జగడాలు లేని ఇంట లక్ష్మీశోభ;-- యామిజాల జగదీశ్
అతనొక ధనవంతుడు. బోలెడంత సంపద. దేనికీ లోటు లేదు. గొప్ప వ్యాపారిగా పేరు గడించాడు.

ఒకరోజు ఆ వ్యాపారి కలలో ప్రత్యక్షమైన లక్ష్మీదేవి "భక్తా! నువ్వూ నీ పెద్దలు చేసిన పుణ్యాల కారణంగా ఇప్పటి వరకూ నేను నీ ఇంట ఉన్నాను. నువ్వు చేసిన పుణ్యాల లెక్క ప్రస్తుతం ముగిసిపోయింది. ఒకటి రెండు రోజుల్లో నేను నీ ఇంట్లోంచి వెళ్ళి పోబోతున్నాను. కనుక నీకీలోపు ఏదన్నా కావాలంటే కోరుకో. కానీ ఇక్కడే నీ ఇంటే ఉండమని మాత్రం అడగకూడదు. మరేదైనా ఆడుగు. మీ ఇంట్లోని వారితో కలిసి ఆలోచించి ఒక నిర్ణయానికి. రేపు నేనొస్తాను మళ్ళీ. అప్పుడు నీకోరికేంటో చెప్పు" అని అదృశ్యమైంది.

మరుసటిరోజు తెల్లారింది. వ్యాపారి ఇంట్లో ఉన్న అందరినీ లేపి కలలో జరిగిందంతా చెప్పాడు. 

మహాలక్ష్మి నన్ను ఏం కావాలో కోరుకోమంది. ఈరోజు మళ్ళీ కలలోకొస్తానంది. ఏమడగాలో మనందరం కలిసి ఓ నిర్ణయినికి వద్దాం అన్నాడు. ఒక్కొక్కరూ ఒక్కొక్కటి చెప్పారు. నవరత్నాలను వరంగా అడగమని. ఆభరణాలను అడగమని. పప్పుదినుసులు భారీగా అడగమని. ఓ పదిళ్ళు ప్రసాదించమని....ఇలా రకరకాల కోరికలు వెలిబుచ్చారు.

అయితే ఆ ఇంట అందరిలోనూ ఆఖరిదైన అమ్మాయి "మనం నగనట్రా వంటివెన్ని అడిగినా అవేవీ మన ఇంట ఉండిపోవు. ఎందుకంటే మహాలక్ష్మి మన ఇంట్లో నించిళవెళ్ళిపోతున్నానని ఎప్పుడో చెప్పిందో ఆ క్షణమే ఇవన్నీ కూడా పోతాయి.
లేదా స్థిరంగా ఉండకుండాపోవడం ఖాయం. కనుక మన ఇంట ఎప్పూడూ ప్రేమానురాగాలు నిలకడగా ఉండాలని వరం కోరుకో చాలు" అంది.

ఆ అమ్మాయి చిన్నదైనా చెప్పిన మాట బాగుందనుకున్నాడు వ్యాపారి. ఆ సూచననే అడగాలని ఖాయం చేసాడు. ముందురోజు చెప్పినట్టే లక్ష్మీదేవి మళ్ళీ ఈరోజూ కలలోకొచ్చింది. 

"ఏమిటీ మీరందరూళకలిసి ఓ నిర్ణయానికి వచ్చేరా" అని అడిగింది లక్ష్మీదేవి.

"అమ్మా తల్లీ! మా ఇంట ఎప్పుడూ ప్రేమానురాగాలు స్థిరంగా ఉండేటట్లు చూడండి. ఇదొక్కటి చాలమ్మా" అన్నాడు వ్యాపారి.

లక్ష్మీదేవి నవ్వుతూ "పుత్రా! ఇటువంటి ఓ వరాన్ని కోరి మళ్ళీ నీ ఇంట్లోనే నన్ను ఉండేలా కట్టిపడేశావు. ఏ కుటుంబంలోనైనా ఒకరికొకరు ప్రేమతో అన్యోన్యంగా కలసిమెలసి పరుష మాటలు అనుకోకుండా ఉంటారో ఆ ఇంట నేను కచ్చితంగా ఉంటాను. కనుక నువ్వా కోరిక కోరావు కనుక నేను మళ్ళీ నీ ఇంట్లోనే ఉండిపోతున్నాను" అని అదృశ్యమైపోయింది లక్ష్మీ అమ్మవారు. 
 
ఏ ఇంట కుటుంబంలోని పెద్దవాళ్ళను గౌరవిస్తారో, ఎక్కడ సభ్యతా సంస్కారం ఉంటాయో, పరస్పరం మర్యాద ఇచ్చిపుచ్చుకుంటారో, ఇతరుల చేతలపై కోపం వచ్చినప్పుడు నానా మాటలు అనకుండా సామరస్యంగా ఉండటానికి కృషి చేస్తారో, కోపతాపాలకు తావివ్వక ఘర్షణపడక ప్రేమానురాగాలతో ఐక్యంగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి నిలకడగా ఉంటుందనేదే ఈ కథ సారాంశం. అంతేతప్ప ఇంట్లో ఒకరితో ఒకరు కస్సుబుస్సులాడుతూ తిట్టుకొంటూ కొట్టుకుంటూ ఉంటే ఆ ఇంట ప్రశాంతత కొరవడుతుంది. మంచి పనులూ చేయలేరు. కోపాతాపాలవల్ల జగడాలవల్ల అసలు మంచి పని చేయాలనే ఆలోచన పుట్టదు. కనుక కలసిమెలసి ఒక మాటమీద నిలవడం ఎంతో ముఖ్యం. 



కామెంట్‌లు