గీతాజయంతి శుభాకాంక్షలు అందిస్తూ
. --------------------
1.
వ్యాసప్రణీతం జ్ఞాననవనీతం!
ఉపనిషత్సారం,
పరమశాంతిధామం!
స్వధర్మాచరణమే,
జీవితాంతం!
విధినిర్వహణే,
జీవనపరమార్థం!
అందు మరణమైనా,
శ్రేయోదాయకమే!
2.దుఃఖాంధకార,
జననకారణం అజ్ఞానం!
జ్ఞానదీప ప్రజ్వలనం
నిర్మూలన సాధనం!
జీవితం విషాదారంభమే,
అవును నిజమే!
విషాదాంతం కాకూడదు,
కావాలి వివేకమే!
మనిషి జయించాలి,
హృదయ దౌర్బల్యం!
3.స్థితప్రజ్ఞుడై నిర్వహించాలి,
తన కర్తవ్యం!
ఫలితం ఆశిస్తే,
అదే బంధం!
లభించింది స్వికరిస్తే,
నిర్మోహత్వం!
తద్వారా ప్రాప్తమయ్యేదే,
నిశ్చలతత్త్వం!
మరి తృప్తి, అంతిమంగా,
జీవన్ముక్తి!
4. బీజాక్షర సమాహారం,
అక్షరబోధివృక్షం!
తత్త్వజ్ఞాన గవాక్షం,
దైవం ధర్మపక్షం!
అసలైన విజ్ఞాననిధి,
ఆస్తికత్వపునాది!
గీతాధ్యయనమే,మా"నవ",
జీవనపరమావధి!
గీత తోడుగా సాగడమే,
మనవిధి!
5.శ్లోకంతో శోకదావానలం,
ఆరుతుంది!
పాదంతో పాదం,
ముందడుగేస్తుంది!
ధర్మక్షేత్రాన చతికలబడ్డవాడు,
చెక్కబడ్డాడు!
విజయసారథి తోడుతో,
విజయుడయ్యాడు!
భావితరాల వికాసానికి,
విజయవారధిగా నిలిచాడు!
----------------------------------------
జ్ఞానప్రస్థానం;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి