ఆ బాధ తట్టుకోలేక అమ్మాయి చెంపమీద ఓ దెబ్బ వేసి చేతులు కడుక్కుని ఆఫీసుకి వెళ్ళిపోయింది రాధిక. అమ్మాయి తప్పు చేసినప్పుడల్లా తిట్టడమే తప్ప  అప్పటి దాకా ఎన్నడూ కొట్టింది లేదు.
కానీ ఈరోజు అమ్మాయిని కొట్టడంతో రాధిక మనసు నలిగిపోతోంది.
అమ్మాయిని కొట్టడంతోనేమో కానీ ఆరోజంతా ఆఫీసులో రాధిక ఏ పని చేసినా అమ్మాయిని కొట్టిన క్షణం గుర్తుకొచ్చి ఆమెను ఓ పెద్ద తప్పులా తోచుకోనివ్వడం లేదు.
మనసంతా అమ్మాయిమీదే.
నేను కొట్టినందువల్ల అమ్మాయి నాతో మాట్లాడదేమోనని ఆమెలో ఓ రకమైన భయం.
ఇంటికి వెళ్ళడంతోనే అమ్మాయి నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఉంటుందోనని ఆమె ఆలోచన. 
ఆఫీసు నుంచి ఇంటికి పోతూ పోతూ అమ్మాయికిష్టమైన ఓ బొమ్మ కొనుక్కుపోయింది. ఇంటి వాకిలి తలుపు దగ్గర నిలుచుంది.
అక్కడి నుంచే అమ్మాయిని చూస్తూ "ఏం చేస్తోంది నా బుజ్జితల్లి" అని పలకరించింది. 
కానీ అమ్మాయి జవాబివ్వక నిల్చుంది. 
కొనుక్కొచ్చిన బొమ్మను ఆమె అమ్మాయికిచ్చింది....
కానీ తీసుకోవడానికి అమ్మాయి నిరాకరిం చింది.
ఉదయం చెంపమీద దెబ్బ వేయడం వల్ల అమ్మాయి కోపం ఇంకా తగ్గినట్లు లేదేమోనని ఆమె మనసు నలిగిపోతోంది.
దాంతో ఆమె అమ్మాయి దగ్గరకు వెళ్ళి "నువ్వెందుకు నా చెయ్యి కొరికావు... నువ్వలా కొరకడంతో నాకెంత నొప్పొచ్చిందో తెలుసా. ఆ బాధ తట్టుకోలేక నిన్ను కొట్టాను. కావాలంటే ఈ అమ్మను ఓ రెండు దెబ్బలు కొట్టు. అంతేతప్ప మాట్లాడకుండా ఉండకురా" అని చెప్పడంతోనే అమ్మాయి ...."అమ్మా! నిన్నొకటి అడగాలి" అంది.
"ఏంట్రా అడుగు..." అంది రాధిక.
"అమ్మా...నువ్వు ఆఫీసుకి వెళ్ళిన తర్వాత నన్నొక్కసారైనా అనుకుంటావామ్మా" అని అడిగింది అమ్మాయి.
"లేదురా...ఆఫీసులో పనెక్కువ ఉంటుంది. కనుక ఎవరినీ తలవను. నాకిచ్చిన పనులు ఎలా పూర్తి చేయాలా అనే తలంపొక్కటే ఉంటుందిరా" అని రాధిక చెప్పింది.
అప్పుడు ఆ అమ్మాయి "ఈరోజు నువ్వు నన్నొక్కసారైనా  అనుకున్నావామ్మా..." అని అడిగింది అమ్మాయి.
"ఒక్కసారేంటీ... ఈరోజు...రోజంతా నిన్నే అనుకున్నాను.... నిన్ను కొట్టాననే బాధ నన్ను తోచుకోనివ్వలేదురా...పని చేస్తున్నాననే గానీ మనసంతా నీమీదేసుమీ" అంది రాధిక.
అమ్మ మాటలన్నీ విన్న అమ్మాయి "నువ్వు ఒక్కరోజైనా ఆఫీసులో నా గురించే ఆలోచించాలి అనుకున్నాను. అందుకేం చేయాలాని ఆలోచించి నిన్ను కొరికానమ్మా" అని పెద్దగా నవ్వుతూ తన మాట కొనసాగించింది....
"నేను పుట్టినప్పుడు నావల్ల నువ్వెంత నొప్పి భరించావో...ఆ నొప్పి కంటేనా ఈరోజు నేను నిన్ను కొరికినప్పుడు నొప్పెట్టిందామ్మా" అని అమ్మాయి అనడంతో రాధిక తన కూతుర్ని గట్టిగా వాటేసుకుంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.


కామెంట్‌లు