సంప్రదాయ ఆహారపు అలవాట్లలో మనం చాలా పోగొట్టుకొన్నాం. కాలం మారుతున్నపుడు మనం కూడా కాలానికి అనుగుణంగా మారక తప్పదు. అయితే ఈ మార్పు ఇతరులని అనుకరించడం వల్ల తెచ్చిపెట్టుకున్న మార్పా లేక మన పునాది ఆధారంగా కాలానుగుణంగా ప్రాంతీయ వాతావరణ నేపధ్యంగా తెచ్చుకుంటున్న మార్పా అన్న అంశం మీద స్పష్టత ఉండాలి. సంప్రదాయ వంటల్ని సూక్ష్మంగా పరిశీలిస్తున్నపుడు కొన్ని కాలానికి తగ్గట్టు మరికొన్ని శరీర ప్రకృతికి తగ్గట్టు, ఇంకా కొన్ని ప్రాంతీయతని అట్టిపెట్టుకుని ఉన్నట్టు చూడగలం. వైవిధ్యమున్న వంటల్లో వైవిధ్యమున్న పచ్చళ్లు, ఊరగాయలు గురించి ముచ్చటించుకోవడం నేటి మన ముచ్చట. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, జానపదగిరిజన విజ్ఞానపీఠం వరంగల్లు, తూర్పు గోదావరి జిల్లాలోని ఆదుర్రు, పల్లిపాలెం, రమణక్కపేట, తాళ్లూరు, గుర్తూరు లో జరిపిన క్షేత్రపర్యటన సమాచారం దీనికి ఆధారం.
తెలుగు వంటకాలలో ఊరగాయ, పచ్చళ్లకు కూడా ప్రాధాన్యత ఉంది. కూరలు లేకపోయినా పచ్చడి ఉంటే చాలు అన్నంతగా వాటి వ్యాప్తి ఉంది. అయితే తినడంలో ఎవరి అలవాటు వారిదే. వైవిధ్యం ఉంది. సాధారణంగా ఊరగాయలు, పచ్చళ్లు తయారీలో కాని వాడుకోవడంలో కాని వైవిధ్యం ఉంది. అయితే తూర్పు గోదావరి జిల్లాలో ఈ రెండింటిని పచ్చళ్లుగానే వ్యవహరిస్తున్నారు.
పచ్చడి అంటేనే ఉగాది పచ్చడి మనకు ముందుంటుంది. ఆచారాలలో భాగమైన ఈ పచ్చడిని కొత్తకుండలో చింతపండును నానబెట్టి, రసం తీసి, అందులో బెల్లం, వేప పువ్వు, మామిడికాయ ముక్కలు, ఉప్పు, మిరపకాయలు, శనగ పప్పు, చెరుకు రసం, అరటి పండ్లు వేసి అన్ని కలిపి పచ్చడిని చేస్తారు. అరటికాయ, అరటిదూటి, అల్లం, ఉసిరికాయ, కొబ్బరి, క్యాబేజి, గోంగూర, టమాటా, నల్లేరు, మెంతికూర, వంకాయ, సీకాయ ఆకు లాంటివి రెండు మూడు రోజులు నిలవచేసుకొనే పచ్చళ్లలో, దబ్బకాయ, దోసకాయ, నారింజ, నిమ్మకాయ, మామిడికాయ, వంకాయలు లాంటివి కొన్ని నెలలపాటు నిలవచేసుకొనే పచ్చళ్లకు వాడుకొంటున్నారు.
అరటికాయ పచ్చడి (అరటికాయలను పొయ్యిలో వేసి కాల్చి, పచ్చిమిర్చి, జిలకర నూనెలో వేసి వేయించి, కాల్చిన అరటికాయను, వేయించిన పచ్చిమిర్చి, జిలకరను రోట్లో వేసి దంచి, తరువాత తాళింపు పెడతారు), అరటిదూటి పచ్చడి (అరటిదూటిని ముక్కలుగా చేసి, ఒక దాకలో నూనె పోసి తాళింపు పెట్టి, అందులో పచ్చిమిర్చి, అరటిదూటి ముక్కలను వేసి, వాటికి తగినంత ఉప్పు, కారం వేసి ఉడికించి దించుతారు), అల్లం పచ్చడి (అల్లం ముక్కలు, ఎండుమిర్చి, జిలకర, కరివేపాకు అన్నింటినీ నూనెలో వేయించి, రోట్లో వేసి దంచి, వీటికి కొంచెం బెల్లం, చింతపండును కూడా కలిపి దంచి లేదా నూరి పచ్చడి చేస్తారు), కరివేపాకు పచ్చడి (కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, ఉప్పు వీటన్నింటినీ కలిపి నూరి, చింతపండు పులుసుతో కలిపి ముద్దగా చేస్తారు), కొబ్బరి పచ్చడి (కొబ్బరి కోరును నూనెలో వేయించి, తరువాత దానికి మసాలా వస్తువులు, ఉప్పు, కారం కలిపి రుబ్బి, ఈ రుబ్బిన ముద్దను చింతపులుసులో కలుపుతారు. కొందరు చింతపండు పులుసుకు బదులుగా పెరుగు గానీ, మజ్జిగ గానీ పోసి ఇడ్లీలోకి నంజుకుంటారు. కొందరు కొబ్బరి కోరులో చింతపండు రసం వేసి రుబ్బి, తరువాత ఒక గిన్నెలో నూనె పోసి అందులో ఎండుమిర్చి, కరివేపాకు, మినపపప్పు లను వేసి తాళింపు పెట్టి, తరువాత రుబ్బిన కొబ్బరి కోరును వేసి ఉడికించి దించుతారు. మరి కొంత మంది పచ్చి కొబ్బరిని నూనెలో వేయించి, వేయించిన కొబ్బరితో పాటు పచ్చిమిర్చి, కరివేపాకులను రోట్లో వేసి దంచి, తరువాత తాళింపు పెడుతారు).
ఉసిరికాయ పచ్చడి (ఉసిరి కాయలను పిన్నీసుతో కోసి, వాటిని ఒక కుండలో వేసి, ఆ కాయలకు మసాలా (ఆవాలు, ధనియాలు వేపి దంచినది), కారం, ఉప్పు కలిపి, తరువాత ఒక దాకలో నూనెను వేడి చేసి, నూనె చల్లారిన తరువాత ఆ నూనెను కాయలకు కలుపుతారు), పెద్ద ఉసిరికాయ పచ్చడి (ఉసిరికాయలను ముక్కలుగా కోసి, ఆ ముక్కలకు పచ్చిమిరప కారం, ఆవపిండి, ఉప్పు, మెంతులు అన్నింటినీ కలిపి, అందులో వేడి చేయని నూనె పోసి , పచ్చడిని ఒక జాడీలో పెట్టి ఊరబెడుతారు).
గోంగూర పచ్చడి (ఒక దాకలో నూనె పోసి అందులో ఎండుమిర్చి, జిలకర, వెల్లుల్లి, మినపపప్పులను వేసి వేయించి, ఒక గిన్నెలో గోంగూరను నీటిలో ఉడికించి, తరువాత నూనెలో వేయించిన వాటిని, నీటిలో ఉడికించిన గోంగూర, వేరుశెనగ పప్పు, నూపప్పు, ఉప్పు కలిపి రోట్లో వేసి రుబ్బి, రుబ్బిన ఈ పచ్చడిని తరువాత తాళింపు పెడుతారు. కొందరు ఒక దాకలో నూనె పోసి తాళింపు పెట్టి, అందులో చింతపులుసు పోసి, ఎండు రొయ్యలు, గోంగూర, ఉప్పు, కారం వేసి ఉడికించి దించుతారు. ఇంకొందరు గోంగూర ఆకులను నీటిలో ఉడికించి, రోట్లో వేసి నూరి, తరువాత ఒక దాకలో నూనె పోసి తాళింపు పెట్టి అందులో నూరిన గోంగూరను వేసి, దానికి ఉప్పు, వర్రలను (మసాలాపొడి) కలిపి ఉడికించి దింపుతారు. మరికొందరు గోంగూరను కడిగి ఒక చాపలో వేసి ఎండబెట్టి, రెండు, మూడు రోజుల తరువాత ఒక గిన్నెలో నూనె పోసి అందులో జిలకర, ఆవాలు, శనగ పప్పు వేసి వేయించి, తరువాత అందులో ఎండబెట్టిన గోంగూరను వేసి బాగా వేయించిన తరువాత ఆకుకు ఉప్పు, కారం కలుపుతారు. ఈ పచ్చడిని పెట్టిన రెండు, మూడు రోజుల తరువాత తింటారు. కొంత మంది గోంగూరను కడిగి, ఎండబెట్టి, నూనెలో వేయించి, వాటితో పాటు చింతపండును కలిపి రుబ్బి, తరువాత ఒక దాకలో నూనె పోసి జిలకర, వెల్లుల్లి, ఉప్పు వేసి తాళింపు పెట్టి అందులో రుబ్బిన ముద్దను వేసి కలిపి పచ్చడిని చేస్తారు), చింతకాయ పచ్చడి (పచ్చి దోర చింతకాయలకు తొక్కు తీసి, వాటికి ఉప్పు కలిపి ఊరబెట్టి, మూడు రోజుల తరువాత వాటిని రోట్లో వేసి దంచి, కాయలలోని గింజలను తీసివేసి, గుజ్జును రుబ్బి జాడీలో పెట్టి ఎండబెడుతారు. తరువాత ఆ గుజ్జును మెత్తగా రుబ్బి, తాళింపు పెడతారు, లేదా పచ్చి దోర చింతకాయలను పెచ్చులు తీసి, ఎండ బెట్టి, ఉప్పు కలిపి రోట్లో వేసి దంచుతారు. మూడు రోజుల తరువాత గింజలను తీసివేసి, పండు మిరప కాయలను రుబ్బి, చింతకాయ పచ్చడి ఉన్న జాడీలోనే వేస్తారు. అవసరమున్నప్పుడు తాళింపు పెట్టుకుంటారు).
టమాటా పచ్చడి (టమాటాలను కడిగి, వాటికి తడి లేకుండ ఎండబెట్టాలి. తరువాత వాటిని ముక్కలుగా కోసి, వాటికి ఉప్పు చింతపండును కలిపి, ఊరబెట్టాలి. చింతగుజ్జు అంతా టమాటా ఊటలోనే కలిసిన తరువాత దానికి ఎండుమిర్చిని కలిపి రుబ్బి, ఒక దాకలో నూనె పోసి, అందులో శనగపప్పు, మెంతులు, జిలకర, వెల్లుల్లి వేసి తాళింపు పెట్టి, ఈ తాళింపు నూనెను రుబ్బిన పచ్చడిలో కలిపి, జాడీలో పెడుతారు). దబ్బకాయ పచ్చడి (దబ్బకాయలను ముక్కలుగా కోసి, వాటికి ఉప్పు కలిపి ఊరబెట్టి, తరువాత ముక్కలను ఊటలో నుంచి తీసి ఎండబెట్టి, మరలా వాటికి ఊటను కలిపి, తరువాత ఒక దాకలో నూనె పోసి అందులో ధనియాలు, జిలకర, ఆవాలపిండి, కారం, వెల్లుల్లి వేసి తాళింపు పెట్టి, ఈ తాళింపును ముక్కలకు కలుపుతారు), దోస ఆవకాయ (దోసకాయ ముక్కలకు ఉప్పును కలిపి మూడు రోజుల పాటు ఊరబెట్టి, తరువాత ఆ ముక్కలకు తాళింపు పెట్టి, పచ్చడిని జాడీలో పెడుతారు). నల్లేరుకాడ పచ్చడి (నల్లేరు కాడలను చిన్న ముక్కలుగా తరిగి, ఒక దాకలో నూనె గానీ, నీళ్ళు గానీ పోయకుండా వేయించి, తరువాత అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చిలను నూనెలో వేయించి, వాటిని సన్నికల్లు మీద నూరి, ఒక దాకలో నూనె పోసి, తాళింపు పెట్టి అందులో నూరిన ముద్దను, వేయించిన కాడలను వేసి ఉడికించి, ఉప్పు వేసి దింపుతారు, లేదా నల్లేరు తీగ లేత ఆకులను విరిచి వాటిని మంగళంలో వేయించి, ఆ కాడలను నూరి దానికి వర్రపొడిని కలిపి, మూకుడులో వేసి ఉడికించి దించుతారు). పచ్చిమిర్చి పచ్చడి (ఒక దాకలో నూనె పోసి తాళింపు పెట్టి, అందులోనే పచ్చిమిర్చిని కూడా వేసి వేయించి రుబ్బుతారు). మెంతికూర పచ్చడి (మెంతికూరను, ఎండుమిర్చిని నూనెలో వేయించి, రోట్లో వేసి దంచి, తరువాత తాళింపు పెడుతారు), వంకాయ పచ్చడి (వంకాయలను పొయ్యిలో వేసి కాల్చి, దానిమీద ఉండే పొప్పెరను తీసివేసి, లోపలి గుజ్జంతా తీసి రోట్లో వేసి కుమ్మి, తరువాత నూనెలో ఎండుమిర్చి, గుజ్జును కలిపి వేయించి, ఉప్పు కలిపి, మరలా రోట్లో వేసి కుమ్ముతారు), సీకాయ పచ్చడి (సీకాయ ఆకులను రోట్లో వేసి దంచి, తరువాత ఒక దాకలో నూనె పోసి తాళింపు పెట్టి, అందులో దంచిన ఆకులను వేసి ఉడికిస్తారు).
నారింజకాయ పచ్చడి (నారింజ కాయలను ముక్కలుగా కోసి, అందులోని గింజలను తీసివేసి ఎండబెట్టి, తొక్కలను జాడీలో వేసి, ఆ ముక్కలకు ఉప్పు, కారం, నూనె కలిపి మగ్గబెడుతారు, లేదా నారింజ కాయలను ముక్కలుగా కోసి, గింజలను తీసివేసి, ముక్కలకు ఉప్పును కలిపి మూడు రోజులు ఊరబెట్టి, తరువాత ముక్కలను ఒక గుడ్డ మీద ఎండబెట్టి, ఎండిన దబ్బలకు కారం, ఉప్పు కలిపి మరగబెట్టి చల్లార్చిన నీటిని పోసి ముక్కలను బాగా కలిపి, వాటిని జాడీలో వేసి ఎండబెట్టి, నూనెను వేడి చేసి అందులో వెల్లుల్లి, ఎండుమిర్చి, జిలకర వేసి వేయించి, ఆ నూనెను పచ్చడిలో పోసి కలుపుతారు. కొందరు నారింజ కాయలను బద్దలుగా కోసి, ఉప్పు వేసి రెండు రోజులు ఊరబెట్టి, ఎండబెడుతారు. తరువాత వాటికి ఆవపిండి , బెల్లం, ఉప్పు, కారం, వేయించిన మెంతులు, ఊటను కలిపి, రెండు రోజుల తరువాత ఉప్పు, కారం, సరిపోయిందో లేదో చూసుకుంటారు. ఈ పచ్చడిని జాడీలో గానీ, కుండలో గానీ పెట్టి, గుడ్డను వాసిన కడుతారు). నిమ్మకాయ పచ్చడి (నిమ్మకాయ ముక్కలకు ఉప్పును కలిపి జాడిలో పెట్టి మూడు రోజులు ఊరబెడుతారు. తరువాత వాటిని మంచం మీద ఎండబెట్టి, అలాగే ఊటను కూడా ఎండబెట్టి, తరువాత ఎండిన ముక్కలకు ఆవపిండి, కారం కలిపి, అందులో వేడి చేసి చల్లార్చిన నూనె పోసి, జాడిలో పెడుతారు. కొందరు నిమ్మకాయలను ముక్కలుగా కోసి, ఉప్పు కలిపి వాటిని కుండలో గానీ, జాడీలో గాని ఊరబెట్టి, తరువాత వాటికి ఉప్పు, కారం, మెంతి పొడి కలిపి, నూనెను వేడి చేసి, అందులో వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి తాళింపు పెట్టి, నూనెను చల్లార్చి ముక్కలకు కలిపి, పచ్చడిని జాడీలో పెట్టి, వాసిన కడుతారు. ఇంకొందరు నిమ్మకాయలను ముక్కలుగా కోసి, వాటికి ఉప్పు కలిపి జాడీలో ఊరబెట్టి, ముక్కల వగరు పోయిన తరువాత వాటిని మైకాకవరు మీద ఎండబెట్టి, తరువాత మిరపకాయలను, ఆవాలను, జిలకరను విడివిడిగా నూనెలో వేయించి, వాటిని పొడి చేసి, తరువాత నిమ్మకాయ ముక్కలలో మెంతులు, నూనె, వేయించిన మిరపకాయలు-ఆవాలు-జిలకర పొడిని కలిపి, పచ్చడిని జాడీలో పెట్టి వాసిన కడుతారు). పచ్చిమిర్చి ఆవకాయ (ఆవాలు, మెంతులు, కారం, ఉప్పు అన్నింటినీ కలిపి నూరి, తరువాత పచ్చిమిరపకాయలను రెండుగా చీరి, వాటి మధ్యలో నూరిన ముద్దను కొద్ది, కొద్దిగా పెట్టి, వాటికి నూనె కలిపి, జాడీలో పెట్టి ఊరబెడుతారు). పచ్చిరొయ్యి ఆవకాయ (టైగర్ రొయ్యలకు తల, తోక, చర్మమును తీసివేసి, బాగా కాగిన నూనెలో రొయ్యలను వేయించి, ఆ ముక్కలకు పచ్చి కారం, ఆవపిండి, ఉప్పు, పచ్చి నూనెలను కలిపి, జాడీలో పెట్టుకుంటారు).
మాగాయ పచ్చడి (మామిడికాయల తొక్క తీసి, ముక్కలుగా చేసి వాటికి ఉప్పు కలిపి మూడు రోజులు ఊరబెట్టి, తరువాత వాటిని ఒక గుడ్డలో ఎండబెట్టి, అలాగే ఊటను కూడా ఎండబెట్టి, తరువాత ఒక మూకుడులో నూనె పోసి అందులో మామిడి ముక్కలు, మెంతులు, వెల్లుల్లి వేసి తాళింపు పెట్టి, పచ్చడిని జాడీలో పెట్టుకుంటారు. కొందరు మామిడికాయల తొక్కుతీసి, ముక్కలుగా చేసి ఉప్పు కలిపి మూడు రోజులు ఊరబెట్టి, తరువాత వాటిని ఒక గుడ్డ మీద పోసి ఎండబెట్టి, అలాగే ఊటను కూడా ఎండబెట్టి, ఒక మూకుడులో నూనె పోసి అందులో మెంతులు, వెల్లుల్లి, మామిడి ముక్కలను వేసి కలిపి, పచ్చడిని జాడీలో పెట్టుకుంటారు), మామిడికాయ పచ్చడి (మామిడి ముక్కలను నీటిలో ఉడికించి, వాటిని ఒక గుడ్డ మీద వేసి మూడు రోజులు ఎండబెట్టి, తరువాత వాటికి నూనె, ఆవపిండి, ఉప్పు, కారం కలిపి కుండలో పెట్టి, దాని మీద మూతపెట్టి, ఒక గుడ్డను వాసిన కడుతారు), వంకాయ ఆవకాయ (వంకాయలను ముక్కలుగా కోసి, వాటికి ఉప్పు, కారం, ఆవాలు, జిలకర, మెంతులు అన్నింటినీ కలిపి, అందులో వేడి చేసి చల్లార్చిన నూనెను పోసి, జాడీలో పెడుతారు). ఆవకాయ పచ్చడి (మామిడి కాయలను చిన్న ముక్కలుగా కోసి, వాటికి ఉప్పును కలిపి ఊరబెట్టి, ఊటనంతా మరోక జాడీలోకి తీసుకొని, ముక్కలను ఎండబెట్టి, తరువాత ఆవాలు, మేంతులు వేయించి పొడికొట్టి, అలాగే మిరపకాయలను కూడా దంచి పొడిచేసి, ఒక మూకుడులో బెల్లం పాకం పట్టి, ఆ పాకాన్ని ముక్కలపైన పోసి, దంచిన పొడులను, పచ్చి నూనెను కలిపి, జాడీలో పెట్టి గుడ్డ కట్టి, నిల్వచేస్తారు. మరికొందరు మామిడి ముక్కలకు తగినంత ఉప్పు, కారం, ఆవపిండి, మెంతులు, వెల్లుల్లి, పచ్చినూనె లను కలిపి, ఒక జాడీలో పెట్టి, మూడు రోజుల తరువాత ఉప్పు సరిపోయిందో లేదో చూస్తారు. ఒకవేళ సరిపోకుంటే వాటికి తగినంత ఉప్పు కలిపి, జాడిలోనే పెట్టి భద్రపరుస్తారు. ఇంకా కొంతమంది మామిడికాయలను ముక్కలుగా కోసి, తరువాత నూనెలో జిలకర, మెంతులు, ఆవాలను వేయించి అందులో మామిడి ముక్కలను వేసి, వాటికి తగినంత ఉప్పు, కారం కలిపి జాడీలో పెడుతారు. మూడు రోజుల తరువాత మామిడి ముక్కను జాడీ నుంచి తీసి ఉప్పు సరిపోయిందో లేదో చూస్తారు. ఈ పచ్చడికి బెల్లాన్ని కలిపి బెల్లం ఆవకాయ కూడా పెడుతారు), ఉసిరికాయ ఊరగాయ (ఉసిరికాయలను ముక్కలుగా కోసి, ఆ ముక్కలకు ఉప్పు కలిపి నెలరోజుల పాటు ఊరబెట్టి, ఊరిన తరువాత వాటిని ఊట నుంచి తీసివేసి, రోట్లో వేసి దంచి గింజలను తీసివేసి, ఎండబెట్టి, తరువాత ముక్కలకు ఉప్పు, కారం కలిపి జాడీలో పెడుతారు).
పచ్చడిలో చింతపండుకి ప్రాధాన్యత ఉంది. అయితే అరటికాయ పచ్చడి, అరటిదూటి పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, దబ్బకాయ, దోసకాయ పచ్చడి, నారింజ, నిమ్మకాయ పచ్చడి, పచ్చిమిర్చి పచ్చడి, పచ్చిరొయ్య ఆవకాయ, మాగాయ పచ్చడి, వంకాయ ఆవకాయ లాంటి వాటిలో చింతపండు వాడకం లేనట్టే. కొబ్బరి పచ్చడిలో మాత్రం చింతపండు కలిపి లేదా లేకుండా చేసుకొంటారు. ఊరగాయగా చేసుకొనే పచ్చడిలో మాత్రం చింతపండుకు బదులు ఆవపిండి వాడకం ఉంది.
దంచి లేదా నూరి చేసుకొనే పచ్చళ్లు రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి. ఆవకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, దబ్బకాయ పచ్చడి లాంటివి దాదాపు ఒక సంవత్సరం నిలవ ఉంటాయి. నిమ్మకాయ పచ్చళ్లు మాత్రం ఆరేడు నెలలు మాత్రమే. గోంగూర చేసే దాన్ని పట్టి వాడే వస్తువులను బట్టి రెండు మూడు రోజుల నుంచి రెండు మూడు నెలల దాకా ఉంటుంది.
ఆవకాయ పచ్చడి వేడి చేస్తుందని, కాళ్ల సలుపులు వస్తాయని పురిటాలికి పెట్టరు. నడుము సలుపులు వస్తాయని చింతకాయ పచ్చడి కూడా పెట్టరు. ఆకలి బాగా పెరుగుతుందని నల్లేరుకాడ పచ్చడి పురిటాలికి తప్పక పెడతారు. పైత్యానికి అల్లం పచ్చడి, మాగాయ పచ్చడి మంచిదన్న తెలివిడి ఉంది. ఊరగాయలుగా చేసుకొన్న పచ్చళ్లని పవిత్రంగా చూసుకొనే అలవాటు ఉంది. మంగళ శుక్ర వారాల్లో తీయరు. పచ్చడిని పెట్టడానికి ముందు స్నానం చేయడం, మైల అయినవారు ఊరగాయ జాడీలను తాకకపోవడానికి కారణం కూడా అదే అయి ఉంటుంది. పెద్ద ఉసిరికాయ సాయంత్రం తింటే ఆయుష్షు తగ్గుతుందని సాయంత్రం తినరు, పగలు మాత్రమే వాడుకొంటారు. ఇందులో ఆరోగ్యపరంగా ఉన్న శాస్త్రీయతని చూడాల్సి ఉంది. ఆవకాయ, కొబ్బరి, గోంగూర, నిమ్మకాయ పచ్చళ్లకు వ్యాప్తి ఎక్కువ. తర్వాత అల్లం, చింతకాయ, నల్లేరు, నారింజ, మాగాయ పచ్చళ్లు. మిగతావన్నీ ఆ యా ఊర్లలో మాత్రమే సేకరించగలిగినాం.
ఇందులో ముచ్చటించుకొన్న పచ్చళ్లు కేవలం అయిదు ఊర్లలో సేకరించినవే అన్నపుడు మిగతా ఊర్లలో కూడా సేకరించగల్గితే పచ్చళ్ల వైవిధ్యం ఎంత విశాలంగా ఉంటుందో ఊహించగలం. భావి పరిశోధకులు అటు వైపు తమ దృష్టి సారిస్తారని ఆశిద్దాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి