ఇది రెండో ఆటోగ్రాఫ్....;-- యామిజాల జగదీశ్--

 ఓ వ్యక్తి దస్తూరి లేదా సంతకం. ఈ మాట ప్రాచీన గ్రీకు భాష నుంచి వచ్చింది. ప్రముఖులతో సంతకాలు చేయించుకుని మురిసిపోతుండటం చూస్తేనే ఉంటాం. స్కూల్లో చదువుతున్న రోజుల్లో నేనెప్పుడూ టీచర్ల నుంచి సంతకాలు తీసుకోలేదు కానీ మిత్రులు చిన్నపాటి పుస్తకాలు తీసుకొచ్చి మాష్టార్లతో సంతకం చేయించుకోవడం ఎరుగుదును. అయితే ఇటీవల కొంత కాలంగా ఒకరి ఆటోగ్రాఫ్ కోసం కలలు కంటూ వచ్చాను. తల్లావజ్జల లలితాప్రసాద్, బ్నింలతో మాట్లాడుతూ ఆయన సంతకం సంపాదించిపెట్టమని అడిగాను. అలాగే అన్నారు. ఇంతకూ నేనడిగిన ఆటోగ్రాఫ్ ఎవరిదంటే రచయిత, నటుడు అయిన తనికెళ్ళ భరణిది!
ఇటీవల త్యాగరాయగానసభలో లలితా ప్రసాద్ అన్నయ్య తల్లావజ్జల సుందరం సంస్మరణ సభకు ఆయన వస్తున్నారని తెలిసి ఆటోగ్రాఫ్ తీసుకుందామని వెళ్ళాను. కానీ కుదరలేదు. అయితే ఈ నెల నాలుగో తేదీన అనూహ్య రీతిలో ఆయన సంతకం పాందిన వైనమిది. 
ఆరోజు ఉదయం బ్నిం ఫోన్ చేశారు. ఈరోజు మీకొకరు ఫోన్ చేస్తారు అన్నారు.
సరేనన్నాను.
కానీ ఎవరి దగ్గర నుంచీ ఏ ఫోనూ లేదు. 
బ్నింగారికి నేను ఫోన్ చేసి ఎవరూ ఫోన్ చేయలేదన్నాను. 
చేస్తారండి అన్నారు బ్నిం.
అనంతరం ఓ అయిదు పది నిముషాలకే నా సెల్ మోగింది. 
కాల్ అటెండ్ అయ్యాను. 
భరణి మాట్లాడుతున్నాను అన్నారు. 
పేరు సరిగ్గా వినిపించక ఎవరండీ అని అడిగాను. 
తనికెళ్ళ భరణి మాట్లాడుతున్నా అనేసరికి నన్ను నేను గిల్లుకు చూశాను నేనేనా అని. ఆయన నాకు ఫోన్ చేసి పలకరించడ మేమిటీ? ఓ అయిదు నిముషాలు మాట్లాడి ఉండొచ్చు ...కానీ గంటల కొద్దీ మాట్లాడినంతగా ఫీలై పోయాను. బ్నింగారికి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పాను. లలితాప్రసాదుకి ఫోన్ చేసి ఆనందాన్ని పంచుకున్నాను. 
ఇదంతా ఒక ఎత్తయితే మరి కొన్ని నిముషాలకు బ్నిం దగ్గర నుంచి వాట్సప్ లో ఓ మెసేజ్....ఒక్కసారి వాట్సప్ చూసుకోండని చెప్పి ఫోన్ పెట్టేశారు.... వెంటనే వాట్సప్ చెక్ చేస్తే మరింత  ఆశ్చర్యం...నమ్మలేని నిజం...పట్టరాని ఆనందం....కారణం....భరణిగారు నా పూర్తి పేరు రాసి తనికెళ్ళ భరణి అని సంతకం చేసి పంపిన ఫోటో మెసేజ్ అది.
ఇంకొన్ని రోజుల్లోనే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరగబోయే కార్యక్రమానికి తానొచ్చినప్పుడు సంతకం చేసి పుస్తకం ఇస్తానన్న భరణిగారి నుంచి ఈలోపే ఆయన ఆటోగ్రాఫ్ అందుకోవడం ఆశ్చర్యమేసింది. 
జీవితంలో నాకు గుర్తుండి నేనుగా ఓ ప్రముఖుడి నుంచి ఆటోగ్రాఫ్ తీసుకోవడం ఇది రెండోది మాత్రమే. అంతకుముందు నాకిష్టమైన క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తో వృత్తిరీత్యా చిట్ చాట్ చేసి ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్న నేను మూడు దశాబ్దాల తర్వాత నాకెంతో ఇష్టమైన భరణిగారి నుంచి ఆటోగ్రాఫ్ అడిగి తీసుకోవడం. 
ఆయన మాటలూ 
ఆయన స్వరమూ
ఆయన పద్య ధారణా
ఆయన రాతలూ
ఆయన నటనా
నాకెంతో ఇష్టం....
ఆయన నుంచి ఆటోగ్రాఫ్ పొందడానికి కారకులైన బ్నింగారికి మనఃపూర్వక ధన్యవాదాలు.
ఇక్కడో చిన్న జ్ఞాపకాన్ని చెప్పుకోవాలన్పించింది. 
నేను ఉదయం పత్రిక స్పోర్ట్స్ డెస్కులో ఉన్నప్పుడు పద్మనాభన్ అనే ఓ అరవ మనిషిని కలిశాను హిమయత్ నగర్లో. ఆయన క్రికెట్ క్రీడాభిమాని. ఆయన వద్ద వందల ఆటోగ్రాఫులు ఉండేవి. వాటిని ఆయన సేకరించిన తీరు భిన్నమైనది. రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆయన ఓ పెద్ద తెల్ల ఛార్ట్ మీద క్రీడా మైదానం, స్టంప్స్, బ్యాటు, బాలు బొమ్మలు గీసి మైదానానికి వెళ్ళి ఇరు జట్ల ఆటగాళ్ళ సంతకాలూ ఆ ఛార్ట్ మీద చేయించుకునేవారు. ఒక్కోసారి ఒక్కోలా ఆయన క్రికెటర్ల సంతకాలు సేకరించేవారు. ఈ విషయం తెలుసుకుని ఆయన ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి ఆయన సేకరించిన క్రికెటర్ల సంతకాలన్నీ చూశాను. నా దురదృష్టమేమిటంటే అప్పట్లో సెల్ ఫోన్  లేకపోవడమూ కెమేరా లేకపోవడమూ. ఆయన నుంచి ఓ ఫైల్ ఫోటో మాత్రం తీసుకుని ఇంటర్వ్యూ రాసాను ఉదయం పత్రికకు. పత్రికలో ముద్రితమైన ఆ ఇంటర్వ్యూ క్లిప్పింగ్ దాచుకోలేక పోయాను. కానీ ఆయన ఫోటో మాత్రం నా దగ్గర ఓ గొప్ప జ్ఞాపకంగా ఇప్పటికీ ఉంది.


కామెంట్‌లు